Take a fresh look at your lifestyle.

నాడు జీవజల ప్రదాత.. నేడు దుర్గందం తో రోత..

మూసీ కాలుష్యంతో ఆరోగ్యాలపై ప్రభావం..
మానవ తప్పిదాలతో ధ్వంసమవుతున్న సహజ వనరులు..
అత్యంత కాలుష్య నదుల సరసన చేరిక..
పైకి ఆహ్లాదం..లోన కాలకూట విషం..

వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి కొండకోనల్లో పురుడు పోసుకుని వందల కిలోమీటర్ల వరకు జీవ జలాన్ని అందించింది ఆ జీవనది.. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నది వందల కిలోమీటర్ల దూరం ప్రవహించి కృష్ణా నదిలో విలీనమవుతూ దానికి ఉప నదిగా ఉన్నది.. మానవ తప్పిదాలు, స్వార్ధ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తుండడంతో నేడు కాలుష్య కాసారమై దేశంలోనే అత్యంత ప్రమాదకర నదుల సరసన చేరింది..పరిశ్రమల వ్యర్థ విషపూరిత రసాయనాలు, హాస్పిటళ్ల వ్యర్థాలు, డ్రైనేజీ మురుగు నీరు, చివరికి చెత్తాచెదారాలు..మాంస వ్యర్థాలు, జంతు కళేబరాలు ఒక్కటేమిటి సర్వం ఇందులోకి డంపింగ్‌ ‌చేసేస్తున్నారు..అదే మూసీ (ముచుకుందా) నది. ఎంతో సుందరమైన ఈ నది ఈనాడు తన పూర్వ ప్రాభవం కోల్పోయి ఘోషిస్తోంది.

ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలతో, జలచరాలతో, స్వచ్ఛమైన గాలి,
వాతావరణంలో కళకళలాడిన మూసీ నది పరివాహక ప్రాంతాలు నేడు శవాకారాలు అవుతున్నాయి. ఆనాడు ఈ నీటితో చక్కటి పాడి పంటలతో పాటు అందులో చేపలు, ఎండ్రుకాయలు, రొయ్యలతో సమృద్ధిగా విలసిల్ల్లాయి. అయితే అది గతం.. ప్రస్తుతం దీని పరీవాహక గ్రామాల్లో ఇప్పుడు ముక్కుపుటాలదిరే దుర్గంధం, దుర్వాసనలు. గతంలో పంట పొలాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాల్లో నేడు కాలుష్యపు నీటి కారణంగా వరి పంట దిగుబడి తగ్గిపోయింది. ఆ పండిన పంట సైతం రంగు మారి, తాలు (ఊక) రూపంలో బరువు తక్కువగా పండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పండించిన వరి పంటకు సైతం సరియైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ కారణంగా ఇక్కడ బడా భూస్వాములంతా పశుగ్రాసం కోసం వినియోగించే పచ్చి గడ్డి సాగుకు, గడ్డి వ్యాపారులకు అప్పగించి సాగు చేయిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం తమ పొలాల్లో వరి పండించుకుని అదే ఆహారంగా వినియోగిస్తున్నారు. వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరిలో ఉద్భవించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ ‌మహానగరం మీదుగా మేడ్చల్‌ – ‌మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి, ఘట్‌కేసర్‌ ‌మండలాల్లోని పీర్జాదిగూడ, పర్వతాపూర్‌, ‌కాచివానిసింగారం, ప్రతాపసింగారం, కొర్రెముల, వెంకటపూర్‌, ఎదులాబాద్‌ ‌తదితర ప్రాంతాల గుండా మూసీ నది ప్రవహిస్తూ యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల మీదుగా కృష్ణానదిలో విలీనమవుతోంది. హైదరాబాద్‌ ‌నగరం చుట్టూ వందలాది కెమికల్‌ ‌కంపెనీలు నెలకొనడం, వ్యర్థాలన్నీ కాలువలు, పైప్‌లైన్లు, మరి కొన్ని ట్యాంకర్ల ద్వారా వాటి నుంచి వెలువడతున్న విషపూరిత రసాయనాలు మూసీలోకి నేరుగా కలిపేస్తుండడంతో దాని పరీవాహక ప్రాంతాల ప్రజల జీవనం, ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడుతోంది. ఈ విష రసాయనాలు, ఇతర వ్యర్థాలతో మూసీ నది మురికి కూపంగా, విషపూరితంగా మారుతుండడంతో పరీవాహక గ్రామాల ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని పర్యావరణ వేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు ఘోషిస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యంతో ఇక్కడి ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని, చర్మ, శ్వాసకోశ తదితర వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. మూసీ నీటిలో విషతుల్యమైన పలు రకాల రసాయన పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే విష రసాయనాల వల్ల జ్ఞాపక శక్తి సైతం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు యుద్ధప్రాతిపదికన నడుం బిగిస్తేనే రాబోయే తరాలకు మేలు చేసినవారమవుతారని, లేదంటే భవిష్యత్తుతరాలకు తీరని అన్యాయం చేసినవారవుతారని హెచ్చరిస్తున్నారు.

గాలి, నీరు కలుషితం..
కాలుష్యం మానవుడిపైనే కాదు పశు పక్ష్యాదులపై ఏవిధంగా ప్రభావాన్ని చూపుతుందో మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషపూరిత రసాయనాలు క్రమంగా భూమిలోకి చొచ్చుకుపోయి భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడి పరీవాహక గ్రామాల్లో బోర్లు వేసి సంబంధిత గ్రామ పంచాయతీలు సరఫరా చేస్తున్న నీటిని వాడుక నీరుగా ఉపయోగించినా, స్నానాలు చేసినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గతంలో రజకులు ఈ నీటితోనే బట్టలు ఉతికేవారు. కానీ ప్రస్తుతం వ్రహిస్తున్న మురుగు నీటి పుణ్యమా అని బట్టలు ఉతికే పరిస్థితులు ఎంతమాత్రం లేక జీవనోపాధిని కోల్పోయే పరిస్థితులు దాపురించాయని ఆందోళన చెందుతున్నారు. కేవలం ఈ ప్రాంతాల గాలి సోకితే చాలు బంగారు, వెండి ఆభరణాలు నల్లగా మారి సహజత్వాన్ని కోల్పోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక ఇత్తడి, రాగి వంటి వాటి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. బిందెలు, బక్కెట్లు, ఇతర పాత్రలు నల్లగా మారి ఇనుమును తలపిస్తాయి. దీంతో ఇక్కడి ప్రాంతాల్లోని ప్రజలు ఇత్తడి, రాగి పాత్రలు కొనడానికి ఆసక్తి చూపడం లేదు.

దోమలకు ఆలవాలం..
మూసీ పరీవాహక ప్రాంతాలు దోమలకు అడ్డాగా మారాయి. పగలంతా గడ్డి పోలాల్లో మకాం వేసి పొద్దుగూకే వేళకు జనావాసాల్లోకి చేరి కాటు వేస్తుండడంతో నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తోందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి కాటుకు గురయ్యేవారు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల భారిన పడుతూ అనారోగ్యాలకు గురవుతూ మంచాలెక్కుతున్నారు. ప్రజల సుస్తీ స్థానికంగా ఉన్న ఆర్‌ఎం‌పీ, పిఎంపీ డాక్టర్లకు చేతి నిండా పని కల్పిస్తూ, జేబు నిండా డబ్బులు నింపుతున్నాయి. దోమల నివారణకు ఫాగింగ్‌ ‌చేయాల్సి ఉన్నా ఆయా గ్రామ పంచాయతీలు నిధుల లేమితో ఏమీ చేయలేకపోతున్నాయి.

తరిగిపోతున్న పశుసంపద..
మూసీ నది కాలుష్యంతో జల జీవాలు దాదాపు అంతరించిపోగా పశు సంపద కూడా క్రమేపీ కనుమరుగవుతోంది. అప్పట్లో ప్రతి ఇంటికి బర్రెలు, ఆవులు ఉండేవి. ఈ ప్రాంతాల నుంచి నిత్యం హైదరాబాద్‌ ‌నగరానికి పాలు తీసికెళ్లి వ్యాపారాలు అమ్ముకునే వారు. అటువంటిది ఈ ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేలా పశు సంపద చేరుకుంటోంది. దీంతో ఇక్కడ కూడా ప్యాకెట్‌ ‌పాలు కొనాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నీళ్లు తాగిన పశువులు సూడి నిలవక వట్టి పోతున్నాయి. ఈ పశువులను సాకలేక పాడిరైతులు దలారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన దలారులు పశువులను కబేళాలకు చేరవేస్తున్నారు.

పూర్వ వైభవం సాధ్యమేనా..?
మూసీ నదికి పూర్త వైభవం వస్తుందా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మూసీ నది శుద్దికి ప్రయత్నాలు చేస్తూ వేలాది కోట్ల రూపాయలు నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ చర్యను పలువురు పర్యావరణ, ప్రకృతి ప్రేమికులు స్వాగతిస్తున్నారు. అయితే ఈ పథకం వల్ల పూర్తిస్థాయిలో సత్ఫలితాలు వస్తాయా..? అని మరి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మూసీలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలలో అధిక శాతం విషపూరిత రసయనాలు ఉండడంతో వీటిని శుద్ది చేయడం ఎంత వరకు సఫలీకృతమవుతుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అతి ఘాడమైన, విషపూరితమైన రసాయనాల శుద్ధి కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను వినియోగించాలని సూచిస్తున్నారు. నదిలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్న కంపెనీలపై క్రిమినల్‌ ‌కేసులు నమోదుచేయించడం, కఠిన శిక్షలు అమలుచేయడం వంటివి చేస్తే సత్ఫలితాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పైన పటారం..లోన లొటారం..
నది పరీవాహక ప్రాంతాలను పరిశీలిస్తే ఆంధప్రదేశ్‌లోని కోనసీమను తలపించేలా అగుపడతాయి. పచ్చని పొలాలు, అనేక రకాల చెట్లు, చల్లని గాలులతో ఆహ్లాదకరమనిపిస్తుంది. అయితే ఇది పైకి మాత్రమే. ఈ నీటితో సాగవుతున్న ధాన్యం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆరోగ్యానికి ఏ మాత్రం క్షేమం కాదని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఇక్కడి నీరు, గాలికి బంగారు, వెండి నగలు, ఇత్తడి, రాగి పాత్రలు తమ సహజత్వాన్ని కోల్పోయి నల్లగా మారిపోతున్నాయి. వాడుకలో ఉన్న వస్తువులే కాకుండా ఉపయోగించకుండా మూలనపడేసిన పాత్రలు సైతం నల్లగా మారిపోతున్నాయంటే ఇక్కడి వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. లోహాలే ఇంతలా రంగుమారిపోతుంటే మరి ఇక్కడ నివసిస్తున్న మానవాళి, జంతుజాలం ఆరోగ్యాలు ఎంత ప్రమాదకర స్థితిలోకి నెట్టబడుతున్నాయో స్పష్టమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేయకుండా యుద్ధప్రాతిపదికన మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళనకు నడుం బిగిస్తేనే ఈ ప్రాంతాల్లోని భవిష్యత్తు తరాలు ఆరోగ్యాలతో మనగలిగే అవకాశాలు ఉంటాయి.

సమూలంగా ప్రక్షాళన చేయాలి..
కాలకూట విషంలా మారి మానవాళిమనుగడకే ప్రశ్నార్థకంగా పరిణమించిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇందుకోసం ఎంత వ్యయమైనా వెనకడుగువెయ్యకూడదు. ఘాడమైన విష రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యర్థాలు కలపకుండా ఇతరత్రా వ్యర్థాలు సైతం డంపింగ్‌ ‌చేయకుండా కఠినమైన, పకడ్బందీ చట్టం తీసుకురావాలి.

శాశ్వత పరిష్కారం చూపాలి..
మూసీ ప్రక్షాళన విషయంలో ప్రకటనలతోనే సరిపెట్టకుండా చిత్తశుద్ధితో శాశ్వత చర్యలకు పూనుకోవాలి. మూసీ నుండి దుర్వాసనలతో వాతావరణం కలుషితమై ఆరోగ్యాలపై ప్రభావం చూపుతోంది. అధునాతన సీవరేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్ల(ఎస్టీపీ) ఏర్పాటు విషయంపై దృష్టి సారించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వాడుతున్న పరిజ్ఞానాన్ని పరిశీలించాలి.

Leave a Reply