Take a fresh look at your lifestyle.

సమస్యలుంటే చెప్పండి తీరుస్తాం: మంత్రి కేటీఆర్‌

If you have problems Minister KTR

  • మొక్కలను రక్షించకపోతే కౌన్సిలర్‌ ‌పదవి నుంచి తొలగింపు
  • తడి,పొడి చెత్తతో ఆదాయం
  • జనగామ పట్టణ ప్రగతిలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణను బంగారు తెలంగాణగా చేసేందుకు సీఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ‌పంచాయితి రాజ్‌ ‌శాఖ మంత్రి దయాకర్‌రావు పర్యటించారు. మంత్రి కేటీఆర్‌ ఇం‌టింటికి తిరుగుతూ వార్డులో నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలను నీళ్లు వస్తున్నాయా అని మంత్రి కేటీఆర్‌ ‌ప్రజలను అడుగగా కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని, పెన్షన్‌ ‌వస్తుందా అంటే వస్తుందని ప్రజలు సమాధానం ఇచ్చారు. ధర్మకంచలోని అంబేద్కర్‌ ‌కమ్యూనిటీహాల్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ స్వపరిపాలనతోపాటు, పాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని 33 జిల్లాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. గతంలో 10వేల మొక్కలను నాటాలని మెదక్‌ ‌జిల్లా మొత్తం తిరిగినా చెట్లు దొరకలేదని అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా హరితహారం పేరుతో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటుచేయడం జరిగిందని ప్రతి ఒక్కరు కనీసం ఐదు మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలలో పెట్టిన చెట్లలో 80శాతం సంరక్షించకపోతే కౌన్సిలర్‌ ‌పదవి తీసేస్తామని హెచ్చరించారు. చెత్తను డబ్బాలలో వేయకుండా తడి,పొడి చెత్తడబ్బాలలో వేయాలని సూచించారు. తడి,పొడి చెత్తతో అదనపు ఆదాయం సంపాదించవచ్చని తెలిపారు. పట్టణంలోని వార్డులలో పారిశుధ్ధ్యం పెరిగిపోతే జరిమానాలు విధిస్తామన్నారు. రెండు నెలల్లో పట్టణంలో వంద మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వార్డు పారిశుధ్ధ్యం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని, వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు…
ఆడబిడ్డ పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునే వరకు సీఎం కేసీఆర్‌ ‌కొండంత అండగా నిలుస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పెళ్లి తరువాత సర్కారు దావఖానలో ప్రసవించేందుకు కార్పోరేట్‌ ‌స్థాయి వైద్యసేవలు అందిస్తూ ప్రసవించిన తరువాత కేసీఆర్‌ ‌కిట్‌, ‌నగదు ప్రోత్సాహం, అంగన్‌వాడికి వెళ్లే సమయంలో బలవర్థకమైన ఆహారం, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య, ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పై చదువులకు ఫీజ్‌ ‌రియంబర్స్‌మెంట్‌, ‌వివాహ సమయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌పథకాల ద్వారా రూ.1,00,116లు కానుకగా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో సీఎం కేసీఆరేనని అంగీకరించక తప్పదన్నారు. రాష్ట్రం బాగుండాలంటే బంగారు తెలంగాణ చూడాలంటే గ్రామీణ శాఖ మంత్రి దయాకర్‌రావు 12,751 గ్రామాలు, 141 పట్టణాలు మంత్రిగా తాను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పల్లెప్రగతి స్పూర్తితో చేపట్టిన పట్టణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 1985లో తన తండ్రి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కనీసం మొక్కలను నాటుదామంటే మొక్కలు లేవని ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర రాజధాని నుండి తెప్పించి 10వేల మొక్కలను నాటితే నేడు అవి మహావృక్షాలుగా మారి సమాజానికి, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయన్నారు. అదేస్పూర్తితో నేడు సీఎం కేసీఆర్‌ ‌ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో నర్సరీలను ఏర్పాటుచేసి గ్రామాలను పచ్చనిగ్రామాలుగా తీర్చిదిద్దాలనే తపనతో ముందుకు సాగుతున్నారని, ఆయన ఆశయ సాధనకై మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే బంగారు తెలంగాణ సాధనలో మనం భాగస్వాములం అవుతామన్నారు.

లేఔట్‌లపై ఉక్కుపాదం మోపాలి…
జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల అక్రమ లే ఔట్‌లతో మున్సిపల్‌ ఆదాయానికి గండిపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వాటిని గుర్తించి అక్రమ లే ఔట్‌లు చేసేవారిపై ఉక్కు పాదం మోపాలన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పురపాలక సంఘానికి ఏడాదికి అన్ని కలుపుకొని సుమారు రూ.13కోట్లు ఆదాయం వస్తుందని, అక్రమ లే ఔట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై అధికారులు సీరియస్‌గా వ్యవహరించాలన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలి…
ప్రతినిత్యం జిల్లా కేంద్రంలో తక్కువలో తక్కువ లక్ష మంది జనాభా వస్తూపోతూ ఉంటారని వారికి మలవిసర్జన చేసేందుకు కేవలం 8 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని అందువలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల అవసరాల నిమిత్తం కనీసం వంద మరుగుదొడ్లు నిర్మించేందుకు మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. మూడు నెలల తరువాత తిరిగి పట్టణాన్ని సందర్శించేందుకు వస్తానన్నారు.

తుప్పు పట్టిన విద్యుత్‌ ‌స్తంబాలను తొలగించాలి…
పట్టణంలో తుప్పు పట్టిన ఇనుప విద్యుత్‌ ‌స్తంబాలను, ప్రమాద అంచులో ఉన్న విద్యుత్‌ ‌స్తంబాలను గుర్తించి తొలగించాలని మంత్రి కేటీఆర్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ‌వైర్లు ఇండ్లపై నుండి వెళ్లడం వల్ల పేదలు అనేక ఇబ్బందులకు గురవుతారని వారి ఇబ్బందులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వెల్‌ ‌తరహాలో మోడల్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంటి అనుమతులు సులభతరం…
మున్సిపల్‌ ‌నూతన చట్టం ప్రకారం ఇంటి అనుమతులు పొందడం అతి సులభమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంబంధిత అధికారులకు ఎలాంటి లంచాలు పెట్టనవసరం లేదని ఎవరైనా అటువంటి లంచగొండి అధికారులు ఉంటే జిల్లా కలెక్టర్‌ ‌దృష్టికి తీసుకెళ్తే తాటతీస్తారని హెచ్చరించారు. వచ్చే ఏప్రిల్‌ ‌మాసం నుండి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని అనడంతో సభలో ఉన్న ప్రజలు హర్షాతిరేఖం వ్యక్తం చేశారు. పట్టణ పరిశుభ్రతలో గానీ, హరితహారంలో గానీ నిర్లక్ష్యం వహిస్తే కౌన్సిలర్లను పదవి నుండి తొలగించడం, పనిచేయని అధికారులను ఉద్యోగం నుండి తీసేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిల, అదనపు కలెక్టర్‌ ఓజే మధు, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌నోముల రవీందర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌పోకల జమున లింగయ్య, డీఈ రవీంద్రనాథ్‌, ‌కౌన్సిలర్లు మల్లిగారి చంద్రకళ, బొట్ల శ్రీనివాస్‌, ‌వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply