Take a fresh look at your lifestyle.

పెరిగిన అనిశ్చితి ..!

” శ్రీనగర్ పొరుగు ప్రాంతమైన నవాకాడల్‌లో CASO వంటి కార్యకలాపాలు వదిలే పొగ వాసన ఈ ఏడాది మరింతగా ప్రజల ఊపిరిలోకి పోయింది. నవాకాడల్‌లో ఇరుకైన సందులలో, కొన్ని కుటుంబాలు  శిధిలాలలో తమ ఇల్లు దొరుకుతుందేమో అని వెతుకుతున్నాయి. యెంత వెదికినా ఏమీ దొరకక వట్టిచేతులతో వెళ్లిపోయిన కుటుంబాలు వున్నాయి. ..” 

aruna senior journalist delhi
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

గత సంవత్సరం ఆగష్టు 5, న మోదీసర్కార్ జమ్మూ కాశ్మీర్ లో అమలులో ఉన్న ఆర్టికల్ 370 ఉపసంహరించుకుంది. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా వేలాది మంది కాశ్మీరీలను అరెస్టు చేశారు, ప్రభుత్వం కఠినమైన కర్ఫ్యూను అమలు చేసింది. ప్రపంచంలోనే అతి దీర్ఘకాల ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అమలు అవుతున్నది. ఇలాంటి సమయంలో కాశ్మీర్ ప్రజల గురించి రాయాలి అంటే చేతులు వణికే పరిస్థితి. ఆర్టికల్ 370 వుపయోగించి భారతదేశంలో ఉన్న ఏకైక ముస్లిం-మెజారిటీ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించటం ద్వారా, బయటి వ్యక్తులు ఆస్తిని కొనుగోలు చేసే హక్కు కలిపించాం. ఇకపై కాశ్మీర్ వ్యాలీలో శాంతి.. అభివృద్ధి..సాధ్యం అని ప్రకటించింది.ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏడాది ప్రగతి ఏంటో చూద్దాం.. గత సంవత్సర కాలంలో కాశ్మీర్ మరింత హింస, అనిశ్చితిని చూసింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్నా అనేక ఘర్షణలు నిలిచిపోయినా కూడా న్యూఢిల్లీ కాశ్మీర్ లో సైనిక చర్యలను ముమ్మరం చేసింది. చాలా కాలంగా ప్రపంచంలోని అత్యంత మిలిటరైజ్డ్ జోన్‌గా పరిగణించబడుతున్న కాశ్మీర్‌కు ఇది కొత్తేమీ కాదు. 1947 నుండి భారత్ పాకిస్తాన్ మధ్య నలుగుతున్న కాశ్మీర్ రెండు యుద్ధాలు చూసింది. కాశ్మీర్ భారత్ తో కలిసి ఉండాలి.. కాశ్మీర్ కు స్వతంత్రం కావాలి లేదా పాకిస్తాన్ లో విలీనం కావాలి అనే కాశ్మీర్ ప్రజలు.. భారత భద్రతా దళాలు.. కాశ్మీరీ తిరుగుబాటుదారుల మధ్య దశాబ్దాలగా నలిగిపోయి తీవ్రంగా నష్టపోయారు.

ఇక్కడి ప్రజల జీవితంలో అదృశ్యం కావటం, హింస, అత్యాచారం, ప్రజా నిరసనలకు క్రూరమైన ప్రభుత్వ ప్రతిస్పందన షరా మాములు. 1990 నుంచి మార్చి 2017 మధ్య, 41,000 వేల జవానులు..రాజకీయ కార్యకర్తలు..వేర్పాటు వాదులతో పాటుగా 14,000 మంది సామాన్య పౌరులు మరణించారు. గడచిన ఏడాదిలో “జమ్మూ కాశ్మీర్ కోయాలిటిన్ అఫ్ సివిల్ సొసైటీ అండ్ ది అసోసియేషన్ అఫ్ పేరెంట్స్ అఫ్ డిసిపియర్డ్ పర్సన్స్” అనే సంస్థ ప్రకారం 143 మంది మిలిటెంట్స్ హతమయ్యారు. ఒక్క జూన్‌లోనే 62 మంది మరణించారు. సామాన్య పౌరులు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 32 మంది మరణించారు. జూన్ 26న, భారత పారా మిలటరీ దళాలకి.. అనుమానిత ఉగ్రవాదులకు.. మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 5 ఏళ్ల పిల్లవాడు మరణించాడు. జూలై 1న ఉత్తర కాశ్మీర్‌లో తన 3 ఏళ్ల మనవడు ఎదుట 65 ఏళ్ల పెద్దాయన చంపబడ్డాడు. అతను భారత దళాలచే కాల్చి చంపబడ్డాడని స్థానికులు ఘోషించారు.

గత ఏడాది జరిగిన హింస నిర్బంధం చాలా మంది కాశ్మీరీలను నిరాశ్రయులను చేసింది. COVID-19 నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నకాశ్మీరీ కుటుంబాలకు ఇది ఒక డబుల్ విషాదంగా పరిణమించింది. గత సంవత్సరంలో 50కి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి. 22 మే 2019 నాడు భారత సాయుధ దళాలు శ్రీనగర్ దిగువ పట్టణంలోని నవకడాల్ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO)ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా భద్రతా దళాలు ప్రజలను ప్రశ్నించాయి. వారి ఇళ్లను సరి అయిన కారణం లేకుండా సోధించాయి. నవకడాల్ ప్రాంతంలో భారత దళాలు, కాశ్మీరీ అనుమానిత ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధంలో తుపాకులు.. పేలుడు పదార్థాలతో కూడిన 12 గంటల యుద్ధం తరువాత, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు అని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఆ ప్రాంతంలో మిగిలిపోయిన పేలుడు పదార్ధాల కారణంగా ముగ్గురు సామాన్య పౌరులు కూడా మరణించారు. నవాకాడల్ ఎన్‌కౌంటర్ శ్రీనగర్ దిగువ పట్టణంలో రెండేళ్లలో జరిగిన మొదటి దాడి. ఉగ్రవాదులు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక నిర్దిష్ట ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భారత దళాలు CASO వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఈ వ్యూహంలో సాధారణంగా సామాన్య పౌరులను విస్తృతంగా వేధింపులకు గురి అవుతారు.

శ్రీనగర్ పొరుగు ప్రాంతమైన నవాకాడల్‌లో CASO వంటి కార్యకలాపాలు వదిలే పొగ వాసన ఈ ఏడాది మరింతగా ప్రజల ఊపిరిలోకి పోయింది. నవాకాడల్‌లో ఇరుకైన సందులలో, కొన్ని కుటుంబాలు శిధిలాలలో తమ ఇల్లు దొరుకుతుందేమో అని వెతుకుతున్నాయి. యెంత వెదికినా ఏమీ దొరకక వట్టిచేతులతో వెళ్లిపోయిన కుటుంబాలు వున్నాయి. 20 ఏళ్ల యామిన్ నాజర్ హింస వలన శిధిలం అయిన ఇల్లు చూసుకుంటూ CASO వంటి కార్యకలాపాల తీవ్రతను వివరించాడు. “మమ్మల్ని అకస్మాత్తుగా యుద్ధభూమికి తీసుకువచ్చినట్లు ఉంది. కొన్ని గంటల వ్యవధిలో ఇరవై రెండు గృహాలు , ఒక బేకరీ కాలిపోయాయి. కొన్ని కుటుంబాలు తమ బంధువులతో కలిసి జీవించడానికి బయలుదేరాయి. ఇది ఒక పీడకల కావాలి అని నేను కోరుకుంటున్నాను. నా మంచం లోంచి లేవగానే నా మునుపు జీవితంతో నేను మేలుకోవాలి అనుకుంటున్నాను ఐతే అది జరగదు అని మనందరికీ తెలుసు. ” నాజర్ తాత, 78 ఏళ్ళ గులాం మొహమ్మద్ నాజర్, శిధిలం అయిపోయిన తమ ఇల్లు నిర్మించడానికి ఎంత కష్టపడ్డాడో గుర్తుచేసుకున్నారు. “50 సంవత్సరాలకు పైగా, నా ఇంటిని నిర్మించడానికి నా రక్తం చెమటను పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు ప్రతిదీ పోయింది, హౌసింగ్ బ్యాంక్ పత్రాలు కూడా పోయాయి” అని ఆయన అన్నారు.

నాజర్ పక్కింటి 13 ఏళ్ల బాసిమ్ ఐజాజ్ ఖాచూ, దాడి మరుసటి రోజు హాస్పిటల్ లో మరణించాడు. ఖాచూ, అతని తల్లిదండ్రులు వివాహం చేసుకున్న ఆరు సంవత్సరాల తరువాత పుట్టాడు వారి ఏకైక సంతానం. దాడి జరిగిన రోజున, ఖాచూ తన స్నేహితులను చూడటానికి ఇంటి నుండి బయలుదేరాడు. తన స్నేహితుడి ఇంటి నుండి నాన్నను పిలిచాడు. ఇంటికి తీసుకుపోటానికి రమ్మని. వీధుల్లో సైన్యం.. అనుమానిత ఉగ్రవాదులు వున్నారు. నువ్వు అక్కడే వుండు అంతా సద్దుమణిగే వరకు ఇంటికి రాకు” అని ఖాచూతో చెప్పి.. వంటగదిలో ఖాచూ తల్లి కౌన్సర్ తో మాట్లాడుతూ ఖాచూ నాన్న కూర్చున్నారు. ఇంతలో బైక్‌లపై ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఖాచూ ఫోన్‌ను తీసుకు వచ్చి ఇచ్చారు. ఆ ఫోన్ గాయపడిన కొడుకు ఫోటోలతో నిండి ఉంది. “నా కొడుకు చిరిగిన ఈద్ దుస్తులను నేను చూశాను, ఆ రోజు ఉదయం ఈద్ దుస్తులను ధరించాలని ఖాచూ పట్టుబట్టాడు.” అని ఖాచూ తల్లి భోరుమన్నారు. CASO సైనికులు ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న ప్రాంతాన్ని శోధించడంలో భాగంగా బట్టల అమ్మకందారుడు ఫరూక్ అహ్మద్ సోఫీ ఇంటిలోకి పోనప్పుడు ఏం జరిగింది ఫరూక్ అహ్మద్ సోఫీ కూతురు మదీనా ఫారూక్ ఇలా వివరించారు. “దళాలు ఇంటిలోకి లోపలికి వచ్చాయి. నా సోదరుడు ఏదైనా ఆయుధాన్ని కలిగి ఉన్నాడా అని ప్రశ్నిచారు.” కుటుంబం మొత్తాన్ని రాత్రి ఒకే గదిలో ఉంచి ఉదయం ఆ ప్రాంతం సురక్షితం కాదని ఫరూక్ అహ్మద్ సోఫీ చెప్పి, కుటుంబంతో పటు ఇంటి నుండి బయలుదేరమని సైన్యం ఆదేశించగా ఆ సాయంత్రం నాటికి వారు నిరాశ్రయులయ్యారు. వారు కట్టు బట్టలతో మిగిలారు. నా కూతురు పెళ్లి కోసం నగలు బట్టలు కొన్నాం. దాడి తరువాత వాటిని సేకరించడానికి మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.” అని ఫరూక్ తన ఇంటి శిధిలాలలో కాలిపోయిన వస్తువులను ఎత్తి చూపుతూ వివరించారు. కాశ్మీర్ లో గత ఏడాదిగా నెలకొన్న శాంతి ఇది..

ఇక అభివృద్ధి గురించి చుస్తే.. వాస్తవానికి, ఆర్టికల్ 370 ను రద్దు చేసినప్పటి నుండి కాశ్మీర్ లో విద్య చాలా కష్టమైంది. గత సంవత్సరం కాశ్మీర్ లాక్డౌన్లోకి వెళ్ళిన ఏడు నెలల వరకు, దాదాపు అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీని వలన 1.5 మిలియన్ల మంది విద్యార్థులు చదువుకి దూరం అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో 70 శాతం యువత నిరుద్యోగంతో వుంది. నిరంతర దాడులు ప్రజల తీవ్ర మానసిక అనారోగ్యానికి కారణమవుతుందిన్నది. మెడిసిన్స్ షన్స్ ఫ్రాంటియర్స్ సంస్థ ప్రకారం. సుమారు 1.8 మిలియన్ల పెద్దలు, అంటే కాశ్మీర్ జనాభాలో 45 శాతం మంది మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. 70 శాతం మంది ప్రజలు హింసాత్మక మరణాలు చూశారు. కొంతమంది యువకులకు మిలిటెన్సీ ఆకర్షణీయమైన అంశం అయిపోయింది.

మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి కట్టుబడి ఉన్నప్పటికీ కాశ్మీర్ యువతలో ఎక్కువ మంది ఆయుధాలు చేపట్టడానికి.. వేర్పాటు వాదం వైపుకు చూడటానికి సిద్దపడుతున్నారు. అనేకమంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు 400 మందికి పైగా-జైలులో లేదా గృహ నిర్బంధంలో ఉన్నారు. మోడీ సర్కార్ చేత అమలు చేయబడిన కొత్త చట్టాలు బయటివారికి కాశ్మీర్ లో ఆస్తులు కొనుగోలుకు వీలు కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఏడాదిలోగా 25 వేల నివాస ధృవీకరణ పత్రాలు మంజూరు చేయబడ్డాయి. భారతదేశంలో వున్నా ఏకైక ముస్లిం-మెజారిటీ రాష్ట్ర డెమోగ్రఫీ మార్చడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఇది ఓ ఉదాహరణగా నిలుస్తుంది. కాశ్మీర్లో జర్నలిస్టులను వేధింపులకు గురిచేస్తూ.. మీడియా కార్యకలాపాలను బాగా తగ్గించారు. న్యూఢిల్లీ తన భారీ వ్యూహాల ద్వారా భారత ప్రజలతో కాశ్మీరీలను కలవనీయకుండా గతంలో కంటే ఎక్కువ దూరాన్ని సమర్ధవంతంగా పెంచింది అని ఏడాది కాలం ఘోషిస్తున్నది.

Leave a Reply