Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అక్రమ నిర్మాణాలు…!?

జరిగేటప్పుడు నిర్లక్ష్యం…తరువాత చర్యలు అంటూ హడావిడి
మరో పక్కన బిల్డింగ్‌ ‌రెగ్యులరైజేషన్‌
‌చర్యలు తీసుకునేందుకు స్థానిక అధికారులకు అధికారాలు కట్‌
‌స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ అం‌టూ ఊదర
టిఎస్‌బి పాస్‌ అమలుకు రెండేళ్లు, ఆచరణకు ఇంకెన్నాళ్లు?
వెరసి జోరందుకున్న అక్రమ నిర్మాణాలు..ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

అక్రమ నిర్మాణాలను సహించం..వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం…వీటిని నివారించడంలో రాజీపడం… అవసరమైతే బిల్డర్లపై క్రిమినల్‌ ‌కేసులు పెడతాం…ప్రభుత్వ ఆదాయానికి గండి పడనీయం..ఇలా ఉంటాయి ప్రభుత్వ పెద్దల ప్రకటనలు. కానీ జీహెచ్‌ఎం‌సీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఎక్కడా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. పైపెచ్చు రెట్టింపు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల జేబులు మాత్రం నిండుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి తరుణంలో ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరిగే అవకాశం లేదు. మరో పక్కన ఇక్కడ జరిగే అక్రమ వసూళ్లలో కింది నుండి పై వరకూ అధికారులకు వాటాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. అందువల్లనే అక్రమ నిర్మాణాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారు అని తెలుస్తుంది.

మరో పక్కన జిహెచ్‌ఎం‌సి పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చర్చించారు. ఆ తరువాత వాటికి అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశించారు. అయితే ఫలితం కనిపించలేదు. సరి కదా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. మరో పక్కన ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన భవనాలకు బిల్డింగ్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌పథకం ద్వారా ఆమోదం తెలపడం కూడా ఇందుకు పూర్తిస్థాయిలో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను అమలు చేసినా ఈ పరిస్థితి ఉండదు. అక్రమ నిర్మాణాలను ప్రారంభంలోనే నిలిపివేస్తే తరువాత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నిర్మాణదారులకు నష్టం ఉండదు. ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ద్వంద్వ నీతిని ప్రయోగిస్తుంది. ఓ పక్క బిఆర్‌ఎస్‌ అం‌టూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుంది. మరో పక్క అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతకు అధికారులను ఆదేశిస్తుంది. దీనివల్ల తీవ్రమైన అవినీతికి ప్రభుత్వం ఆస్కారం కల్పించినట్లు అవుతుంది.

ఇప్పుడు పరిస్థితి మరీ దారుణం
ఇంతకు ముందు వరకూ పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం మరీ దారుణంగా తయారైంది. ప్రభుత్వం తీసుకువొచ్చిన టిఎస్‌ ‌బిపాస్‌తో గత మూడు నెలలుగా అడిగే నాథుడు కూడా లేడు. బి పాస్‌ ‌ప్రస్తావన 2019లో వొచ్చి అప్పుడే రూపకల్పన జరిగింది. కానీ దాని అమలుకు ఆరు నెలల క్రితం మాత్రమే ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్ర స్థాయిలో వాటిపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్‌ ‌టాస్క్‌ఫో•ర్స్ ‌మూడు నెలల క్రితం నియమించారు. ఎన్‌ ‌ఫోర్స్ ‌మెంట్‌ ‌టీములు ఏర్పాటు చేసి, చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో పక్కన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారాలను స్థానిక అధికారుల నుండి తొలగించారు. బిల్డింగ్‌ అనుమతులు ఇవ్వడం, ఇతర చిన్న చిన్న ఫిర్యాదులకు మాత్రమే వారిని పరిమితం చేశారు. ఇప్పుడు వారిని ఇతర విభాగాల పనులకు వినియోగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై వీరికి ఫిర్యాదు అందితే వీరు స్పెషల్‌ ‌టాస్క్‌ఫో•ర్స్ ‌నోడల్‌ అధికారికి పంపించాలి. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలా లేదా అనేది ఎస్టీపి చేతిలో ఉంటుంది. ఇదిలా ఉంటే టీఎస్‌ ‌బిపాస్‌ ‌పురుడు పోసుకుని ఈ చర్యలకు ఉపక్రమించే యంత్రాంగాన్ని తయారు చేసుకునేందుకే రెండు సంవత్సరాలు పట్టింది. ఇక వారికి ఈ వ్యవస్థపై అవగాహన కలిగి చర్యలకు దిగేందుకు మరి ఎంత సమయం పడుతుందో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా అడిగేవారు లేకపోవడంతో అక్రమ నిర్మాణదారులు తమ పని తాము చేసుకుంటు పోతుండడంతో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల వరకు అక్రమ నిర్మాణాల నిలువరించడం సాధ్యమవుతుందా?
ఈ అక్రమ నిర్మాణాలను నిలువరించే కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికల లోపు సాధ్యపడకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాల సంఖ్యకు సరిపడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌సిబ్బంది లేకపోవడం ఒక కారణం. కాగా వీటిని పూర్తిస్థాయిలో కూల్చివేసే సాంకేతికతను జిహెచ్‌ఎం‌సి పాటించడంలేదు. అందుకు అవసరమైన యంత్రాలు కూడా అందుబాటులో లేవు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే జిహెచ్‌ఎం‌సి ఎన్నికల ముందు పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపడితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావం పెరుగుతుంది. కాబట్టి జిహెచ్‌ఎం‌సి ఎన్నికలకు ముందు వాటిని కూల్చవద్దని ప్రభుత్వం నుండి అధికారులకు అనధికార ఆదేశాలు అందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ఎన్నికలప్పుడు కూడా అలాంటి పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ పూర్వరంగంలో అక్రమ నిర్మాణాలపై ఈ ఎన్నికలకు ముందు చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా అక్రమ నిర్మాణాలకు సహకరించే పరిస్థితిలే తప్ప అడ్డుకునే అవకాశాలు మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం రాజకీయ స్వలాభాలను చూసుకోకుండా, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply