- లక్ష్యంగా పశువుల హాస్టళ్ల నిర్మాణం
- పొన్నాలలో రాష్ట్రంలోనే తొలి సామూహిక పాడి పశువుల సముదాయం ప్రారంభించిన
మంత్రి తన్నీరు హరీష్ రావు
పాడి రైతుల ఆదాయం పెంపొందించడం, గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా నిర్మాణం చేయడం లక్ష్యంగా పొన్నాలలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాడిపశువుల సముదాయం నిర్మించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట మండలం పొన్నాలలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సామూహిక పాడి పశువుల సముదాయంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ ప్రారంభించారు. సముదాయ అవరణలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరంను ఆయన ప్రారంభించారు. సముదాయంలో
ఏర్పాటు చేసిన చాఫ్ కటింగ్ షెడ్, పిడకల తయారీ కేంద్రం, మిల్క్ సేకరణ కేంద్రం, సిబ్బంది క్వార్టర్ , కమ్యూనిటీ హాల్ తదితర వసతులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలో దేశంలోనే తొలిసారిగా గొర్రెల కోసం హాస్టల్ నిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. అదే స్ఫూర్తితో పొన్నాలలో పశువుల హాస్టల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు రావడంతో పొన్నాలతో పాటు మరి మరో 8 గ్రామాల్లో పశువుల హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
రైతులకు అదనపు ఆదాయం చేకూర్చాలని లక్ష్యంతో భూమి ఉన్న పాడి రైతులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గేదెలను పంపిణి చేశామని తెలిపారు. పశువుల హాస్టల్ నిర్మాణం వల్ల ఆదాయం పెరగడం, స్వచ్ఛ గ్రామాల నిర్మాణంతో పాటు నాణ్యమైన పాలు రైతు కుటుంబాలకు, వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో పశువుల హాస్టళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పొన్నాలలో తొలిసారిగా పశువుల హాస్టల్ నిర్మాణం చేశామన్నారు. ప్రారంభంలో కొన్ని బాలారిష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని, వాటిని అధిగమించేందుకు పాడి రైతులతో అధికారులు తరచుగా మాట్లాడాలన్నారు. పాల ధర పెంచేందుకు విజయ డైరీ అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. పశువుల మేత కోసం ఉపాధి హామీ పథకం ద్వారా పచ్చగడ్డి పెంపుకు కృషి చేయాలని మంత్రి అధికారులును ఆదేశించారు. పొన్నాలలో పశువుల హాస్టల్ నిర్మాణానికి బాలవికాస సంస్థ విశేష కృషి చేసిందన్నారు. నిర్మాణంతో పాటు కొన్ని యూనిట్లను ప్రత్యేకంగా ఆ సంస్థ కార్యనిర్వహక డైరెక్టర్ శౌరి రెడ్డి ఏర్పాటు చేశారని, అందుకు అతన్ని అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పశు సంవర్థక శాఖ సంచాలకులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వసతులతో కూడిన పశువుల హాస్టళ్ల గురించి తొలిసారి సిద్దిపేటలోనే వింటున్నామని అన్నారు.
తాను 2017, 2018 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సందర్శించానన్నారు. అక్కడ పశువుల సముదాయాలు ఉన్నప్పటికీ పరిమిత వనరులతో మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని పొన్నాలలో ఏర్పాటుచేసిన పశువుల హాస్టల్లో అన్ని వసతులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అన్ని వసతులతో కూడిన పశువుల హాస్టల్ తొలి సారి సిద్దిపేటలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ హాస్టల్ దేశంలోని మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కృషితో ఇప్పటికే రాష్ట్రంలో హరిత విప్లవం, బ్లూ, పింక్ విప్లవం ఏర్పాటయ్యాయని పశువుల హాస్టళ్ల నిర్మాణం వల్ల రెండో శ్వేత విప్లవం కూడా సిద్దిపేట నుంచి రానుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఈజీఎస్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ బాల లింగం, గోపాల్ రావు, సురేష్, స్థానిక ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.