ఏప్రిల్ 21… శకుంతలా దేవి వర్థంతి
ఆమె అంక గణితంలో నిపుణురాలు. గణితావధాని. చాలా వేగంగా గణనలు చేయగల సామర్థ్యం కలిగిన ఆమెను “మానవ కంప్యూటర్” అని పిలుస్తారు. గణిత మాంత్రికురాలిగా సుప్రసిద్ధులు. శతాబ్దంలో ఆమెకు ఏదైనా తేదీ ఇస్తే, అది వారంలో ఏ రోజు పడిపోయిందో చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. మైండ్ డైనమిక్స్’ అని పిలిచే భావనను అభివృద్ధి చేసిన మేధావి. ఆమెనే మానవ నిర్మిత కంప్యూటర్ కన్న గొప్ప గణకురాలిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి. శకుంతలా దేవిని (నవంబరు 4, 1929 –ఏప్రిల్ 21, 2013 ) మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు. ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్నారు. బెంగళూరులోని బ్రాహ్మణ పూజారుల ప్రసిద్ధ కుటుంబంలో జన్మించిన శకుంతల దేవి తన తాత నుండి గణితంలో ప్రారంభ పాఠాలు పొందారు. ఐదు సంవత్సరాల వయస్సులో ఆమె చైల్డ్ ప్రాడిజీగా మరియు సంక్లిష్ట మానసిక అంక గణితంలో నిపుణురాలిగా గుర్తించబడింది. ఆ చిన్న వయస్సులో, ఆమె క్యూబ్ మూలాలను లెక్కించటం వంటి గణిత సమస్యలను పరిష్కరించడంలో నిపుణురాలు అయ్యింది. ఒక సంవత్సరం తరువాత మైసూర్ విశ్వ విద్యాలయంలోని విద్యార్థులు, ప్రొఫెసర్ల పెద్ద సమావేశానికి వెళ్ళి ఆమె తన ప్రతిభను ప్రదర్శించింది. ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వ విద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు. శకుంతలాదేవి 1960లో కోల్ కతాకు చెందిన ఐఏఎస్ పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నారు.
బెనర్జీ స్వలింగ సంపర్కం గురించి వెల్లడి కావడంతో ఆ వివాహం త్వరలోనే విడిపోయింది. అయితే ఈ ఘటన శకుంతల దేవికి, ఉత్ప్రేరకంగా పనిచేసింది, ఆమె మానవత్వం గురించి లోతుగా పరిశోధించడానికి సహాయపడింది.1977 లో ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్ అనే పుస్తకాన్ని రాయడానికి ఆమెను దారితీసింది. అమె రాసిన పుస్తకంలో స్వలింగ సంపర్కం అనైతికం అనే విషయాన్ని ఆమె సవాలు చేసింది. శకుంతలాదేవి తన సామర్థ్యాలను, తన సామర్థ్యాలను ఉపయోగించు కుంటూ, తన జీవితాన్ని అన్వేషించి, మానవత్వాన్ని చాటుకునే తపనతో, తన జీవితాన్ని గురించి ప్రసంగాలలో చెబుతూ ఉండేవారు. ఆమె ఎన్నో రచనకు చేశారు. మానవ మనస్సు కంప్యూటర్ కంటే సాటిలేని సామర్ధ్యాలను కలిగి ఉందని, మానవ మనస్సును కంప్యూటర్లతో పోల్చడం సముచితం కాదని ఆమె అభిప్రాయ పడ్డారు. శకుంతలా దేవి తమ గణిత ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో పర్యటించారు. ఆమె తన తండ్రితో కలిసి 1944 లో లండన్‌కు వెళ్లారు. ఆమె 1950 లో ఐరోపా పర్యటన 1976లో న్యూయార్క్ నగరంలో ప్రదర్శనలు ఇచ్చారు.1988 లో, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో విద్యా మనస్తత్వ శాస్త్రం ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ వద్ద అధ్యయనం చేయటానికి ఆమె వెళ్లారు. ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.
1977లో అమెరికాలో ఓసారి ఒక కంప్యూటర్ తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించారు. 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికిఅయితే ఆమె కేవలం 28 సెకన్లలో… 18,947,668,177,995,426,462, 773,730…సమాధానం ఇచ్చారు. ఆలా గిన్నీస్ బుక్ రికార్డ్ ఆమె సొంతం అయింది. ఆమె గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో క్షణంలో ఆమె చెప్పేవారు. దేవి 1969 లో ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం విశిష్ట మహిళల పురస్కారాన్ని గెలుచుకుంది. ఆమె 1988 లో వాషింగ్టన్ డిసిలో రామానుజన్ మ్యాథమెటికల్ జీనియస్ అవార్డుతో సత్కరించింది. తమ 83వ ఏట 2013 ఏప్రిల్ 21న ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు.
గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలం నుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు. ప్రపంచంలో మేధావులుగా గుర్తించ బడిన ఆర్యభట్ట, వరాహ మిహిర కాలం నుండి అంకగణిత ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థులలో గణిత ఫోబియా అధికం అవుతుంది. ఉన్నత చదువుల కోసం గణితాన్ని ఎంచుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. భారతదేశంలో సుమారు 1.3 మిలియన్ల పాఠశాలలు, 800 విశ్వవిద్యాలయాలను కలిగి ఉన్నా, గణిత ఉపాధ్యాయుల సంఖ్య నానాటికీ దిగదుడుపే అవుతున్నది. దేశంలో ఇంజనీరింగ్, ఉత్పత్తి, సమాచార సాంకేతికత, అంతరిక్ష తదితర శాస్త్రాలలో గణిత శాస్త్ర నిపుణులు అవసరం ఉన్న దృష్ట్యా, ప్రభుత్వాలు గణిత శాస్త్ర నిపుణులను తయారు చేయాల్సి ఉంది. అలాగే ఐదేళ్ళ నుండి 80ఏళ్ళ పైబడిన వయసు దాటే వరకు వరకు అవిశ్రాంతంగా కృషి గణిత శాస్త్రం లో విశేష కృషి చేసిన మాస్టర్ మైండ్ శకుంతలా దేవి ఆదర్శంగా, విద్యార్థులు భయాన్ని వీడి గణితంలో నిపుణులు కావలసిన అవసరం అనివార్యంగా ఉంది.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494