- కొరోనా బాధితులకు కఠిన కష్టాలు
- కోట్లు వెచ్చించినా మెరుగపడని ఎంజిఎం పరిస్థితులు
- తిష్టవేసిన అధికారులపై చర్యలు కరువు
ఉత్తర తెలంగాణకు కేంద్రమైన వరంగల్ ఎంజిఎం అంటేనే పేదల ఆసుపత్రి అని పేరుంది. ఈ పేదల ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు బయపడాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యులు, సిబ్బంది కోరత, పరికరాల లేమి ఒక వైపు ఉండగా, మరో వైపు కొంత మంది అధికారుల ధన దాహం, నిర్లక్ష్యం వల్ల ఎంజిఎంకు దుర్బర పరిస్థితులు కొనసాగు తున్నాయి. ఈ సర్కారు దవాఖనాకు ‘‘నేను రాను బిడ్డో అంటూ’’ ప్రజలు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితిల్లో వెళ్తున్న వారు దయనీయంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు అనే చందంగా రోగులు కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిచడం లేదు. ఏకంగా కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించడంలో ఎంజిఎం అధికారులు సిద్ధహస్తులు ఆయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ప్రజలంటున్నారు. ఎంజిఎం దుస్థితిపై ‘ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి’ కథనం ఇలా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కొరోనా కేసులు పెరుగుతుడడంతో ఎంజిఎం ఆసుపత్రిలో కొరోనా చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో అధికారులు వరంగల్ ఎంజిఎంలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పింస్తున్నామని, ఇందుకోసం లక్షలు వేచిస్తున్నామని చెప్తున్న అధికారులు ఆచరణలో మాత్రం అది చేయడం లేదు. వరంగల్ ఎంజిఎం అధికారులు చెప్తున్న దానికి కోవిడ్ వార్డులో ఉన్న పరిస్థితులకు చాలా తేడాలు ఉన్నాయి. కోవిడ్ వార్డులో బాత్ రూమ్‌లు కూడా శుభ్రంగా లేని దుస్థితిలో కొరోనా పాజిటివ్ రోగులు కాలం వెళ్ళదీస్తున్నారు. ఎంజిఎం కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు సరైన తిండి, త్రాగేందుకు నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కొరోనా పాజిటివ్ రోగులు. పౌష్టికాహారం అందక ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని కాలం వెల్లడిస్తున్నారు. పాజిటివ్ రోగులకు ఇచ్చే డైట్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొరోనాను జయించాలి అంటే పరిశుభ్రమైన వాతావరణం, ఎప్పటికికప్పుడు పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ప్రతి 2 గంటలకు ఒక్క సారి చేతులు సబ్బుతో కడుక్కోవాలి. అంతే కాదు తరచు సనీటైజర్లు వాడాలి. వీటినన్నింటితో పాటుగా పూర్తి స్థాయిలో పౌష్టికాహార తీసుకోవాలి. అప్పుడే కొరోనా జయించడం సాధ్యమని ప్రభుత్వం చెబుతుంది. అందుకే కొరోనా వచ్చిన వారి కోసం ప్రత్యేకమైన క్వారంటైన్ సెంటర్లలలో మొన్నటి వరకు చికిత్స, పౌష్టికాహారం అందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా డైట్ కూడా ఇచ్చారు. కానీ వరంగల్ ఎంజిఎంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
కొరోనా పాజిటివ్ వచ్చినా వారికి సాధారణ రోగులకు ఇచ్చే డైట్ మాత్రమే ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక వారికి ఇచ్చే ఆహారం మరీ దారుణంగా ఉంది. పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందులోనూ వయస్సు మళ్ళిన వాళ్ళు మూడు అంతస్తులు క్రిందకు దిగి ప్లేట్లలో అన్నం తీసుకెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిజానికి కొరోనా సోకిన వాళ్ళుకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అందుకోసం ప్రభుత్భం కొరోనా పెషేంట్ ఒక్కరికి ఇచ్చే డైట్ కోసం రూ.200 కేటాయిస్తున్నట్లు సమాచారం. కొరోనా రోగుల కోసం ప్రత్యేకమైన డైట్ ఇవ్వాలని ప్రభుత్వ సూచించింది. ఉదయం, సాయంత్రం పాలు, ఒక్క పూట బ్రెడ్, ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం రెండు కూరలు, సాంబార్, ఒక గుడ్డు అన్నం, ఒక పండు ఇవ్వాలి, సాయంకాలం 3 నుండి 4 గంటలకు డ్రై ఫ్రూట్స్, కానీ స్నాక్స్ ఇవ్వాలి. రాత్రి రెండు కూరలతో అన్నం పెట్టాలి. ఇలాంటి పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉండగా సాధారణ పెషేంట్‌కు ఇచ్చే మెనునూ పాజిటివ్ పెషేంట్లకు అందజేస్తున్నారని పెషేంట్లు ఆరోపిస్తున్నారు. ఒక కొరోనా రోగులకే కాదు వారికి వైద్యం అందించే వైద్యులకు సైతం రూ.250లతో మంచి ఆహారం అందించాలి. కానీ. ఎంజిఎంలో వైద్యులకు ఇచ్చే ఆహారం తినలేక వైద్యులు ఈ ఆహారాన్ని బయట పడేస్తున్నారు. ఇలా డైట్ లో ని•ంధనలు పాటించని వారిపై ఎంజిఎం పాలనధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పారిశుధ్యం కోసం ఇస్తున్న నిధులు ఎటుపోతున్నాయి. ఇక డైట్లోను అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంజిఎంలో కొరోనా రోగులకు ఎలా మంచి చికిత్స అందుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంజిఎంలోని వసతుల లేమిపై వస్తున్న విమర్శలతో ఎమ్మెల్యే సీతక్క ధైర్యం చేసి కోవిడ్ వార్డు దగ్గర పరిస్థితులను పరిశీలించారు. అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చికిత్స కోసం వచ్చిన రోగులు ఏకరువు పెట్టారు. ఎంజిఎంపై ఇన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఎంజిఎంకు వెళ్లి ఎందుకు పరిశీలించారు. బాద్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎంజీఎంలో వస్తున్న ఆరోపణల పై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు దోషులు బయటపడతారంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ప్రజా ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్వయంగా ఎంజీఎం ని సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కూడా స్ఫూర్తి నిచ్చిన వాళ్ళు అవుతారు. అక్రమాలకు చెక్ పడి కొరోనా బాధితులకు సరైన చికిత్స అందుతుందని పలువురు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఎంజిఎం కోవిడ్ వార్డు పరిస్థితి మరీ దారుణంగా మారింది. కోవిడ్ వార్డులో కొరోనా పాజిటివ్ వచ్చిన వారిని పట్టించుకోవడమే మరిచారు హాస్పిటల్ సిబ్బంది. కేవలం 2 బాత్ రూములు మాత్రమే ఉన్న ఒక హాల్లో 20 మంది కొరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళను పెట్టారు. దీంతో ఎంజిఎం కోవిడ్ వార్డు దుర్గంద భరితంగా మారింది. ఎంజిఎం అధికారులు కొవిడ్ వార్డులో శుభ్రతను గాలికి వదిలేయడతో వచ్చిన రోగం పోవడమేమో కానీ కొత్త రోగాలు తెచ్చి పెట్టె పరిస్థితి నెలకొంది. చికిత్స పొందుతున్న రోగులు రెండు రోజులుగా వార్డును శుభ్రం చేయండి బాబోయ్ అని ఆయాల నుండి డాక్టర్ వరకు మోర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కొరోనా వార్డు రోగులు వార్డు దుస్థితిని బయట ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు. తమకు కొరోనా పాజిటివ్ అనే విషయం బయట ప్రపంచానికి తెలిసిన పర్వాలేదని ధైర్యం చేసి కొరోనా వార్డులోని దుస్థితిని వీడియోలను వారి కుటుం• సభ్యులతో పాటు మీడియాకు పంపించారు. ఎన్ని విమర్శలు వచ్చినా వరంగల్ ఎంజిఎం అధికారుల తీరు మారడం లేదు. కొరోనా నివారణ కోసం ప్రత్యక వార్డు పెట్టాం మెరుగైన చికిత్స అందిస్తున్నాం, లక్ష రూపాయలు ఖర్చు చేసి అన్ని వసతులు కలిపిస్తున్నాం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే అధికారులు మాటలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని బాధితులు తీసి పంపిన వీడియోలే చెబుతున్నాయి. ఇది వరంగల్ ఎంజిఎంలో కొరోనా వార్డులో ఏర్పాటు చేసిన మూడో అంతస్తులోని పరిస్థితి. తాగిన వాటర్ బాటిల్స్ రోజు తీసేయడం లేదు. చెత్తను, ఆ పక్కనే పెషేంట్స్ బట్టలు మూడు, నాలుగు రోజులుగా అక్కడే పడేసి ఉన్నాయి. నిజానికి కోవిడ్‌ను జయించాలంటే ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలే కాదు వ్యక్తి గత శుభ్రతతోనే వైరస్ నుండి బయట పడడం సాధ్యం అనే చెప్పే వైద్యాధికారులు పాజిటివ్‌తో వచ్చిన వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉంది. ఎక్కడో మారు మూల గ్రామంలోని ఆసుపత్రిలో కాదు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంలోని దుస్థితి ఇది.
ఈ ఒక్క కొరోనా వార్డులోనే దుస్థితి ఇలా ఉంటే ఐసోలేషన్ వార్డుతో పాటు కొరోనా పెషేంట్ల కోసం ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్‌లో ఉన్న మరో రెండు ఫ్లోర్లలోను ఇలాంటి సమస్యతోనే ఇబ్బందులు పడుతున్నారని, మూడు ఫ్లోర్లలోను ఇంతే అద్వాన్నంగా పరిస్థితులు ఉన్నాయి. అని అక్కడ చికిత్స తీసుకుంటున్న వారు వాపోతున్నారు. కొరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక వార్డులోనే ఇలా ఉంటే ప్రభుత్వం వెచ్చిస్తున్నా కోట్ల రూపాయల ఎటు పోతున్నాయని ఇక్కడి రోగులు అడుగుతున్నారు. వరంగల్ ఎంజిఎం అధికారులు ఏకంగా జిల్లా కలెక్టర్‌నే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారా? అపరిశుభ్రంగా ఉన్న కోవిడ్ వార్డును శుభ్రం చేయకుండానే ఎప్పుడో 15 రోజుల క్రితం శుభ్రం చేసిన ఫోటోలను కలెక్టర్‌కు పోస్ట్ చేసి చేతులు దులుపుకునేందుకు చేసిన బండారం బయటపడంతో విధిలేని పరిస్థితిలో కోవిడ్ వార్డును శుభ్రం చేశారు. ఎంజీఎం చికిత్స తీసుకుంటున్న బాధితులు నేరుగా జిల్లా కలెక్టర్‌కి వీడియో కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వార్తకు స్పందించిన కలెక్టర్ ఎంజిఎం అధికారులను మందలించారు. దీంతో రెండు గంటల తర్వాత కోవిడ్ వార్డును శుభ్రం చేసినట్టు వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్‌కు అధికారులు ఫోటోలు పంపించారు. మీడియా)తో కోవిడ్ వార్డు సమస్య వెలుగులోకి వచ్చిన స్పందన లేదని భావించిన బాధితులు మరోసారి తమ బాధలను మరో సారి మీడియా దృష్టికి తెచ్చింది.
రోగుల బాధలను మీడియా ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఎంజీఎం అధికారులు ఆడిన నాటకం బయట పడింది. దీంతో అసలు బండారం బయట పడింది. అపరిశుభ్రంగా ఉన్న వార్డులో కేవలం బ్లీచింగ్ పొడర్ చల్లి ఎప్పుడో 15 రోజుల క్రితం వార్డును శుభ్రం చేసిన ఫోటోలను జిల్లా కలెక్టర్ కు పంపిన తీరు కలెక్టర్ గుర్తించారు. అసలు విషయం తెలుసుకున్నాక జిల్లా కలెక్టర్ అధికారులపై విరుచుకు పడ్డారు. క్షణాల్లో సమస్య పరిష్కారం కావాలని గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసిన వరంగల్ ఎంజీఎం అధికారుల తీరు మారడం లేదు. పేదలకు సేవా చేసే వృత్తి లో ఉన్న వైద్య సిబ్బంది. కష్టాల్లో ఉన్న పేద రోగులను పట్టించుకోపోగా జిల్లా కలెక్టర్ నే తప్పు దారి పట్టించేందుకు చేసే ప్రయత్నాలే వారి నిర్లక్ష్యపు వైఖరిని బయట పెట్టాయి. ఎన్నో ఆశలతో ఆస్పత్రికి వచ్చే వారిపట్ల ఎంజీఎం సిబ్బంది చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి రోగుల ప్రాణాల మీదకు తెస్తుంది.