Take a fresh look at your lifestyle.

ఓరుగల్లులో..వలస కార్మిక కుటుంబం బలవన్మరణం

  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురిగా గుర్తింపు
  • కార్మికుల్లో కలకలం – పాలకుల నిర్లక్ష్యానికి నిండు కుటుంబం బలి

ఓరుగల్లులో నలుగురు వలస కార్మికులు బలవన్మరణాన్నికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌నుండి వలస వచ్చి గొర్రెకుంటలోని ఒక పరిశ్రమలో వారు పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా అటు ఉపాధి లేక ఇటు స్వగ్రామానికి వెళ్ళలేని దయనీయమైన స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఎవరికి ఏమి చెప్పుకున్నా.. ఎవరూ ఆదుకోలేని పరిస్థితిని ఆ కుటుంబం ఎదుర్కొంది. ఆటు పాలకులు, ఇటు అధికారులు ఎవరూ కూడా వలస కార్మికుల దుస్థితిపై పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి గొర్రెకుంటలో గురువారం నలుగురు వలస కార్మికులు బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనే నిదర్శనంగా పేర్కొంటున్నారు. వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర, రాష్ట్ర పాలకులు చేస్తున్న ప్రకటనలు ఆర్భాటంగానే మిగిలాయి తప్ప రెండు నెలల నుంచి ఆకలితో అలమట్టిస్తున్న కార్మికుల కడుపు నింపలేకపోయాయి. పాలకుల నిర్లక్ష్యంపై యావత్‌ ‌కార్మిక లోకం దుమ్మెత్తిపోస్తున్నాయి. గొర్రెకుంట సంఘటన తురువాతనైనా పాలకులు కళ్ళు తెరిచి క్షేత్ర స్థాయిలో వలస కార్మికులను ఆదుకునేందుకు పూర్తి చర్యలు తీసుకుంటారని కార్మికులు కోరుతున్నారు.

గొర్రెకుంటలో ఏం జరిగింది…
వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్‌ ఏరియా గురువారం మధ్యాహ్నం సుప్రియ కోల్డ్ ‌స్టోరేజ్‌ ‌సమీపంలోని ఓ బావిలో అనుమానస్పద స్థితిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఒక పురుషుడు, ఒక బాలిక, బాలుడిగా ఉన్నట్లుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్లో భార్య, భర్తతో పాటు తొమ్మిదేళ్ళ కుమార్తెతో పాటు, మరొక నాలుగేళ్ళ బాలుడు ఉన్నట్లు గుర్తించారు. బుధవారం రాత్రి వరకు స్థానికులతో వారు సంబంధాలు ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి వారు బయటకు కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌ ‌నుండి 20 ఏళ్ళ క్రితం వరంగల్‌ ‌నగరానికి వలస వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా గత రెండు నెలల నుంచి వారికి సరైన ఉపాధి దొరకడం లేదు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని అంటున్నారు. కాగా ఇటీవలే స్థానికంగా ఉన్న గోనెసంచుల కార్మాగారంలో భార్య, భర్తకు తాత్కాలిక ఉపాధి దొరికినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఈ ఉపాధితో కుటుంబం గడవడం లేదని స్థానికులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా రోజు ఉపాధి దొరకక పోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్వంత ఊరికి వెళ్ళలేక, ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఈ కుటుంబం ఆత్మహత్మకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లుగా స్థానికుల ద్వారా తెలుస్తోంది. నలుగురి మృతదేహాలను పోలీసులు రెస్కు టీం బావిలో నుండి వెలికితీశారు. మరో ఇద్దరి ఆచూకి లభించలేదు. సంఘటన స్థలానికి పోలీసులు ఉన్నతాధికారులు చేరుకొని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply