అడవుల్లో ఆకులు, అలాలు తింటూ, మనిషికీ, జంతువుకీ మధ్య వ్యత్యాసం లేని రాతి యుగం నుండి, ఆదిమానవ ప్రస్థానం నుండి ఆధునిక మానవ పరివర్తనం వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.నేడు మనం అనుభవిస్తున్న సైన్స్ ఫలాల వెనుక ఎంతటి చరిత్ర ఉందో గమనించాలి. నాటి మూఢవిశ్వాసాల నుండి మతాధికారుల దుర్మార్గాల నుండి ప్రజలను కాపాడడానికి ఎంతో మంది శాస్త్ర వేత్తలు అహరహం శ్రమించారు. తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల జీవితాల్లో విజ్ఞాన కాంతులను విరబూయించారు. సైన్స్ కు మత మౌఢ్యానికి మధ్య జరిగిన సంఘర్షణలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో శిక్షలకు గురైనారు.ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా హతులైనారు. నిజం చెబితే దైవద్రోహంగా పరిగణించడం,పరిశోధనలు చేస్తే కఠిన శిక్షలు అమలు చేయడం వంటి అత్యంత దారుణమైన పరిస్థితులున్న నాటి కాలంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసి, శాస్త్రీయ ఫలితాలతో రాబోయే తరాలకోసం శ్రమించి,దారుణంగా బలై పోయిన అలనాటి శాస్త్ర వేత్తల చరిత్రను పరిశీలించి,శాస్త్రీయ కోణంలో ఆలోచించడం ద్వారా ఈ ఆధునికంలో విస్తరిస్తున్న అంధ విశ్వాసాలకు,మూఢత్వ భావాలకు,మూర్ఖ సిద్ధాంతాలకు స్వస్తి చెప్పవచ్చు.
సుంకవల్లి సత్తిరాజు.
మొ:9704903463.