Take a fresh look at your lifestyle.

కొరోనా కాటుతో పెరిగిన అసమానతలు..!

“కొరోనా మహమ్మారి కాలంలో పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎక్కువ పన్నులు కట్టారని, ధనికుల ఆదాయం అనేక రెట్లు పెరిగినా పన్నులు అదే నిష్పత్తిలో పెరగలేదని వెల్లడి అవుతున్నది. దేశంలోని అట్టడుగు 552 మిలియన్ల మెుత్తం సంపదకు 98 ధనవంతుల సంపద సమానంగా ఉండడంతో ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతున్నది. ప్రపంచవ్యాప్త జాబితాలో 10 అగ్రదేశాల సంపద 57 శాతం ఉండగా, జాబితా చివరన ఉన్న 50 శాతం పేద దేశాల సంపద 13 శాతమే అని తేలింది.దేశంలో కుబేరులు అందరూ విశాల హృదయంతో తమ సంపదలో కొంత భాగాన్ని దేశ హితానికి పన్నులు/విరాళాల రూపంలో వినియోగిస్తే, అసమానతలు తొలగిపోయి, పేదరికం తగ్గిపోయి, ప్రగతి పథంలో నడుస్తుందనటంలో అతిశయోక్తి లేదు.”

(‘ఆక్స్‌ఫామ్ ఇండియా -‌ ఇనీక్వాలిటీ కిల్స్‌’ నివేదిక ఆధారంగా)

2021లో ఇండియాలో 100 మంది అత్యంత కుబేరుల ఆస్తుల విలువ రూ . 57.3 ట్రిలియన్‌లకు చేరిందని, దేశ బిలియనీర్ల సంఖ్య గతేడాదితో పోల్చితే 102 నుంచి 142 కు (దాదాపు 39 శాతం) పెరిగిందని ’ఆక్స్‌ఫామ్‌ ఇండియా – ఇనీక్వాలిటీ కిల్స్‌’ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. మరో వైపు దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ప్రాణాల్ని కోల్పోవడం లాంటి కారణాలతో ఆదాయం 2021లో బాగా పడిపోయిందనే వాస్తవాన్ని కూడా వెల్లడించింది. మార్చి 2020 నుంచి నవంబర్‌ 2021 మధ్య దేశంలోని బిలియనీర్ల సంపద రూ .23.14 ట్రిలియన్ల నుంచి 53.16 ట్రిలియన్ల వరకు పెరగడం విశేషంగా విశ్లేషించబడింది. అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా 3వ స్థానంలో ఉండడం విశేషంగా గమనించాలి. 2020లో కొరోనా కల్లోలంలో దేశ 10 శాతం సంపన్నులకు 1 శాతం సర్‌చార్జ్‌ పన్ను విధించగా సమకూరే మెుత్తంతో అసమానతలు తొలిగేలా పాఠశాల విద్య, సార్వత్రిక ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత, ప్రసూతి సెలవులు, అర్హులకు పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు తీసుకురావచ్చని వెల్లడించింది. దేశంలోని 98 బిలియనీర్లకు 4 శాతం సంపద విధిస్తే దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 17 ఏండ్ల పాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించవచ్చని తెలిపారు.

గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి నెట్టబడ్డారని, ధనికులు అత్యంత ధనికులుగా మారారని స్పష్టం అవుతున్నది. దేశంలోన 50 శాతం అల్పాదాయ వర్గాల సంపద 6 శాతం మాత్రమే అనే ఆశ్చర్యకర విషయం బయట పడింది. అసమానతలు పెరగడంతో రోజుకు 21,000 మంది, నాలుగు సెకన్లకు ఒక్కరు మరణిస్తున్నారని తేలింది. కొరోనా విపత్తు విజృంభణతో లింగ సమానత్వానికి 99 ఏండ్లు పడుతుందని అంచనా వేయగా, నేడు 135 ఏండ్లు పట్టవచ్చని వివరించారు. 2020లో మహిళా ఆదాయం రూ . 59 ట్రిలియన్లు తగ్గిందని, 13 మిలియన్ల మహిళలు పని కోల్పోయారని తెలిపింది. కొరోనా మహమ్మారి చెలరేగడంతో విద్య, సామాజిక భద్రతారంగాల బడ్జెట్‌ తగ్గిందని తెలుస్తున్నది. పట్టణ నిరుద్యోగం 15 శాతం పెరగడం, ప్రజారోగ్య వసతులు భారీగా పడిపోవడంతో సమాజంలో అస్థిరత కనిపించింది.

అదానీ సంపద 2020లో 8.9 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2021లో 50.5 బిలియన్‌ డాలర్లకు పెరగడంతో ప్రపంచ కుబేరుల్లో 24వ ర్యాంకు, ఇండియాలో 2వ ర్యాంకు ఆక్రమించారు. ఫోర్బ్స్‌ వివరాల ప్రకారం నవంబర్‌ -2021లో అదానీ సంపద 82.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రిలియన్స్‌ ముఖేష్‌ అంబాని సంపద 2020లో 36.8 బిలియన్‌ డాలర్ల నుంచి 2021లో 85.5 బిలియన్‌ డాలర్ల వరకు పెరగడం గమనించారు. 2016లో ‘సూపర్‌ రిచ్’‌ వర్గపు సంపద పన్నును తొలగించడం మనకు విధితమే. కొరోనా మహమ్మారి కాలంలో పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎక్కువ పన్నులు కట్టారని, ధనికుల ఆదాయం అనేక రెట్లు పెరిగినా పన్నులు అదే నిష్పత్తిలో పెరగలేదని వెల్లడి అవుతున్నది. దేశంలోని అట్టడుగు 552 మిలియన్ల మెుత్తం సంపదకు 98 ధనవంతుల సంపద సమానంగా ఉండడంతో ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతున్నది. ప్రపంచవ్యాప్త జాబితాలో 10 అగ్రదేశాల సంపద 57 శాతం ఉండగా, జాబితా చివరన ఉన్న 50 శాతం పేద దేశాల సంపద 13 శాతమే అని తేలింది.దేశంలో కుబేరులు అందరూ విశాల హృదయంతో తమ సంపదలో కొంత భాగాన్ని దేశ హితానికి పన్నులు/విరాళాల రూపంలో వినియోగిస్తే, అసమానతలు తొలగిపోయి, పేదరికం తగ్గిపోయి, ప్రగతి పథంలో నడుస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

Leave a Reply