సాగు, తాగునీటి రంగాల్లో .. అద్భుత ప్రగతి
- తెలంగాణ ఏర్పాటుతో సమస్యలను పరిష్కరించుకున్నాం
- ప్రగతిభవన్‌లో జెండా అవిష్కరణ…
- గన్‌పార్క్ వద్ద అమరులకు సిఎం కెసిఆర్ నివాళి
- నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- అసెంబ్లీలో జెండా ఎగురేసిన గుత్తా, పోచారం
రాష్ట్ర ప్రయాణం అనుకున్నరీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పునరంకితమవుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేదన్నారు. నేడు తెలంగాణలో వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారన్నారు. అదే నేడు మిషన్ భగీరథతో నీటి సమస్య తీరిందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్‌పార్క్ చేరుకున్న ఆయన అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. •ంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
తెలంగాణ భవన్‌లోలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆరో వార్షికోత్సం సందర్భంగా అసెంబ్లీలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓ నిరుద్యోగి అడ్డుకున్నారు. సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన ఉద్యోగి తనకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరుద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు కొన్ని చోట్ల నిరసనలకు దారి తీస్తున్నాయి. జయశంకర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాడు. భూరికార్డుల్లో తన పేరు నమోదు చేయడం లేదంటూ యువకుడు నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువకుడు మహదేవ్పూర్కు చెందిన మధుగా గుర్తించారు.