Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షలు పెంచండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ

తెలంగాణలో కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వాం రాష్ట్రానికి సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణలో కేవలం 21 వేల టెస్టులు మాత్రమే జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈమేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టాలంటే ఐసీఎంఆర్‌ ‌నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆ లేఖలో సూచించారు. కొరోనాపై పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజులలో తీవ్ర నష్టం ఎదుర్కోక తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది.

ఎంత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తే వైరస్‌ ‌వ్యాప్తిని అంత త్వరగా నియంత్రించవచ్చని అభిప్రాయపడింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కిట్లు, వైద్యులకు అసవరమైన మేరకు పీపీఈ కిట్లు, మాస్కులు సమకూర్చుకోవాలని సూచించింది. కాగా, కోరోనా టెస్టుల విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాసిన లేఖపై రాష్ట్ర వైద, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌ ‌నిర్దేశించిన మార్గదర్శకాల మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్రంలోని ప్రజలెవరూ ఆందోళన చెందడం లేదని ఈ సందర్బంగా మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply