బాధితులకు సకాలంలో వైద్యం : కలెక్టర్
కాకినాడ, : తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ కట్టడితో పాటు బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వివరించారు. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ కొరతలేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జీజీహెచ్‌లో ఇటీవల 1.7 కిలో లీటర్ల పీఎస్ఏ యూనిట్‌ను ప్రారంభించామని, 10 కిలో లీటర్ల సామర్ధ్యం గల ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దాపురంలో రోజుకు నాలుగు కిలో లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యమున్న ఆక్సిజన్ యూనిట్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామన్నారు.
అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ బాధితులకు వైద్య, ఇతర సేవలు అందేలా చేస్తున్నామని అన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా పెంచేందుకు గల అవకాశాలను ఎప్పటికప్పుడు తెలియ చేస్తున్నామని అన్నారు. రెమ్‌డెసివిర్ పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దన్నారు. స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం మాత్రమే ఈ జౌషధాన్ని అవసరం మేరకు వినియోగించాలే తప్ప ఇష్టమొచ్చినట్టు ఉపయోగించకూడదన్నారు. ప్రజల అవసరాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.