Take a fresh look at your lifestyle.

యూపీఏ-2 కన్నా ఎక్కువగా.. వాగ్దానాలను విస్మరించిన ‘ఎన్‌డిఏ -1’

Ignoring promises NDA-1ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014-19 మధ్య కాలంలో 1,540  వాగ్దానాలను చేసింది. అవన్నీ ఇప్పటికీ నెరవేరలేదు. మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు 14,16 లోక్‌ ‌సభల మధ్య 300 శాతం నెరవేరలేదు. ఇండియా స్పెండ్‌ ‌విడుదల చేసిన పార్లమెంటు వివరాలపై విశ్లేషణ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వాగ్దానాలలో అనేక అంశాలు ఉన్నాయి. కస్టడీ మరణాలపై సమాచారం, పెద్ద నోట్ల రద్దు  ప్రభావం, జర్నలిస్టులపై దాడులు మొదలైన అంశాలను వెల్లడిస్తానన్న వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చలేదు. 16వ లోక్‌ ‌సభ కాలపరిమితి పూర్తి అయ్యేనాటికి 1, 540  హామీలు  అమలు కాలేదు. మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ-1 ప్రభుత్వం 2014-19 మధ్య ఇచ్చిన హామీల్లో ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయి.

మన్మోహన్‌ ‌రెండో టరమ్‌ అధికారంలో ఉన్న 2009-14 మధ్య కాలంలో 385 హామీలు మాత్రమే అమలు కాలేదు.  2018-19 మధ్య కాలంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా 2019 సాధారణ ఎన్నికల వరకూ మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 76 శాతం అమలు కాలేదు. ప్రభుత్వం సభా ముఖంగా ఇచ్చిన  హామీలే అమలు కాలేదు. ఈ హామీలను సభ్యులు లేవనెత్తిన అంశాల సందర్భంగా ఇచ్చినవే.  ఈ హామీలన్నీ ముఖ్యమైనవే. ప్రజాప్రతినిధులుగా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సందర్భంగా చేసినవి కనుక వీటిని  ప్రభుత్వం తప్పని సరిగా అమలు జేయాల్సి ఉంది. ప్రభుత్వం సభా ముఖంగా ఇచ్చిన హామీని మూడు మాసాల్లోగా అమలు జేయాల్సి ఉంటుందని  హామీల కమిటీ సిఫార్సు చేసింది.

అమలు కాని  హామీలు

మేఘాలయలోని తూర్పు జైంటియా కొండల్లో 2018 డిసెంబర్‌లో చిక్కుకున్న గని కార్మికుల మృతదేహాలను బయటకు తీశారా అన్న ప్రశ్నకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం తెప్పించుకుంటున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకూ ఆ సమాచారాన్ని సభకు తెలియజేయలేదు. 2016లో  కస్టడీ మరణాలపైనా, పోలీసు స్టేషన్లలలో అండర్‌ ‌ట్రయిల్‌ ‌ఖైదీల చిత్ర హింసలపైనా జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో నమోదైన కేసుల గురించి అడిగిన సమాచారానికి ఇంతవరకూ  సమాధానం రాలేదు.  విచారణలో ఉన్న ఖైదీల విడుదలపై ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. దీనికి ప్రభుత్వం ఏవేవో కారణాలు చెప్పింది. 16వ లోక్‌ ‌సభలో ఇచ్చిన హామీల్లో  485 హామీలను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హామీల సంఘాన్ని ప్రభుత్వం కోరింది. పెద్ద నోట్ల  రద్దు ప్రభావంపై అధ్యయనం చేయించారా అన్న ప్రశ్నకు  వివరాలు అందిస్తామన్న హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.  బీజేపీ కూటమి ప్రభుత్వం గడిచిన ఐదేళ్ళలో 5,383 హామీలు ఇవ్వగా, వీటిలో 1540 హామీలు పెండింగ్‌లో ఉన్నాయి.

హామీలు అమలుకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం ఇస్తున్న కారణాలపై పార్లమెంటరీ కమిటీ  తీవ్రంగా విమర్శించింది.  జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు  చర్యలు తీసుకుంటామన్న హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. దీనిని కూడా పార్లమెంటరీ కమిటీ ఎత్తి చూపింది. 2014-16 మధ్య కాలంలో జర్నలిస్టులపై 189 దాడులు జరిగాయి. ఒక్కదానిపై కూడా విచారణ జరిపించలేదు.  సభా ముఖంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరిగాయోలేదో పర్యవేక్షించేందుకు ఒక కమిటీ  నిరంతరం పర్యవేక్షిస్తుండాలని  పిఆర్‌ఎస్‌ ‌లెజిస్లేటివ్‌  ‌రిసెర్చ్ ‌మేధావి వర్గం ఉప అధిపతి  ప్రాచీ మిశ్రా అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు జేసేందుకు ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఉంటుందని అన్నారు.  పార్లమెంటు సాక్షిగా ఇచ్చే హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, ఈ విషయంలో యూపీఏ, ఎన్‌డిఏల మధ్య తేడా లేదని అన్నారు. పార్లమెంటు అంచనాల కమిటీ, ఎస్యూరెన్స్ ‌కమిటీలు మొక్కుబడిగా పని చేస్తున్నాయనే విషయం స్పష్టం అవుతోంది. సభ్యులకు ఏదో పదవి ఇవ్వాలి కనుక వీటిని భర్తీ చేస్తున్నారే తప్ప  ప్రజలకు సంబంధించిన అంశాలను ఈ కమిటీ సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వొస్తున్నాయి.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply