Take a fresh look at your lifestyle.

ఆగని పెట్రో ధరల పెరుగుదల తగ్గించడం కుదరదన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దేశంలో పెట్రో దరల పెరుగుదల ఆగడం లేదు. వరుసగా సోమవారం కూడా చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. జూన్‌లో గడిచిన ఏడు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ధరలు ఆల్‌ ‌టైమ్‌ ‌గరిష్ఠ స్థాయికి చేరగా.. తాజాగా లీటర్‌ ‌పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 30 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశంలో అత్యంత గరిష్ఠ స్థాయికి రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ ‌జిల్లాలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ.105 దాటింది. డీజిల్‌ ‌ధర సైతం వందకు చేరువైంది. ప్రస్తుతం డీజిల్‌ ‌లీటర్‌ ‌ధర రూ.98 పలుకుతోంది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ.95.31, డీజిల్‌ ‌రూ.86.22కు చేరింది.

ముంబై మహానగరంలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.101.52, డీజిల్‌ ‌రూ.93.58కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ‌రూ.95.28, డీజిల్‌ ‌రూ.89.0, చెన్నైలో పెట్రోల్‌ ‌రూ. 96.71, డీజిల్‌ ‌రూ.89.07, లక్నోలో పెట్రోల్‌ ‌రూ.92.56, డీజిల్‌ ‌రూ.86.62, జైపూర్‌లో పెట్రోల్‌ ‌రూ.101.88, డీజిల్‌ ‌రూ.95.81, నోయిడాలో పెట్రోల్‌ ‌రూ.92.67, డీజిల్‌ ‌రూ.86.70 కు చేరింది. బెంగళూరులో పెట్రోల్‌ ‌రూ.98.49, డీజిల్‌ ‌రూ.91.41, భోపాల్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ.103.45, డీజిల్‌ ‌రూ.94.79కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ‌రూ.99.05, డీజిల్‌ ‌రూ.94కు చేరింది. గత నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి ఇప్పటి వరకు 20 సార్లు ధరలు పైకి కదిలాయి. పలు రాష్ట్రాల్లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.వంద దాటింది.

పెట్రో దరలు తగ్గించడం కుదరదు : స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
‌దేశంలో పెట్రో ధరలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం కుదరదని, ప్రజలకు ఉపశమనం కల్పించలేమని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయం 2020-21 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయిందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంపై గణనీయంగా ఖర్చులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, దీంతో పాటు సంక్షేమ రంగంపై కూడా ఖర్చులు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు పెరిగిపోవడం నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గించడం కుదిరే విషయం కాదని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటడం వల్లే మన దేశంలో ధరలు పెరిగాయని కేంద్రమంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ‌ధర 70 డాలర్లకు చేరుకుందని, అందుకే ధరలు మండిపోతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తెలిపారు.

Leave a Reply