Take a fresh look at your lifestyle.

‌ఢిల్లీలో గాలి కాలుష్యంతో పెరిగిన కొరోనా మరణాలు

గాలి కాలుష్యం లేని ప్రాంతాలతో పోల్చితే గాలి కాలుష్య ప్రాంతాల్లో కోవిడ్‌-19 ‌కారణ మరణాలు అధికంగా ఉన్నాయని హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయ ప్రజారోగ్య విభాగం చేసిన పరిశోధనల్లో బయట పడింది. కార్లు, శిలాజ ఇంధన వాహనాలు, రిఫైనరీలు, పవర్‌ ‌ప్లాంట్లు విడుదల చేసే దుమ్ము, ధూళితో పాటు పియం-2.5 ఘన మరియు ద్రవ రేణువుల గాలి కాలుష్యం కోవిడ్‌-19 ‌రోగులకు అతి ప్రమాదకరంగా మారుతున్నదని తెలియజేసింది. అమెరికాలోని 3,089 కౌంటీల్లో (ఆవాసాల్లో) జరిగిన అతి పెద్ద పరిశోధనల్లో పియం-2.5 గాలి కాలుష్యానికి మరియు కోవిడ్‌-19 ‌మరణాలకు సంబంధాన్ని స్పష్టం చేశారు. పియం-2.5 కాలుషిత గాలిని పీల్చిన కరోనా బాధితుల్లో అధిక మరణాలు నమోదు కావడం నేడు న్యూఢిల్లీ నగరవాసులకు ప్రమాద హెచ్చరికలను చేసినట్లు అయ్యింది. పియం-2.5 పార్టిక్యులేట్‌ ‌మ్యాటర్‌ ‌కాలుష్యానికి గురైన కోవిడ్‌-19 ‌రోగుల్లో 8 శాతం అధిక మరణాలు జరిగాయని నిర్థారించారు. పియం-2.5 గాలి కాలుష్యం వల్ల గుండె జబ్బులు మరియు శ్వాసకోశ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరిగిందని వెల్లడించారు. పియం-2.5 కాలుష్యం స్వల్పంగా (1 మైక్రోగ్రామ్‌/‌క్యూబిక్‌ ‌మీటర్‌) ‌పెరిగినా కోవిడ్‌-19 ‌రోగుల మరణాలు 11 శాతం పెరుగుతున్నాయని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలం గాలి కాలుష్య వాతావరణంలో జీవించిన వారిలో 15 శాతం మరణాలు అదనంగా జరిగాయని తేల్చారు.

05 నవంబర్‌ 2020 ‌రోజున న్యూఢిల్లీలో పియం-2.5 కణాల కాలుష్యం ఘనపు మీటరుకు 370 ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థేశించిన సురక్షిత విలువ 25 కన్న 12 రెట్లు ఎక్కువగా ఉంది. దీనిని బట్టి ఢిల్లీవాసులు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో 4.17 లక్షల కరోనా కేసులు ఉండగా, 2 కోట్ల మహానగర జనాభా కోవిడ్‌-19 అం‌చున ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మహానగరం నేడు గాలి కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉంది. గత కొన్ని మాసాలుగా లాక్‌డౌన్‌ ‌మరియు కరోనా నియమాలతో తేట గాలి పీల్చిన ఢిల్లీ వాసులు నేడు విష గాలిని పీల్చుతున్నారు. ప్రస్తుతం కోవిడ్‌-19 ‌సోకిన వారిలో అధిక మరణాలు నమోదు కావడం కరోనా అగ్నికి గాలి కాలుష్య ఆజ్యం పోసినట్లు అయ్యింది. కరోనా కట్టడిలో గాలి కాలుష్యం ప్రతిబంధకంగా నిలుస్తున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ కరోనా కేసుల్లో 2వ స్థానం (8.4 మిలియన్లు) మరియు కోవిడ్‌-19 ‌మరణాల్లో 3వ స్థానంలో (1.24 లక్షలు) ఉన్న భారత్‌లో నేడు ఉత్తర భారతంలో పియం-2.5 గాలి కాలుష్యం పంజాలో చిక్కిన కారణంగా భవిష్యత్తు భయానకంగా తోస్తున్నది. దేశంలో ఇప్పటికే అధిక కరోనా కేసులతో ముందున్న ఢిల్లీలో శీతాకాలం నవంబర్‌ ‌నుంచి ఫిబ్రవరి వరకు గాలి కాలుష్యం అపరిమితంగా పెరగడం జరిగి, కరోనా వ్యాప్తి మరియు కోవిడ్‌-19 ‌మరణాలు పెరుగుతాయని తెలియజేస్తున్నారు. గాలి కాలుష్యంతో శిశువుల్లో పలు ఊపిరితిత్తుల సమస్యలు మరియు మెదడు ఎదుగుదలకు విఘాతం కలుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంతో దాదాపు 5 లక్షల నవజాత శిశువులు మరియు ఇండియాలో 1 లక్ష శిశువులు మరణించారని అంచనా వేశారు. నేడు ఢిల్లీలో ఈ దుస్థితికి కారణం ‘నేషనల్‌ ‌క్యాపిటల్‌ ‌టెర్రిటరీ’ పరిసర వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, దీపావళి బాణాసంచాలు పేల్చడం, రోడ్డు సైడ్‌ ‌దుమ్ము ధూళి, గృహ నిర్మాణ పరిశ్రమ, వాహన మరియు పారిశ్రామిక ఉద్గారాల వల్ల విష వాయువులతో కూడిన గాలి కాలుష్యం అని తెలుస్తున్నది. ఢిల్లీ నగరంలోని మురికివాడల ప్రజలకు గాలి కాలుష్య దుష్ప్రభావం ఎక్కువగా పడడం విచారకరం. ఈ ప్రమాదకర గాలి కాలుష్యంతో జనులు దగ్గడం, తుమ్మడం అధికమైన కారణంగా కరోనా వారస్‌ ‌వ్యాప్తి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. పియం-2.5 రేణువులు కలిగిన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని, ఏసీఈ-2 రెసెప్టార్లు అధికంగా ఉత్పత్తి అవుతూ, పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

బిపి, మధుమేహం, కరోనరీ వ్యాధులు మరియు అస్తమాలతో బాధ పడుతున్న ప్రజలకు గాలి కాలుష్యంతో వ్యాధినిరోధకశక్తి తగ్గి పోయి అతి ప్రమాదకరంగా మారనుంది. పియం-2.5 కాలుష్యంతో పాటు గాలిలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు మరియు ఓజోన్‌ ‌పరిమితులు పెరిగిన కారణంగా కోవిడ్‌-19 ‌కట్టడి కష్టం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనాతో గాలి కాలుష్యం తోడైతే కోవిడ్‌-19 ‌మరణాలు అధికం అవడం అనివార్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించని యెడల ఈ శీతాకాలం ప్రజారోగ్యం గాలిలో దీపం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి కాలుష్య 20 నగరాల్లో భారత్‌లోని ఢిల్లీతో పాటు దేశంలోని మరో 13 మహానగరాలు ఉండడంతో కోవిడ్‌-19 ‌రోగులకు ప్రాణాపాయం ఉందని గమనించాలి. అధిక ఓజోన్‌ ‌కాలుష్యంగల 10 ప్రపంచ దేశాల్లో ఇండియా కూడా ఉన్నది. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అదుపు చేయని యెడల, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని కన్న 20 రెట్లు అధిక గాలి కాలుష్యం పెరగవచ్చని భయపడుతున్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించుటకు రైతులను చైతన్య పరిచి, వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం తక్షణమే ఆపివేసి, పంట వ్యర్థాలను ‘పుసా-బయోడికంపోజర్‌’ ‌పద్దతిలో సేంద్రీయ ఎరువుగా మార్చడం తక్షణమే ప్రారంభించాలి. పొగమంచు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాహనాల రద్దీని కనిష్ట స్థాయికి తగ్గించాలి. ప్రమాదకరమైన కాలుష్యహేతు బాణాసంచాలు కాల్చడాన్ని నిషేధించాలి. ఢిల్లీతో పాటు భారత్‌లోకి అనేక నగరాలు కాలుష్య కోరల్లో చిక్కి సతమతం అవుతున్నాయి. దేశ ప్రజలు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకొని, కాలుష్యా ప్రభావాన్ని తగ్గించే జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్య భారతాన్ని నిర్మించుటలో భాగస్వాములు అవుతారని ఆశిద్దాం.

Leave a Reply