Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ దవాఖానాల్లో అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్యసేవలు

  • 90 శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు
  • సంగారెడ్డిలో డయాగ్నాస్టిక్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
  • జిల్లా కేంద్రాలలో ప్రారంభించిన మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానాలో తెలంగాణ డయాగ్నస్టిక్‌ ‌సెంటర్‌ను, ఆర్టీపీసీఆర్‌ ‌కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానాలో డయాగ్నస్టిక్‌ ‌కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు యాభై ఏడు రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. పేదలకు ప్రభుత్వ దవాఖానాలో కార్పొరేట్‌ ‌వైద్య సేవలు అందుబాటులోకి వొచ్చాయన్నారు. రాష్ట్రంలో బుధవారం 19 డయాగ్నస్టిక్‌ ‌కేంద్రాలు ఆయా జిల్లాల్లో అందుబాటులోకి వొచ్చాయని, ఒక్కొక్కటి రూ.2.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 16 కేంద్రాలు అందుబాటులోకి వొస్తాయని మంత్రి తెలిపారు. కిడ్నీ, లివర్‌, ‌థైరాయిడ్‌, ‌గుండెజబ్బులు లాంటి 90 శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారని తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలోని 25 పీహెచ్‌సి, యూహెచ్‌సిల నుండి రక్త నమూనాలు సేకరించి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ పరీక్షలు చేస్తారని, 24 గంటల్లోనే టెస్ట్ ‌ఫలితాలను సెల్‌ ‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ‌రూపంలో పంపడం జరుగుతుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా దవాఖానాలో కొరోనా పరీక్షలకు సంబంధించిన నాలుగు టెస్టులను ఉచితంగా చేస్తారని మంత్రి తెలిపారు. జిల్లాలో 550 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటుకు మంజూరి వొచ్చిందన్నారు. 150 సీట్లతో వైద్యకళాశాల, 100 సీట్లతో నర్సింగ్‌ ‌కళాశాల మంజూరు అయిందన్నారు. నర్సింగ్‌ ‌కళాశాల నిర్మాణానికి 50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలం ప్రభుత్వ జిల్లా దవాఖానా ఆవరణలో 36 ఎకరాల భూమిని గుర్తించామన్నారు నర్సింగ్‌ ‌కళాశాలకు అవసరమైన స్థలాన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలకు 1200 కొత్త పోస్టులు, నర్సింగ్‌ ‌కళాశాల కు 108 కొత్త పోస్టులను సాంక్షన్‌ ‌చేస్తూ కేబినెట్‌ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.

జిల్లా దవాఖానాలో 260 కోట్లతో 650 పడకలతో ఆధునాతన సౌరక్యాలతో కొత్త దవాఖానాను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకువొస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖానాకు రెండు కోట్ల యాభై లక్షలతో కొత్త సీటీ స్కాన్‌ ‌యంత్రం మంజూరు చేశామని, త్వరలో అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, బిబి పాటిల్‌ ‌శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్‌, ‌భూపాల్‌ ‌రెడ్డి, మాణిక్‌ ‌రావు, జెడ్పి చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుశ్రీ, జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్శి షా, వీరారెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌బొంగుల విజయలక్ష్మి, డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌, ‌డిఎంఅండ్‌ ‌హెచ్‌ ‌గాయత్రి దేవి, డిసిహెచ్‌ఎస్‌ ‌సంగారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. ఇక ఆయా జిల్లాలలో మంత్రులు డయాగ్నాస్టిక్‌ ‌సెంటర్లను ప్రారంభించారు.

Leave a Reply