Take a fresh look at your lifestyle.

‌ప్రగతిలో సిద్ధిపేట ప్రథమస్థానంలో నిలవాలి

  • ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంప్‌ ‌యార్డు-సెగ్రిగేషన్‌ ‌షెడ్లు పూర్తి చేయాలి
  • నాటిన మొక్కలలో 85 శాతం మొక్కలు బతకాల్సిందే
  • పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు

ప్రతి పల్లె స్వచ్చమైన పల్లెగా మారాలి. ఇందు కోసం ప్రతి అధికారి శక్తి వంచనలేకుండా కృషి చేసి ప్రగతి పథంలో సిద్ధిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. ట్రాక్టర్లు, ట్రాలీలు తొందరగా తీసుకు రావాలి. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంప్‌ ‌యార్డు- సెగ్రిగేషన్‌ ‌షెడ్లు పూర్తి చేయాలి. గ్రామంలో నిర్మించిన స్మశాన వాటిక, డంప్‌ ‌యార్డు వినియోగంలోకి తేవడం ముఖ్యం. ప్రజల అభిరుచికి తగిన మొక్కలను అందుబాటులో ఉంచాలి. నాటిన మొక్కలలో 85 శాతం మొక్కలు బతకాల్సిందేనని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు ప్రజా ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్‌ ‌మహతి ఆడిటోరియంలో గురువారం రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతి పై జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామ రెడ్డి, జెడ్పి చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌ముజంబీల్‌ ‌ఖాన్‌, ‌జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్‌ ‌శాఖ అధికారులు, పంచాయతీ రాజ్‌ ఇం‌జనీర్లు తదితరులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలపై విద్యుత్‌ ‌పెను భారం పడకుండా మిషన్‌ ‌భగీరథ నీళ్లు వస్తున్న క్రమంలో సింగిల్‌ ‌ఫేజ్‌ ‌మోటార్లు వాడకం అవసరం లేకుండా చూడాలని ఏంపీడీఓలు, ఏంపీఓలకు, ఆర్‌ ‌డబ్ల్యూఎస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. ముందుగా బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎన్‌ ‌జీఓ సంస్థ సహాస్‌ ‌కు చెందిన ప్రతినిధులు సునీత, డాక్టర్‌ ‌శాంతిలు తడి, పొడి చెత్త, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణానికి ఏ రకంగా హానికరమని సాలిడ్‌ ‌వేస్ట్ ‌మేనేజ్మెంట్‌ ‌తదితర కీలక అంశాలను సవివరంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు చక్కటి అవగాహన కల్పించారు. వీరు చెప్పే సూత్రాలను అంగీకరించి తూచా తప్పకుండా పాటిస్తే సత్ఫలితాలు వస్తాయని మీరంతా ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై మంత్రి, జిల్లా కలెక్టర్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, అధికారిక యంత్రాంగం వారు కల్పించిన అవగాహన సంతృప్తినిచ్చిందని చెప్పారు.

ఈ మేరకు మంత్రి హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ.. సర్పంచ్‌ అం‌టే గతంలో మాదిరిగా రోడ్లు, భవనాలు కట్టడం కాదని ప్రజల అవసరాలను తెలుసుకుని, గ్రామాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. నూతన మార్పులకు శ్రీకారం చుడుతూ ఆదర్శ గ్రామాలుగా మార్చే శక్తి ఉన్న వారే సర్పంచ్‌లు అని చెప్పారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విద్యావంతులైన సర్పంచ్‌లు ఎన్నికయ్యారని, వారికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యా వంతులను గ్రామానికి ఒకరి చొప్పున పంచాయతీ కార్యదర్శులను నియమించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పల్లెప్రగతి పనులలో సిద్దిపేట జిల్లా 22వ స్థానంలో ఉందని, వచ్చే వారం రోజులలో సిద్దిపేటను అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. ముఖ్యంగా ఆరు అంశాలపై దృష్టి పెట్టాలని, అందులో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల పనులను మొదలుపెట్టని చోట్ల పురోగతిలో పెట్టాలని, నిర్మాణం పూర్తయిన చోట వినియోగంలోకి తీసుకురావాల్సిన భాథ్యత సర్పంచ్‌, ‌కార్యదర్శులదేనన్నారు. వీటి నిర్మాణానికి అవసరమైన ఇసుక మంజూరీ అధికారం మార్చి 31వరకు తహసీల్ధార్లకు ఇస్తున్నట్లు, ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశాలిచ్చినట్లు, మార్చి 31లోగా అన్నింటిని పూర్తిచేయాలని సూచించారు. ఈ నెల 25నుంచి సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలిస్తానని చెప్పారని, సీఎంతో పాటు ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌లు తిరుగుతారని ఆరు అంశాలపై దృష్టి పెట్టి వారం రోజులలో పూర్తిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు తడి, పోడిచెత్తపై అవగాహన కల్పించాలని, మిషన్‌ ‌భగీరథ నల్లాలు విరగ్గొట్టవద్దని, నీటిని ఆదా చేసుకోవాలని, 25లోగా గ్రామపంచాయతీల బడ్జేట్‌ను తయారు చేసుకోవాలన్నారు. పనుల పురోగతిపై దృష్టిపెట్టి, వారం రోజులు కష్టపడి, పనిచేయాలని, పల్లెప్రగతి పనులలో రాజన్న సిరిసిల్లా ప్రథమస్థానంలో, సంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉండి, సిద్దిపేట 22వ స్థానంలో ఉండడం సరికాదని అధికారులు, ప్రజాప్రతినిధులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతనంగా నియమించబడిన స్థానిక సంస్థల కలెక్టర్‌ ‌ముజంబీల్‌ ‌ఖాన్‌పై పెద్ద గురుతమైన బాద్యత ఉందని గుర్తుచేశారు.

నూతన మునిసిపల్‌, ‌పంచాయతీరాజ్‌ ‌చట్టాల అమలుకే స్థానిక సంస్థల అడిషనల్‌ ‌కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. గ్రామగ్రామానికి నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ వస్తే నక్సలిజం పెరిగిపోతుందని, విద్యుత్‌ అం‌దదని, ఆగమయితదని చెప్పారని, కానీ ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటిని ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ అం‌దిస్తున్నామని, తండాలను జీపీలుగా మార్చుకున్నామని చెప్పారు. గతంలో తాగునీటి కోసం కిలోమీటర్లు పోయి భూజాలపై మోసుకువస్తే, భూజాలు కాయలు కాసేవని, కానీ తెలంగాణ స్వపరిపాలన ప్రారంభించిన ఆరేళ్లలో 70 యేండ్ల దరిద్రం పోయిందని, గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయన్నారు. ప్లాస్టిక్‌ ‌రహిత సిద్దిపేటగా మార్చేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్లేట్‌ ‌బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరిగిన పనుల్లో ఏమైనా పెండింగులో ఉంటె 10 రోజుల్లో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు, ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో హరిత ప్రణాళిక ద్వారా మొక్కలను నాటి సంరక్షించాలని కొత్త పంచాయతీ రాజ్‌ ‌చట్టంలో వెల్లడించడం జరిగిందని, ఈ దరిమిలా ప్రతి గ్రామ పంచాయతీలో నాటిన మొక్కలలో 85 శాతం మొక్కలు ఖచ్చితంగా బతకాలని, ఆ విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ ఏర్పాటులో భాగంగా గ్రామంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా మొక్కలను పెంచాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రగతి పనులు ప్రజలకోసమేనని వాటిని ధ్వంసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేస్తూనే, గ్రామంలో ప్రతి నెల జరిగే మహిళా సంఘాల సమావేశాల్లో సర్పంచ్‌, ‌పంచాయతీ కార్యదర్శి పాల్గొని స్వచ్చ భారత్‌ ‌కార్యక్రమ ప్రాధన్యత వివరించాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందజేసేలా ప్రతి మహిళను చైతన్యవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌వెంకటేశ్వర్లు, జెడ్పి చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఓడితేల సతీష్‌, ‌వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply