Take a fresh look at your lifestyle.

కొరోనా తీవ్రతను పట్టించుకోవడం లేదు… హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు కొరోనాపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రేటర్‌ ఎన్నికల సంగతి ఏమో కానీ, ప్రచారం ముగిసిన తర్వాత రాష్ట్రంలో కొరోనా రెండవ దశకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవే. రోజుకు 50 వేల పరీక్షలు జరపాలంటూ తాము ఇటీవల ఇచ్చిన ఆదేశాన్ని ప్రభుత్వం బేఖాతరు చేయడంపై హైకోర్టు ఆగ్రహించింది. తెరాస ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే కొరోనా పరీక్షల విషయం పట్టించుకోవడం లేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రోజుకు 50 వేల పరీక్షలు అవసరమైతే చేస్తామంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని ప్రశ్నించింది. హైదరాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలతో పాలనా యంత్రాంగం అంతా వాటిపైనే దృష్టిని కేంద్రీకరించిన మాట నిజమే కానీ, హైకోర్టు పేర్కొన్నట్టు ప్రజల ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలూ కోవిడ్‌ ‌సంగతిని మరిచి పోయినట్టు కనిపిస్తోంది. పార్టీ నాయకుల ర్యాలీలలో అధిక సంఖ్యలో జనం పాల్గొంటున్నారు. నిరంతర వార్తా స్రవంతులలో నిత్యం కనిపిస్తున్న దృశ్యాలే ఇందుకు నిదర్శనం. కోవిడ్‌ ‌టెస్ట్‌లో తెలంగాణ మొదటి నుంచి అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్న అభిప్రాయం హైకోర్టుకే కాదు, కేంద్రానికి బాగా బలపడింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఈ విషయమై హెచ్చరించారు. గ్రేటర్‌ ఎన్నికలు అయిన తర్వాత కొరోనా రెండవ దశ ఫలితాలు వొస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే దానిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో పరిస్థితి చూస్తే ఇది సహేతకమేననిపిస్తోంది. ఢిల్లీలో కొరోనా కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి, కాలుష్యం కారణంగా మళ్ళీ పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల కాలుష్యం పెరుగుతోంది.

ఇది పాత సమస్యే అయినప్పటికీ, కాలుష్యం వల్ల కొరోనా మరింతగా వ్యాపిస్తుందేమోనన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢిల్లీ నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోవాలని వైద్యులు సలహా ఇవ్వడంతో ఆమె ప్రస్తుతం గోవాలో ఉంటున్నారు. ఢిల్లీలో నవంబర్‌లో ఇంతవరకూ రెండువేల మంది మృత్యువాత పడ్డారు. అక్టోబర్‌ ‌నుంచి ఇంతవరకూ ఢిల్లీలో 2,364 మంది కోవిడ్‌ ‌వల్ల మరణించారు. కొరోనా సోకినవారు ఆలస్యంగా హాస్పిటళ్లలో చేరడం వల్లనే వారి పరిస్థితి విషమిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఐసీయూల్లో పడకల సంఖ్య తగినంత లేకపోవడం, వైద్యుల కొరత వంటి కారణాల వల్ల కూడా వైరస్‌ ‌విజృంభిస్తోందని అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ హైకోర్టు మాదిరిగానే ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. మరణాల సంఖ్య పెరిగిన తర్వాత పరీక్షల సంఖ్య పెంచిందని ఆక్షేపించింది. తెలంగాణ హైకోర్టు కూడా ప్రైవేటు హాస్పిటళ్లపై అనేక ఫిర్యాదులు వొస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆక్షేపణ తెలిపింది. ఢిల్లీలో కొరోనా వ్యాప్తి వల్ల అసలే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే, పంజాబ్‌ ‌నుంచి రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం కారణంగా దేశ రాజధానికి భారీ సంఖ్యలో తరలి వొస్తున్నారు. దీంతో నగర సరిహద్దులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం కారణంగా కోవిడ్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమలు జరగడం లేదని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అటు ఢిల్లీలోనూ ఉత్తరాది రాష్ట్రాల రైతులు వ్యవసాయ బిల్లులపై ఆందోళనను ఉధృతం చేయడం వల్ల కోవిడ్‌ ‌నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా అన్ని పార్టీలూ పని చేస్తున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ ‌వరకూ అన్ని చోట్లా అదే తీరు. దీని వల్ల సామాన్యులకు ఒరిగేది ఏమీ లేకపోగా నష్టం జరుగుతోంది. మత విశ్వాసాలను గౌరవించాల్సిందే కానీ, కొరోనా వంటి మహమ్మారి వొచ్చినప్పుడు సర్దుకుని పోయే తత్వం ప్రజల్లో ఉండాలి. ఆంధ్ర, తెలంగాణలలో తుంగభద్ర నది పుష్కరాలకు స్నానమాచరించేందుకు జనం తరలి వొస్తున్నారు.

అలాగే, జనవరిలో హరిద్వార్‌లో కుంభమేలా ఏర్పాట్లు ఇప్పటి నుంచే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. అలాగే, కార్తీక మాసంలో పుణ్య తీర్ధాల సందర్శనే కాకుండా మంచి ముహూర్తాలున్నాయని పెళ్ళిళ్ళను ఘనంగా జరిపించేస్తున్నారు. రాజస్థాన్‌ ‌రాజధాని జైపూర్లలో ఈ నెలాఖరులోగా రికార్డు స్థాయిలో పెళ్ళిళ్ళు జరగనున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ ‌నిబంధనలను ఉల్లంఘించి పెళ్ళిళ్ళు, మతపరమైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కాగా, మహారాష్ట్రలో కూడా కొరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ముంబాయిలో మరో సారి లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించాలన్న ఆలోచనలు జరుగుతున్నాయి. అదే జరిగితే శివార్లలోని వేలాది పరిశ్రమలు మూత పడి ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లో కూడా అటువంటి పరిస్థితి వొస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేసేవారనేకమంది ఉన్నారు. ఎన్నికల పేరు చెప్పి నగరం బాగు పడటం మాట అలా ఉంచి మళ్ళీ కొరోనా వ్యాపిస్తే తట్టుకునే శక్తి ప్రజలకు లేదని పాతతరం వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply