Take a fresh look at your lifestyle.

నాడు నిండు పున్నమి వెలుగులో..నేడు విద్యుత్‌ ‌దీప కాంతుల్లో మేడారం

today onwards, Sammakka - Saralamma Jataraమేడారం సమ్మక్క, సారలమ్మ జాతర దశాబ్దాలకిందటికి నేటికీ ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో పున్నమి వెలుగుల్లో నిరాడంబరంగా జరిగే ఈ జాతర, నేడు విద్యుత్‌ ‌కాంతుల మధ్య పగలు, రాత్రి తేడాలేకుండా కొనసాగుతున్నది. ఒకనాడు కేవలం కోయలే తమ ఇలవేల్పుగా సమ్మక్క, సారలమ్మలను కొలిచేవారు. కాని, నేడు సమస్త జనులు ఈ వనదేవతలను తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఒక విధంగా ఆదివాసీలకన్నా ఇతరులే ఎక్కువగా జాతరలో కనిపించడాన్ని మనం చూస్తుంటాం. ఎవరి ఇంట్లో ఎలాంటి శుభ కార్యమైనా ముందుగా ఆ దేవతల ఆశీర్వాదం పొందందే పనులేవీ తలపెట్టరంటే వారిపట్ల ఎంత భక్తి విశ్వాసాలను కలిగిఉన్నారో అర్థమవుతున్నది. ఇవ్వాల్టికీ సమ్మక్క అనో, సమ్మయ్య అనో, సారయ్య అనో ఆ దేవతల పేర్లనే తమ జన్మనామాలుగా పెట్టుకునే ఆచారం అనేక కుటుంబాల్లో ఉంది. విచిత్రమేమంటే నాటినుండి నేటి వరకు అమ్మవారికి బంగారంగా పిలువడే బెల్లమే ప్రధాన మొక్కుబడి. ఆనాడది కీకారణ్యం.. ఎడ్లబండ్ల ప్రయాణం తప్ప మరే సదుపాయం, సౌకర్యంలేని రోజులు. ఎండ్లబండ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ చెట్టుచాటునుండి ఏ అడవి జంతువు వస్తుందో, ఏగుట్ట చాటునుండి ఏ క్రూర మృగం వస్తుందోనని భయంభయంగా జాతరకు చేరుకునే పరిస్థితి. అందుకే ఏ ఊరి జనమైనా ఊరంతా బండెనుక బండికట్టి అన్నట్లు ఒక్కసారే బండ్ల వరుసతో బయలుదేరేవారు. అందుకే వారికానాడు జాతరకు వెళ్ళిరావడానికి కనీసం వారంపదిరోజులు పట్టేది. తమ వెంట వంటసామాను, ఎడ్లకు కావాల్సిన గడ్డి, చొప్పలాంటివి వెంటతీసుకుని బయలుదేరేవారు. ఈ నాటి పరిస్థితివేరు. బస్సులు, కార్లలో ఉదయం వచ్చి, సాయంత్రంకల్లా వెనుదిరిగే సౌకర్యం ఏర్పడింది. నాలుగయిదు జాతరలకు ముందుకూడా జాతరనుండి వాహనాలతో బయట పడాలంటే చాలా కష్టంగా ఉండేది. ఒక్కోసారి ఆరు, ఎనిమిదేసి గంటసేపు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన సంఘటనలనేకం.

క్రమేణ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ అవాంతరం జరిగినా వెంటనే అక్కడిచేరే రిస్క్ ‌టీంల కారణంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతున్నాయి. దానికి తగినట్లుగా జాతరకు జన సంచారం కూడా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు వందలు, వేలల్లో వచ్చే జనం ఇప్పుడు కోట్ల సంఖ్యకు చేరుకుంటున్నారు. మేడారం జాతర అన్నది భక్తి,, నమ్మకం, విశ్వాసానికి సంబంధించింది కాబట్టి, మనం పూజించే ముక్కోటి దేవతలకు ఉన్నట్లుగా ఈ వనదేవతలకు ఎలాంటి రూపంకాని, ఆకారంగానిలేకపోయినా అ అమ్మవార్లమీద వారికంత విశ్వాసం, నమ్మకం. పేరుకు వారాప్రాంతాన్ని ఏలిన రాజవంశస్తులే అయినా, శత్రు సైన్యాలతో వీరోచితంగా పోరాడి వీరమరణం చెందిన అదిశక్తుల్లా గిరిజనుల గుండెల్లో నిలిచిపోయారు. గిరిజనులను రక్షించడంలో వారు చూపించిన ధైర్య సాహాసాల కారణంగానే వారు దేవతలుగా స్తుతింపబడ్డారు. పోరాటంలో భర్త, కూతురు, అల్లుడు, కుమారుడు వీర మరణం పొందినప్పటికీ, తమను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగరాదన్న ఒకే లక్ష్యంగా శత్రుసైన్యాలతో పోరాడి గాయాలతో అంతర్ధానమైన సమ్మక్క ఆనాటినుండీ కోయలకు ఆరాధ్యదేవతైంది. యుద్దభూమినుండి వైదొలగి మేడారానికి ఈశాన్యంగా ఉన్న చిలకలగుట్టవైపుగా వెళ్ళి అంతర్ధానం అయిన సమ్మక్క ఏక్షణానైనా కనిపించకపోదా అని కోయజనం అక్కడే చాలా కాలంగా ఆమెను వెతుక్కుంటూ కాచుకు కూర్చున్నారు. ఎంతోమందికి ప్రాణబిక్షపెట్టిన తల్లి ఓటమి పాలవడమేంటన్నది వారి ఆవేదన. మాయమంత్రాలతో సాధించే రాజ్యం, రాజ్యం కాదు.. ఈ గడ్డపై పుట్టిన ప్రతీ వ్యక్తి వీరుడిగానే సాధించుకోవాలని, తమ అంతర్ధానంతో చింతించకుండా ఇక్కడ గద్దెలు ఏర్పాటుచేస్తే ప్రతీ రెండేళ్ళకోసారి వచ్చి ప్రజల కోరికలు తీరుస్తానంటూ ఆకాశవాణిగా తల్లులు చెప్పినమాటనే నేటికీ ఇక్కడి కోయజనం విశ్వసిస్తున్నారు.

ఆనాడు చిలకలగుట్టపై వారికి లభించిన కుంకుమ భరిణను తీసుకువచ్చి ముందుగా బయ్యక్కపేటలో, ఆ తర్వాత మేడారంలో నెమిలినార చెట్టు (ప్రస్తుతం ఆ చెట్టులేదు) ప్రాంతంలో ప్రతీ రెండేళ్ళకోసారి ఉత్సవంగా వారి సంస్మరణను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. నాటినుండి నేటివరకు జరిగిన అనేక ఉత్సవాల్లో అమ్మవార్లకు రూపాన్నిచ్చేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కోయలు తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. అంతేకాదు ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వంగాని, ఇతరులెవరి జోక్యాన్ని కూడా వారు ఏమాత్రం సహించకపోవడం వనదేవతలపై వారికున్న అకుంటిత భక్తిని తెలియజేస్తున్నది. కోట్లాదిరూపాయలను వెచ్చించే ఈ జాతరలో వంశపారంపర్యంగా ఆ దేవతలకు నిత్య దూపదీప నైవేద్యాలను సమకూర్చే ఆదివాసీ పూజారులకు లభించే ప్రతిఫలం మాత్రం స్వల్పమే. కాకపోతే జాతర సమయంలో చేపట్టే కొన్ని పనుల కాంట్రాక్టులను మాత్రం ఆదివాసీలకు ఇవ్వడం కాస్త ఊరటకలిగించే అంశం. ఈ జాతరలో అతిముఖ్యమై ఘట్టం సమ్మక్కను గద్దెలకు తరలించడం. సమ్మక్కను ఏ చిలుకలగుట్టనుండి తరలిస్తారో ఆ గుట్ట విస్తీర్ణం ఎనమిది వందల ఎకరాలు. అంత విశాల గుట్టను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం పూజారులకు పట్టా చేయడం ఇందులో కొసమెరుపు.

Leave a Reply