Take a fresh look at your lifestyle.

అధికార పదవిలో ఉండి అవగాహణ లేని మాటలు…

అధికార పదవిలో ఉండి అర్థంలేని మాటలు మాట్లాడటం రాజకీయ నాయకులకే చెల్లింది. ముఖ్యంగా మంత్రులు ప్రజాసమూహాల్లో మాట్లాడేప్పుడు కనీసం సోయితో ఉండకపోతే విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగ హోదాలో ఉండి ఒక నిందితుడి గురించి ఆయన తన సహజ ఆవేశంతో చేసిన ప్రసంగం పట్ల వివిధ వర్గాల వారు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ప్రధానంగా మానవహక్కుల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ నిందితుడినైనా చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పాల్సిన నేతలు ఎన్‌కౌంటర్‌ ‌చేస్తామని ప్రకటన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ ‌పరిధిలోని సైదాబాద్‌ ‌సింగరేణి కాలనీలో ఆరేళ్ళ బాలిక చైత్రపై అత్యాచారం జరిగిన సంఘటన యావత్‌ ‌రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

ఆ పసి పాపపై ఇంత దారుణంగా ప్రవర్తించడమే కాకుండా అమ్మాయిని గొంతు నులిమి పక్క బట్టల్లో చుట్టిన ఈ ఘోర పరిస్థితి జరిగి ఆరు రోజులు కావస్తున్నా కనీసం అధికార పార్టీ మంత్రులు, నాయకులెవరూ ఆ కుంటుంబ సభ్యులను పరామర్శించిన పాపాన పోలేదు. పైగా ఈ సంఘటనపై వాస్తవ పరిస్థితులను సరిగా తెలుసుకునే అవకాశం కూడా వారికి లేదేమోనన్నట్లుగా మంత్రుల ప్రకటనలున్నాయి. ఏ సంఘటనపైన అయినా వెంటనే స్పందించే ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు నిందితుడిని అరెస్టు చేసింది లేనిది తెలియకపోవడం విచిత్రాంశం. నాయకులందరికన్నా ముందుగా స్పందించడం పట్ల కెటిఆర్‌ను అభినందించాల్సిందే. కాని, ఆయన ట్విట్‌లో నిందితుడిని అరెస్టు చేసినట్లుగా ముందు తెలిపి, తర్వాత పొరపాటున అరెస్టు అంశాన్ని ప్రకటించానని తప్పును సరిదిద్దుకోవడం చూస్తుంటే కెటిఆర్‌కు కూడా సమాచార లోపం ఉంటుందా అని అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరో మంత్రి సత్యవతి రాథోడ్‌గాని, మల్లారెడ్డిగాని పేపర్‌ ‌ప్రకటనలకే పరిమితమవడం బాధితులను, అక్కడి కాలనీ వాసులను తీవ్రంగా కలవరపరుస్తున్న అంశం.

కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ ఎంఎల్‌ఏ ‌సీతక్క, మజ్లీస్‌ ‌పార్టీ ఎంఎల్‌ఏ అహ్మద్‌ ‌పాషా ఖాద్రి, బిజెపి నేత ప్రవీణ్‌కుమార్‌ ‌లాంటి నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, సీతక్కలు కూడా మల్లారెడ్డి లాంటి మాటలే మాట్లాడారు. నిందితుడిని నడి బజార్‌లో ఉరివేయాల్సిందేనని వారు డిమాండ్‌ ‌చేశారు. అలాగే మేడ్చల్‌ ‌నియోజక వర్గ పరిధిలో నూతన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గ్రామ కమిటి సమావేశాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం నాడు మంత్రి మల్లారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ నోరుజారారు. రాష్ట్ర మంత్రిగా, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా మల్లారెడ్డి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్నం పట్ల విమర్శలు వొస్తున్నాయి. ఇంతకు మందు కూడా ఆయన తొడగొట్టి సవాల్‌ ‌చేసిన తీరుపైనే ఇంకా చర్చ జరుగుతుండగా మరో కొత్త వివాదానికి తెరలేపారు.

సంఘటన జరిగి దాదాపు వారం కావస్తున్నా ఇంతవరకు పోలీసులు నిందితుడు రాజును పట్టుకోలేకపోయారు. ఫలక్‌నామా సిసి ఫుటేజ్‌ ‌ద్వారా నిందితుడి ఆకృతిని మాత్రం పోలీసులు గుర్తించగలిగారు. వారు ప్రకటించిన ఆనవాళ్ళతో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా వారు ప్రకటించారు. పట్టుకుంటే పదిలక్షలు బహుమతిస్తామన్నారు.  అయితే  నిందితుడి గురించిన సమాచారాన్ని వారు కొంత రాబట్టగలిగారు. అమ్మాయిపైన అత్యాచారంచేసి, చంపివేసిన అనంతరం తాను పనిచేసే కాంట్రాక్టర్‌ ‌దగ్గరకు వెళ్ళి తనకు రావాల్సిన పద్దెనిమిది వందల రూపాయలను అడిగి తీసుకుని వెళ్ళినట్లు పోలీసులకు సమాచారమందింది. అయితే నిందితుడు తన వేశాన్ని మార్చి ఉండవచ్చనుకుంటున్నారు.

అతని ఫోన్‌ ‌కూడా స్విచ్‌ ఆఫ్‌ ఉం‌డడంతో అతని ఆచూకీ తెలుసుకునే విషయంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు వారు చెబుతున్నారు. నిందితుడికోసం ఇప్పటికే నాలుగు లా అండ్‌ ఆర్డర్‌ ‌బృందాలు, ఆరు టాస్క్ ‌ఫోర్స్ ‌బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. దిశ సంఘటన జరిగిన తర్వాత మరోసారి ఇటువంటి సంఘటన జరుగకుండా చూస్తామని ప్రకటించిన ప్రభుత్వం, పోలీసులకు ఈ సంఘటన సవాల్‌ ‌విసిరినట్లైంది. నిందితుడి ఆచూకీ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్ది దేశ వ్యాప్తంగా బాధిత కుటుంబానికి మద్దతు పెరుగుతున్నది.

Leave a Reply