ధైర్యం ఉంటే తనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను తప్పు చేశానని విమర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి తాను చేసిన తప్పేంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి తలతిక్క మాటలు మానుకోవాలని హెచ్చరించారు. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న డీఎస్ సోమవారం ఇక్కడ నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్ కేసీఆర్తో అమీతుమీ అన్నట్లుగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై, మంత్రి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కూతురు అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత తనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేయాలని కోరుతూ ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సంతకాలతో పార్టీ అధినేత కేసీఆర్కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని డీఎస్ ప్రస్తావిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలు తమకు ఇష్టం లేకపోయినా తన సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత కేవలం ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఒక్క కుటుంబం బాగు పడినంత మాత్రాన బంగారు తెలంగాణ వచ్చినట్లేనా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో దిగ్విజయ్ సింగ్ తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తప్పుడు నివేదిక ఇచ్చారన్న కారణంగా తాను ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Tags: Suspend me, DS challenge to KCR, sonia gandhi, digvijay singh