మెడికల్ కళాశాల గురించి అసెంబ్లీలోనే అడుగుతా
కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి : జగ్గారెడ్డి డిమాండ్
సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇస్తాననీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పి ఏడాదిన్నర అయ్యిందనీ ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదనీ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విమర్శించారు. జగ్గారెడ్డి బుధవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…సంగారెడ్డి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మెడికల్ కాలేజీ అత్యవసరం అని…గత బడ్జెట్ సమావేశాల సందర్భంలో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాననీ సిఎం
కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారనీ గుర్తు చేశారు. సంగారెడ్డికి ఇస్తానని చెప్పిన మెడికల్ కళాశాల గురించి అంగుళం కూడా ముందుకు నడవలేదనీ, ఈ విషయాన్ని గురువారం అసెంబ్లీలోనే సిఎం కేసీఆర్‌ను అడుగుతాననీ జగ్గారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం బాధాకరమన్నారు.
సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు ఎంతో అవసరమనీ, ఈ ప్రాంత పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ వేదికగా సిఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అసెంబ్లీ వేదికగానే సిఎం కేసీఆర్‌ను అడుగుతాననీ, సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం వెయ్యి కోట్ల నిధులు ఇచ్చారనీ, సంగారెడ్డికి కూడా వెయ్యి కోట్లు ఇవ్వాలని అడుగుతాననీ, మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ప్రభుత్వం సీరియస్స్గా పని చేయాలన్నారు. ప్రజలు కొరోనాతో ఆర్థికంగా నష్టపోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కొరోనా వచ్చినప్పుడే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామనీ, ప్రజలకు ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరిన నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించారనీ, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరమూ ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామనీ, ఇదే విషయమై సిఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తామనీ జగ్గారెడ్డి చెప్పారు.