దేశంలో టాప్ పది ఆదర్శ
గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే
కేంద్ర ప్రభుత్వం విడుదల
చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి
సిరిసిల్ల పర్యటనలో మంత్రి కే తారక రామారావు
సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.నీళ్లు, నిధుల విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించింది.ఫలితంగానే సమైక్యరాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలుగా ఉన్న అనేక ప్రాంతాలు సస్యశ్యామలమై దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా అన్నపూర్ణగా తెలంగాణ వెలుగొందుతుందన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టాప్ టెన్ ఆదర్శ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలే పది ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు.తలసరి ఆదాయంలో రాష్ట్రీయ స్థూల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించింది. 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధుల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో చెల్లించిందని,జాతి నిర్మాణంలో, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం చోదకశక్తిలా నిలబడుతుందన్నారు.ఇలాంటి పురోగమన రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం అడుగడుగున వివక్ష చూపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఎన్నో అవరోధాలను సృష్టిస్తుంది.
తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.సిరిసిల్లలోని బీసి స్టడీ సర్కిల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అభ్యర్థులకు రూ.2 లక్షల విలువైన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ శాశ్వత భవనాన్ని సంవత్సరంలో గా నిర్మిస్తామని చెప్పారు. సిరిసిల్లలోని సినారె కళామందిరంలో 500 మందికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. వంద పైచిలుకు మందికి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీ సర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.ఎనిమిదేళ్లలోనే జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దామని మంత్రి పేర్కొన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల, వేములవాడ దుర్భిక్ష ప్రాంతాలుగా ఉండేవని, సాగు జలాలు అటుంచి తాగునీటికి కూడా గోసపడే పరిస్థితి ఉండేదని మంత్రి గుర్తుచేశారు. బోర్లు వేసి బొక్కబోర్లా పడ్డ తెలంగాణ.నేడు సాగు, తాగునీటి రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని తెలిపారు. 75 ఏళ్లలో ఎవ్వరూ చేయనివిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామని, కాళేశ్వరంసహా అనేక ప్రాజెక్టులు కట్టి నీటిగోస తీర్చామన్నారు. ఫలితంగా తెలంగాణ.. దేశంలోనే ధాన్యపు బాండాగారంగా మారిందన్నారు.పెరిగిన భూగర్భజాలాలు ట్రైనీ ఐఏఎస్‌లకు ఓ పాఠం,సిరిసిల్ల జిల్లాలో మధ్య మానేరు జలాశయం, అన్నపూర్ణ రిజర్వాయర్ కట్టామని, సాగునీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్వయం సమృద్ధి సాధించిందని మంత్రి పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలోనే జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దామని మంత్రి . శిక్షణ ఐఏఎస్‌లకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్లు పెరిగిన భూగర్భ జలం ఓ పాఠంగా మారిందని చెప్పారు.తెలంగాణ వచ్చిన కొత్తలో తలసరి ఆదాయం 1,24,000 ఉండేదని, ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం 2,78,000కు అంటే 130 శాతం పెరిగిందని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇవి రిజర్వ్ బ్యాంకు చెప్పిన లెక్కలని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ 5,60,000 కోట్లుగా ఉండేదని, ప్రస్తుతం 11,55,000 కోట్లని అంటే 128 శాతం పెరిగిందని వివరించారు.అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 1,49,000 మాత్రమేనని తెలిపారు.భారత దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ భౌగోళికంగా 11, జనాభాలో 12 స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉందని వివరించారు. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి సాధించడం వల్లే గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఎనిమిదేళ్లలో దేశానికి ఆర్థిక చోదకశక్తిగా తెలంగాణను నిలిపామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ. 3,65,797 కోట్లు ఇచ్చామన్నారు. దేశం నుంచి 1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు.
నిధుల విషయంలోనూ స్వయం సమృద్ధి సాధించినట్లు తెలిపారు. దేశ నిర్మాణంలో తెలంగాణ గొప్ప పాత్ర వహిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలేనని, నిరుద్యోగులు, ఫ్రెషర్స్‌కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని తెలిపారు.మొదటి ఐదేళ్లలో రాష్ట్రంలో 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, రెండో దఫా 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధానమంత్రి కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్‌ఫోన్ పక్కనపెట్టి అంకిత భావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని వెల్లడించారు. ప్రతిభ ప్రాతిపదికనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు అవకా శాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,నాయకులు గూడూరి ప్రవీన్, చక్రపాణి,సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పాల్గొన్నారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు : మంత్రి కేటీఆర్
దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆదివాసీ మహిళ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం మనందరికీ గర్వకారణం అన్నారు.ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లులను ఆమె ఆమోదం పొందేలా కేంద్రం పై ఒత్తిడి తెస్తారని మంత్రి ఆశిస్తున్నట్లు తెలిపారు.