- పొర్లు దండాలు పెట్టినా సీఎం జైలుకు వెళ్లడం ఖాయం
- టీఆర్ఎస్, మజ్లిస్ విముక్త హైదరాబాద్ లక్ష్యంగా పోరాడతాం
- జీహెచ్ఎంసి ఎన్నికలు జరిపి మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదు ? …బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి మేయర్ పీఠం దక్కనప్పటికీ నగర అభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేయడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ఆ తరువాత అమ్మవారి సమక్షంలో పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లతో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామనీ, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామనీ ప్రమాణం చేయించారు. అనంతరం బండి సంజయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలకు పొర్లు దండాలు పెట్టినా రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ నాశనమైందనీ, పేద ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు కల్పించారని విమర్శించారు. బీజేపీ కార్పొరేటర్లతో కలసి త్వరలోనే వరద బాధితులకు సాయం కోసం పోరాటం చేస్తామని చెప్పారు.
బీజేపీ కార్పొరేటర్లను లాగేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ మా ఒక్క కార్పొరేటర్‌ను కెలికితే మేం వంద మంది ఎమ్మెల్యేలను కెలుకుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనీ, జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలను చూసయినా టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. భాగ్యనరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారనీ, భాగ్యలక్ష్మి అమ్మవారి దయతో జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి వల్లనే హైదరాబాద్‌కు భాగ్యనగరమనే పేరు వచ్చిందని చెప్పారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదో, అక్కడికి మెట్రో రైల్, పరిశ్రమలు ఎందుకు రావడం లేదో పాతబస్తీ ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు.
పాతబస్తీ బీజేపీ అడ్డా అనీ, అక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జీహెచ్ఎంసి అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదనీ, తొందరగా జీహెచ్ఎంసి ఎన్నికలను నిర్వహించిన సీఎం మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఒకవర్గం ప్రజల మెప్పు కోసం మెజార్టీ ప్రజలను అధికార పార్టీ అవమానిస్తున్నదని ఆరోపించారు.