Take a fresh look at your lifestyle.

గత ఎనిమిదేళ్లలో రూ. 10.8 లక్షల కోట్ల ‘‘మొండిబకాయిలు’’

ఒక వైపు ఇటీవల నేషనల్‌ ‌మానిటైజేషన్‌ ‌పైప్‌లైన్‌తో మోడీ ప్రభుత్వం ప్రైవేట్‌ ‌రంగాన్ని బ్రౌన్‌ ‌ఫీల్డ్ ‌ప్రాజెక్టులలో ప్రోత్సహించటం ద్వారా 6 లక్షల కోట్లు జాతీయ సంపదను మార్కెట్‌ ‌పరం చేయడానికి ఈ ప్రణాళిక ప్రభుత్వం తీసుకువొచ్చింది. మరో వైపు గత ఎనిమిది సంవత్సరాలలో నష్టాల్లో ఉన్నాయని ప్రైవేట్‌ ‌రంగానికి చెందిన సంస్థల మొండి బకాయిలు అక్షరాలా 19.18 లక్షల కోట్ల రూపాయలుగా భారత రిజర్వు బ్యాంకు ప్రకటించగా..అందులో రూ. 10.8 లక్షల కోట్ల రుణాలను మొండి బకాయిలుగా బ్యాంకులు మాఫీ చేసాయి.

మాఫ్‌ చేసిన బ్యాంకులు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 :
‌మనం వోటు వేసి ఎన్నుకునే ప్రభుత్వాలు మన ప్రజలకి సేవచేయటానికి బదులు కార్పొరేట్‌ ‌రంగానికి సేవలు చేస్తాయి అనేది మనకి తెలిసిన విషయమే. ప్రభుత్వం కార్పొరేట్లకు అందించే  సేవలకు బదులుగా ప్రభుత్వానికి వాటిల్లిన నష్టం చుస్తే గుండే మండిపోక తప్పదు. మనం ‘‘మొండి బాకీలు’’ అనే మాట మర్చిపోటానికి ప్రభుత్వం మన కళ్లెదుటే అప్పులను ఆస్తులు అని పిలవటం మొదలు పెట్టింది. నాన్‌ ‌పెర్ఫార్మింగ్‌ అసెట్స్. అం‌టే లాభాలు ఇవ్వని ఆస్తులు. అంటే మొండి బకాయిలు. అప్పుని ఆస్తి అని చెప్పటంలో జగత్‌ ‌జంత్రి మాయ ఉందని తెలిసిందే..

వివరాల్లోకి పోదాం…గత కొంత కాలంగా దేశంలోని బ్యాంకులు మొండి బకాయిల సమస్యను ఎదుర్కుంటున్నాయి. మొండిబకాయిలు వేటిని అంటారు అంటే..? 90 రోజులు లేదా అంతకు మించి సమయం గడిచినా  తిరిగి వసూలు కానీ రుణాలను మొండి బకాయిలు అంటారు. మన మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే గోడకు సున్నం వంటి అప్పులు అన్నమాట. మార్చి 2018 నాటికి భారతీయ బ్యాంకుల ముందున్న మొండి బకాయిలు అక్షరాలా 10.36 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక్కడి నుండి కొద్దిగా తగ్గు ముఖం పట్టాయి. లోక్‌ ‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇటీవల ప్రభుత్వం నుంచి వొచ్చిన సమాధానంలో, మార్చి 2021 నాటికి దాదాపు 8.35 లక్షల కోట్ల రూపాయల వరకు మొండి బకాయిలను ప్రభుత్వం తగ్గించగలిగిందని చెప్పింది. అంటే మార్చి 2018 నుంచి మార్చి 2021 మధ్యకాలంలో మొండిబకాయిలు 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా తగ్గాయని ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మనం నమ్మాలి. మన నమ్మకం బలపడి ప్రభుత్వాన్ని మెచ్చుకునే లోగా..లక్షల కోట్ల విలువ చేసే రుణాలను బ్యాంకులు సంవత్సరాలుగా మాఫీ చేశాయనే వాస్తవం మన నమ్మకాలని తునాతునకలు చేస్తుంది. ఈ క్రింది చార్ట్ ‌సంవత్సరాలుగా బ్యాంకులు మాఫీ చేసిన రుణాలను తెలుపుతున్నది.image.pngమనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమనగా పై వివరాలు స్వయంగా దేశ రిజర్వ్ ‌బ్యాంకు జారీ చేయగా మన ముందు ప్రత్యక్షం అయ్యాయి. ఇక వివరాల్లోకి పొతే 2013-2014 నుండి 2019-20 సంవత్సరాలకు సంబంధించిన రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా ఇచ్చిన డేటా ప్రకారం  మార్చి 2021లో లోక్‌ ‌సభలో ప్రభుత్వం చెప్పిన సమాధానం ప్రకారం, 2020 ఏప్రిల్‌ ‌నుండి డిసెంబర్‌ ‌మధ్య కాలంలో బ్యాంకులు మాఫీ చేసిన రుణాలు మొండి బాకీలు 1.15 లక్షల కోట్ల రూపాయలుగా వున్నాయి. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇటీవలి కథనంలో 2021 జనవరి నుండి మార్చి 20 వరకు బ్యాంకులు మాఫీ చేసిన రుణాలు 70,000 కోట్ల రూపాయలకి పైగా ఉన్నాయని రిపోర్ట్ ‌చేసింది. అంటే ఒక్క 2020-21 సంవత్సరంలోనే మాఫీ చేసిన రుణాలు దాదాపు 1.85 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే, ఏప్రిల్‌ 2013 ‌నుంచి మార్చి 2021 మధ్య అంటే ఎనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తం మొండి బకాయిలు అక్షరాలా 10.83 లక్షల కోట్ల రూపాయలు.

దీనర్థం ఏమిటి?
అసలు మొండి బకాయిల రద్దు అంటే ఏమిటి…ఇది అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నిద్దాం. ప్రాథమికంగా, నాలుగు సంవత్సరాలుగా అసలు కానీ వడ్డికాని వెనక్కి రాని రుణాలుగా ఉన్న రుణాలను జాతీయ బ్యాంకులు ‘‘నాన్‌ ‌పర్ఫార్మింగ్‌ అసెట్‌ అని లేదా ‘‘సందేహాస్పద ఆస్తి’’ అని పరిగణిస్తాయి. వీటిని ఒక్క కలం పోటుతో బ్యాంకుల బ్యాలెన్స్ ‌షీట్ల నుండి తీసేస్తాయి బ్యాంకులు. దీనినే రైట్‌ ఆఫ్‌ అని ఇంగ్లీషులో వెనక్కి రాని రుణాల రద్దు అని తెలుగులో చెప్పుకుంటాం. ఇది ఓ అకౌంటింగ్‌ ‌ప్రాక్టీస్‌ ‌ప్రకారం జరిగిపోతుంటుంది. వాస్తవానికి ఇలా చేయటానికి ముందు, రుణమాఫీ చేయబడుతున్న మొండి బకాయిల కోసం 100 శాతం ప్రొవిజిన్‌ ‌ముందు బ్యాంకు కల్పించాలి. మొండి బకాయిలు కారణంగా బ్యాంకుకు వాటిల్లే  నష్టాలను తీర్చడానికి బ్యాంక్‌ ‌స్వయంగా నాలుగు సంవత్సరాల కాలంలో వీటికోసం తగినంత డబ్బును కేటాయించాల్సి ఉంటుంది. అప్పు తీసుకున్న వాడి అప్పును అప్పు ఇచ్చిన వాడే నాలుగేళ్ళ పాటు అప్పు సర్దుపాటు చేయటం అనే హాస్యాస్పద పని బ్యాంకు నిజంగా చేస్తున్నదన్న మాట.  అలాగే కొన్ని సార్లు బ్యాంకు రుణం మాఫీ చేయడానికి పైన చెప్పిన పద్ధతి అనుసరించదు కూడా. నాలుగు సంవత్సరాలు వేచి ఉండాలని బ్యాంకు భావించకపోతే, ఒక నిర్దిష్ట రుణాన్ని తిరిగి పొందలేమని బ్యాంకుకు అనిపిస్తే, అప్పుడా సదరు మొండి బాకీని నాలుగు సంవత్సరాల కన్నా ముందే బ్యాంకు మాఫీ చేయవచ్చు. అప్పు ఇచ్చి.. అబ్బే… ఇది గోడకి కొట్టిన సున్నం అని అప్పు ఇచ్చిన వాడే వెంటనే తనఖాతాల్లో రద్దు చేసుకోవటం అనే తెలివైన పని(అని అనుకోవాలేమో) బ్యాంకులు చేస్తాయి.
వాస్తవంగా ఇది ఎలా అమలు అవుతుంది?
మార్చి 2020 నాటికి బ్యాంకుల మొత్తం మొండి బాకీలు  8.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది కాలంలో బ్యాంకులు 1.85 లక్షల కోట్లను రద్దు చేశాయి. దీని అర్థం బ్యాంకుల మొండి బాకీలు 7.11 లక్షల కోట్లకు పడిపోయాయి. (రూ. 8.96 లక్షల కోట్లు మైనస్‌ ‌రూ 1.85 లక్షల కోట్లు). ఇవి కాకుండా బ్యాంకులు కొన్ని మొండి బాకీల నుండి ఎంతో కొంత వసూలు చేసింది. దీనితో మరికొంత మొండి బకాయిల సంఖ్యను తగ్గింది. అయినా కానీ మనకు కనిపిస్తున్నది స్పష్టంగా మార్చి 2021 నాటికి బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ యొక్క మొండిబకాయిలు 8.35 లక్షల కోట్లుగా ఉన్నాయి.
అసలు ఏం జరుతున్నది..?
వాస్తవం ఏమనగా సంవత్సర కాలంలో బ్యాంకులు సరికొత్త మొండి బకాయిలతో మిగిలాయి. మళ్ళీ బ్యాంకు మొండి బాకీల జాబితా 8.35 లక్షల కోట్లకు పెరిగింది. దీనర్ధం  బ్యాంకులు కొత్త మొండి బాకీలకు ఆస్కారం ఇస్తూనే ఉన్నాయి. నాలుగు సంవత్సరాల తర్వాత మొండి బకాయిలను రద్దు చేయటం అనే  విధానం వాస్తవానికి మొత్తం మొండి బాకీల సంఖ్యలను తగ్గించడానికి కాకుండా కేవలం బ్యాంకు బేలన్స్ ‌షిట్‌ ‌నీటుగా చూపించుకోటానికి నిజం చూపకుండా మెరుగైన చిత్రాన్ని ప్రజలముందుకి పెట్టడానికి ఉపయోగపడింది. అకౌంటింగ్‌ ‌ప్రాసెస్‌ ‌బ్యాడ్‌ ‌లోన్‌ ‌నంబర్లను తగ్గించడానికి బదులు బ్యాంకులు తమ బేలన్స్ ‌షీట్లను తిమ్మిని బమ్మి చేసి చూపటానికి ఉపయోగించుకుంటున్నాయి. ఇదంతా రిజర్వ్ ‌బ్యాంకు కనుసన్నల్లో జరుగుతున్నదనే విషయం మనం మరువకూడదు.

Leave a Reply