Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్ధుల నమోదు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన సామాజిక, ఆర్థిక సర్వే 2023 గణాంకాల ప్రకారం సంవత్సర వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో  అదనంగా నమోదు అయ్యారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 41 వేల 220  నుండి 2021-22 లో 41 వేల 369 పాఠశాలలకు పెరిగాయి. అంటే పాఠశాలల సంఖ్య 149 ఒకే సంవత్సరంలో పెరిగింది. అలాగే 2020-21 లో ఉన్న 60.40 లక్షల మంది విద్యార్ధుల నమోదు 2021-22కు వచ్చేసరికి 62.30 లక్షలకు పెరిగింది.ప్రభుత్వ పాఠశాలల్లో  మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇంగ్లీష్‌ ‌మీడియంలో బోధన, సోషియో, ఎమోషనల్‌ ‌లర్నింగ్‌, ‌సాఫ్ట్ ‌స్కిల్స్ ‌ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో  చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్‌ ‌పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందుతుండటంతో  గత విద్యా సంవత్సరం కంటే అధికంగా అనగా 6.30 శాతం ప్రవేశాలు ప్రైవేట్‌ ‌పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరంలో సొంతం చేసుకొన్నాయి.

అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అవుతున్న విద్యార్థుల శాతం 2019-20 లో 42.91 శాతం కాగా, 2020-21 లో 43.47 శాతం, 2021-22 లో 49.77 శాతంగా ఉంది. అంటే గత మూడు విద్యా సంవత్సరాలను పరిశీలిస్తే నమోదు శాతం పెరుగుతోంది. ఇదే కాలంలో ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో పరిశీలిస్తే 2019-20 లో 57.09 శాతం వుండగా, 2020-21లో 56.53 శాతం, 2021-22  లో  50.23 శాతంకు పడిపోయింది. అంటే ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా తగ్గింది.ప్రాధమిక స్థాయి నుండి ప్రాధమికోన్నత స్థాయికి ఎలిమెంటరీ నుండి సెకండరీ స్థాయికి వెళుతున్న విద్యార్థుల శాతం దేశవ్యాప్తంగా సగటున 3.83  శాతం కాగా  తెలంగాణలో అది 7.48 శాతం పాయింట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా వ్యవస్థ పటిష్ట చర్యల ఫలితంగా, మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరుగనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో 7,289.54 కోట్ల రూ.లతో  మౌళిక వసతులు మెరుగుపర్చటం  కొరకు 2022 జనవరిలో ప్రభుత్వం  మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ కార్యక్రమం పరిధిలోకి 26 వేల 65  పాఠశాలలు చేరి అభివృద్ధి చెందుతున్నాయి. ప్రారంభ దశలో 3497.62 కోట్ల రూ.లతో 14,71,684 మంది విద్యార్థులు చదువుతున్న 9 వేల 123  పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 12 వివిధ రకాల పనులు అనగా మరుగు దొడ్లు నిర్మాణం, నీటి సరఫరా కొనసాగేలా చర్యలు, విద్యుత్తు సౌకర్యం, త్రాగునీటి సరఫరా, ఉపాధ్యాయులు, విద్యార్ధులకు అవసరమైన సామాగ్రి (ఫర్నీచర్‌)   ‌పాఠశాలలకు పేయింటింగ్‌ ‌చేయుట, గ్రీన్‌ ‌చాక్‌ ‌బోర్డ్సు ఏర్పాటు, కాంపౌండ్‌ ‌వాల్స్, ‌వంట గది నిర్మాణం, డిజిటల్‌ ‌విద్యా బోధన అమలు వంటి పనులు ఈ కార్యక్రమంలో చేపట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏ విషయంలోను వెనుకబడి ఉండరాదనే ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ ‌రావు భావించి ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయనటంలో అతిశయోక్తి లేదు.
 – కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌.

Leave a Reply