- అసైన్డ్ భూములను ప్రభుత్వానికి వాపస్ ఇవ్వు
- నువ్వు సగం బిసివే..నేను పూర్తి బిసిని
- గ్రానైట్ ద్వారా పన్నులు ఎగ్గొడితే నిరూపించు
- వెంట్రుక కూడా పీకలేవంటూ తీవ్ర వ్యాఖ్యలు
- ఈటెల తాటాకు చప్పుళ్లకు బెదరబోమన్న గంగుల
ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.
కరీంనగర్‌ను బొందలగడ్డగా మార్చినట్లు తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారు. సిగ్గుంటే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల డియాతో మాట్లాడుతూ…హుజురాబాద్ ప్రజలు ఈటల వెంట ఉంటే..ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదు అని ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి. మరి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత గ్రానైట్ పరిశ్రమలను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కైయ్యారా? అని ప్రశ్నించారు. తమిళనాడు వాసులు గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. కరీంనగర్లో 350 గ్రానైట్ క్వారీలు ఉంటే.. గంగుల కమలాకర్‌కు ఒక్కటే గ్రానైట్ క్వారీ ఉన్నది.
ఆ క్వారీ తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఉందన్న విషయం తెలుసుకోవాలని ఈటలకు గంగుల సూచించారు. పన్నులు ఎగ్గొట్టానని తనపై ఈటల విమర్శలు చేస్తున్నారు. తాను ఎక్కడైనా పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు అధికంగా చెల్లిస్తానని తేల్చిచెప్పారు. ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరని, తాను కూడా బీసీ బిడ్డనే.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. ఈటల కంటే తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామన్నారు. కార్యకర్తలను ఈటల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు.ఈటలకు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. ఆయన బెదిరిస్తే భయపడేవాడు ఎవడూ లేడన్నారు.
టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ఇన్నిరోజులు గౌరవించామని.. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు. నీలాగ అసైన్డ్ భూములను ఆక్రమించుకోలేదు. అసైన్డ్ అని తేలాక కూడా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావు. 2004లో దివంగత నేత ఎమ్మెస్సార్ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తే… ఆయన కుదరదని తేల్చి చెప్పారు. 2018లో నా ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల. గెలిచినప్పటి నుంచి అసహనంతో ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. టీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఈటల. సజీవ సాక్ష్యాలివి. దాస్తే దాగేవి కావు. ఇవాళ ఆయన అన్నదానికంటే ఎక్కువగా అనగలను. తట్టుకోలేవు.భయంకరంగా ఉంటుంది. పార్టీని కాపాడుకుంటాం.
వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. సివిల్ సప్లై స్కీమ్ పెండింగ్‌లో ఉంది. నా పరిధిలోకి రాదని సీఎం దృష్టికి తీసుకు వెళ్లలేదు. నీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టం. సాగర్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పెట్టి కొన్నామా… తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతావని అంటావా… మాకు పదవులు ముఖ్యం కాదు. కేసీఆర్ అధికారంలో ఉంటే చాలనుకుంటున్నాం. టీఆర్ఎస్కు ఓటేస్తే అమ్ముడు పోయినట్టా… నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఆచితూచి మాట్లాడుతున్నాము. ఏం చేస్తావు.. వాట్సాప్, యూట్యూబ్ లలో తిట్టిస్తావు అంతే కదా. ఇదిగో వెంట్రుక కూడా పీకలేవు‘ అంటూ తలపై చేయి వేసి అన్నారు. ‘నేను ఫుల్ బీసీని… ఎక్కడైనా బీసీనే. నువ్వు హాఫ్ హాఫ్ బీసీవీ.. హుజూరాబాద్ బీసీవీ… హైదరాబాద్ ఓసీవీ‘ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.