న్యూదిల్లీ (ఆర్ఎన్ఏ) : వలస కూలీలను స్వంత రాష్ట్రాలకు 15 రోజుల్లోగా పంపించి వేయాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా మరోమారు ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వలస కూలీలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. సరళీకరించిన పద్ధతిలో వలస కూలీల జాబితాను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు కోరింది. వలస కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి కూడా వెల్లడించాలని కోర్టు పేర్కొన్నది. ఒకవేళ ఏ రాష్ట్రానికైనా శ్రామిక్ రైళ్ల అవసరం ఉంటే, రైల్వేశాఖ ఆ రాష్ట్రానికి 24 గంటల్లో రైలును ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొన్నది. కూలీల కోసం తయారు చేసిన పథకాలు, ఉపాధి కల్పనలకు సంబంధించిన వివరాలతో కూడిన దరఖాస్తులను జూలై 8వ తేదీలోగా సమర్పించాలని, ఆ రోజున మళ్లీ ఈ కేసును విచారించనున్నట్లు సుప్రీం పేర్కొన్నది.