Take a fresh look at your lifestyle.

వినోద్ దువా పై ఎఫ్ ఐ ఆర్ కు ఐజేయూ నిరసన

హైదరాబాద్, చండీగఢ్, జూన్ 9 సుప్రసిద్ధ జర్నలిస్టు, విశ్లేషకుడు, వార్తా వ్యాఖ్యాత వినోద్ దువాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) తీవ్ర నిరసన తెలియజేసింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు నవీన్ కుమార్ ఫిర్యాదుపై పోలీసులు ఈనెల 4వ తేదీన ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని పబ్లిక్ న్యూసెన్స్ 290 సెక్షన్ కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్ల విషయంలో పోలీసుల నిర్వాకంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ కేసు నమోదు చేశారు. ఐజేయూ అధ్యక్షుడు కె శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ ఒక ప్రకటన చేస్తూ ఒక సీనియర్ జర్నలిస్టుపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం, అధికార పార్టీపైనా, ఆ పార్టీ నాయకులపైనా, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనా, హోం మంత్రి అమిత్ షాపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్న సంకేతాలివ్వడమేనని వారు పేర్కొన్నారు., ఇది పత్రికా స్వేచ్చపై ప్రత్యక్ష దాడి అని వారు విమర్శించారు,.

నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదనీ, పోలిసులు దానిని బుట్టదాఖలు చేసి ఉండాల్సిందని శ్రీనివాసరెడ్డి, బల్వీందర్ సింగ్ లు పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్ర పోలీసు ఆధీనంలో ఉందనీ, ఇక్కడి శాంతి భద్రతల పరిస్థితిపై విమర్శలు చేస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జర్నలిస్టులను బెంబేలెత్తించే విధమైన చర్యలు తీసుకోవడం దారుణమని,ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని వారు విమర్శించారు. వినోద్ దువాపై ఎఫ్ ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదని శ్రీనివాసరెడ్డి, బల్వీందర్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను వర్కింగ్ జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయ రంగానికి చెందిన వారు దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన తెలియజేయాలని శ్రీనివాసరెడ్డి, బల్వీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి పత్రికా రచయితలు, సంపాదకులు, ఈ రంగానికి చెందిన అన్ని వర్గాల వారూ ఐక్యంగా పోరాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply