ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ అత్యాచార ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు సత్యనారాయణ్ ను ఐదు రోజుల గాలింపు తర్వాత బదౌనీ సమీపంలో అరెస్టు చేశారు.ఈ ఘటనలో ఏభై ఏళ్ళ మహిళపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.ఆమె పక్కటెముకలు, కాలు విరిగినట్టు , రహస్యావయాల్లో గాయాలనున్నట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్ లో రోజుకోటి చొప్పున జరుగుతున్నాయి. అయితే, బాగా సంచలనం సృష్టించిన ఘటనలు మాత్రమే వెలుగులోకి వొస్తున్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఒక ఆలయం పూజారి. మూడో తేదీన సాయంత్రం ఆ మహిళ ఆలయానికి వెళ్ళినప్పుడు జనం లేని వైనాన్ని గుర్తించి ఆ పూజారి ఆమెపై అత్యాచారం చేసి ఆ పై హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు సత్యనారాయణ్ ను పట్టించి ఇచ్చిన వారికి యాభై వేల రూపాయల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ సంఘటనను దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ్ అత్యాచార ఘటనతో పోలుస్తూ దిల్లీలోనూ, ఉత్తరప్రదేశ్ లోనూ గడిచిన ఐదు రజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈనెల 3వ తేదీన ఆలయానికి వెళ్ళిన ఆ మహిళ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు జరిపినా ప్రయోజనం కనిపించలేదు.చివరికి రాత్రి పొద్దు పోయిన తర్వాత పూజారి మరో ఇద్దరు వ్యక్తులు ఆమె మృత దేహాన్ని తీసుకుని వొచ్చి బావిలో పడిన ఆమెను తాము బయటకు తీశామని చెప్పారు.ఆమె అరుపులు విని వెళ్ళామనీ,కానీ, తాము బయటకు తీసేలోపే ఆమె ప్రాణం విడిచిందని చెప్పారు.
వారు చెప్పిన వివరాలు చూస్తే కట్టుకథగానే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. యువతులు, విద్యార్ధినులకే కాదు.. యాభై ఏళ్ళ మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టమ్ లో తేలింది. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే కమలనాథుల పాలనలో గుళ్ళు, గోపురాలు సందర్శించే మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది కొత్త కాదు. ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్టు స్థానికులు ఆరోపించారు. రాజకీయ నాయకుల అండదండలున్న వారే ఇలాంటి ఘోరాలకు పాల్పడతారన్న విషయం కూడా రుజువు అయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ వయసులో పెద్ద అయినప్పటికీ ఆమె ను దుండగులు హింసించిన విధానాన్ని ఖండించకుండా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మహిళలు అనవసర సమయాల్లో బయటకు రావడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. సాయంత్రం వేళల్లో ఏభై ఏళ్ళు దాటిన వారు గుడులు, గోపురాలు సందర్శించడం సాధారణమైన విషయమే.
మహిళా కమిషన్ సభ్యురాలు చేసిన వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మహిళా కమిషన్ సభ్యులు, చైర్ పర్సన్ లు ప్రభుత్వాన్ని స్తుతించడానికే ఉన్నారని పలువురు ఆరోపించారు. మహిళలు అర్థరాత్రి కూడా ఒంటరిగా ప్రయాణం చేసే వాతావరణాన్ని సృష్టించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వొచ్చినట్టని మహాత్మాగాంధీ అన్నారని ప్రతి సందర్భంలోనూ చెప్పుకుంటూ ఉంటాం. వినోద కేంద్రాలు, క్లబ్ లలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి వ్యాఖ్యలను సరిపెట్టుకోవచ్చు. కానీ, దేవాలయానికి వెళ్ళిన మహిళ క్షేమంగా ఇంటికి తిరిగి రాకపోవడాన్ని బట్టి మన దేశంలో ముఖ్యంగా, అతి పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వొచ్చిన తర్వాత నేరాలు, ఘోరాలు పెరిగాయి. ఆయన ముఠా నాయకులపై ఉక్కుపాదాన్ని మోపినట్టు బీజేపీ నాయకులు తరచూ ప్రశంసిస్తూ ఉంటారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్ ఎన్నో సందర్భాల్లో మహిళలపై దాడుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆడవారి ఆహార్యం పైన కూడా వ్యాఖ్యలు చేశారు.
ఆయన పాలనలో ఆర్థికాభివృద్ది ఏమీ జరగకపోయినా, మంచి పాలనను అందిస్తున్నారంటూ మోడీ పలు సార్లు ప్రశంసించారు. అంగన్ వాడీ కేంద్రం సమీపంలో ఉన్న ఆలయంలోనే అత్యాచారం జరగడం ఎంతో దారుణం. అంతేకాకుండా ఈ ఘటనలో పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని సస్పండ్ చేశారంటూ మహిళా కమిషన్ సభ్యురాలు పేర్కొంటూ యోగీని వెనకేసుకొచ్చారు. అయితే, ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ప్రధాన నిందితుణ్ణి పట్టుకునేందుకు ఐదురోజులు పట్టేది కాదని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగీ ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీ వర్గాలకు రక్షణ లేదని ప్రధాని అండదండలతో ఆయన అధికారంలో కొనసాగుతున్నారని యాదవ్ ఆరోపించారు. యోగీ పాలనలో ఏటా నేరాలరేటు పెరుగుతూనే ఉంది. ఆయన కేవలం ప్రధాని మెప్పుకోసం ప్రకటనలు చేస్తూ ఉంటారు. పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చాలా వెనకబడి ఉన్నారు. ఆయన పాలనలో యూపీలో నేరాలు ఘోరాలు బాగా పెరిగాయన్నది సామాన్యుల నోట వినిపించే వాస్తవం.