Take a fresh look at your lifestyle.

దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి..

  • ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ‌డ్రామా
  • కాంగ్రెస్‌ ‌నామరూపాల్లేకుండా పోతుంది
  • అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించే కుట్ర
  • ధరణి పేరుతో నలుగురు కలెక్టర్ల భారీ దోపిడీ
  • 11 వేల స్ట్రీట్‌ ‌కార్నర్ల మీటింగ్‌లతో చరిత్ర సృష్టిస్తాం
  • రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌
ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ‘‘ప్రజల్లో హిందుత్వ వాతావరణం వొచ్చింది. 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా వోటు బ్యాంకుగా మారబోతున్నరు. అందుకే ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లుగా అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌  ‌కుట్ర చేస్తుంది. ఈ వేదికగా ఎంఐఎంకు సవాల్‌ ‌చేస్తున్నా…. మీకు దమ్ముంటే, ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నామని భావిస్తే… రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయండి. మీకు డిపాజిట్లు రాకుండా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సవాల్‌ ‌విసిరారు. మంగళ వారం ప్రజా గోస-బీజేపీ భరోసాలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ వేద కన్వెన్షన్‌లో నిర్వహించిన 11 వేల శక్తి కేంద్రాల సభల్లో పాల్గొనే స్పీకర్ల వర్క్ ‌షాప్‌ ‌కార్యక్రమంలో బండి సంజయ్‌ ‌ముగింపు ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో  కాంగ్రెస్‌ ‌నామరూపాల్లేకుండా పోతుందని, ఆ పార్టీకి వోటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటవుతున్నాయని, అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, రామరాజ్యాన్ని స్థాపించడం తథ్యమన్నారు. రాష్ట్రంలో నలుగురు జిల్లా కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్‌ ‌కుటుంబానికి దోచి పెడుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రమోషన్లు పొందుతున్నారని మండిపడ్డారు. ఆ ఆధారాలను సేకరిస్తున్నామని, త్వరలోనే వారి బండారాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వొస్తే నిలువ నీడలేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఫసల్‌ ‌బీమా యోజన కింద నష్ట పరిహారం అందజేస్తామని, అర్హులందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు. 11 వేల స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగుల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపినిచ్చారు.
రాష్ట్రంలో బీజేపీ ఈనెల 10 నుండి 25 వరకు దేశంలో చరిత్ర సృష్టించే విధంగా శక్తి కేంద్రాల పరిధిలో 11 వేల కార్నర్‌ ‌మీటింగ్స్ ‌నిర్వహించబోతుంది..బీజేపీకి తెలంగాణలో ఎందుకు అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. ఈ శిక్షణలో పాల్గొన్న వక్తలంతా స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగులలో చెప్పాలి..అని దిశా నిర్దేశం చేసారు. శ్యామా ప్రసాద్‌ 370 ఆర్టికల్‌ ‌రద్దు కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ మహనీయుడి స్పూర్తితో బీజేపీ పనిచేస్తోంది. ఈ దేశం గురించి, పరిస్థితుల గురించి, ప్రజల బాగోగుల గురించి చర్చించాలనే ఆలోచన ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఎంత సేపు అధికారంలోకి ఎలా రావాలి? ఎట్లా సంపాదించాలి? అడ్డదారిలో అధికారం ఎలా సంపాదించాలనే యావ మాత్రమే ఆ పార్టీలకు ఉంది..అని బండి సంజయ్‌ ‌పేర్కొంటూ…సిద్ధాంతం కోసం పనిచేస్తున్న బీజేపీ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వొచ్చి నరేంద్రమోదీ పాలనను కొనసాగించాలనే కృత నిశ్చయంతో ముందుకు వెళుతున్నాం. .స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగులేంటి… వంద, 200 మందితో మీటింగులెందుకు? అనుకోవద్దు… వాజ్‌ ‌పేయి, అద్వానీ వంటి వారు 10, 20 మందితో సభలు పెట్టారు. వాళ్లే కుర్చీలు, టేబుల్‌ ‌వేసుకుని మైకులు తెచ్చుకునేవారు.
పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు..వారి స్పూర్తితో 11 వేల స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లు నిర్వహిస్తున్నాం. టీఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలను నిలదీయడం, బీజేపీ పోరాడుతున్న తీరును వివరించాలి. అదే సమయంలో కేంద్ర విజయాలను వివరించాలి. .అని బండి సంజయ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో ఏడాదిలో 15 బహిరంగ సభలు నిర్వహించి చరిత్ర సృష్టించిన పార్టీ బీజేపీ మాత్రమే. అమిత్‌ ‌షా 3 సార్లు, 3 సార్లు మోదీ, 4 సార్లు నడ్డా వొచ్చారంటే..తెలంగాణపై ఎంత అభిమానం ఉందో, కార్యకర్తలంటే ఎంతటి అభిమానమో గుర్తుంచుకోవాలి..అని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు నాయకులుగా తీర్చిదిద్దడానికి వెనుకాడుతాయి. వాళ్లే లీడర్లుగా కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. బీజేపీ అందుకు భిన్నంగా కొత్త లీడర్లను తయారు చేయడమే లక్ష్యంగా స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లు పెడుతున్నాం..అని బండి సంజయ్‌ అన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మాజీ మంత్రులు బాబూమోహన్‌, ‌విజయరామారావు, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్‌, ‌రవీంద్రనాయక్‌, ‌మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ ‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌ ‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ ‌కుమార్‌, ‌రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి ఈ సమావేశం పాల్గొన్నారు.

Leave a Reply