Take a fresh look at your lifestyle.

వారు ప్రశ్నించేవారైతే.. మేము పరిష్కరించే వాళ్లం

  • వారు ప్రశ్నించేవారైతే..మేము పరిష్కరించే వాళ్లం
  • కాంగ్రెస్‌, ‌బిజెపిలకు వోటేస్తే లాభం లేదని వివరించాలి
  • గ్రాడ్యుటయేట్లను నేరుగా కలసి వోటు అడగాలి
  • పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు దిశానిర్డేశం

బీజేపీ, కాంగ్రెస్‌, ‌వామపక్షాలకు వోటేస్తే ఏం లాభమని, వారేమైనా అధికారంలో ఉన్నారా అని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పేరు నిషేధమని, ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ పేరును ఉచ్ఛరించేదని విమర్శించారు. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ‌నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభమైందని చెప్పారు. 70 నుంచి 80 శాతం వోటింగ్‌ ‌జరిగేలా చూడాలని, వోటింగ్‌ ‌శాతం పెరిగితే టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు.

బీజేపీకి, కాంగ్రెస్‌ ‌పార్టీలకు లేని నెట్‌వర్క్ ‌తమకు ఉందని, కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాణీదేవి పేరు మార్మోగాలన్నారు. ప్రతి ఒక్కరికి టిఆర్‌ఎస్‌ ‌సందేశం వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, ‌టీడీపీలు 70 ఏండ్లు అధికారంలో ఉన్నాయని, కనీసం తాగడానికి నీరు ఇచ్చాయా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు నీటి తీరువా, శిస్తులు వసూలు చేస్తే.. టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌వొచ్చాక వాటిని రద్దు చేయడమేకాకుండా, ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని 16 వేల మెగావాట్లకు పెంచామని చెప్పారు. తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడైనా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారేమో చూపించాలని డిమాండ్‌ ‌చేశారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మిషన్‌ ‌భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. దేశంలో ఇన్నేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ఏ రాష్ట్రంలో అయినా ఇంటింటికీ తాగు నీరు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మన రైతు బంధును కాపీ కొట్టి రూ.6 వేలు ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పేదింటి యువతి పెండ్లికి రూ.లక్ష ఇస్తున్నామని, దీనినే గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పేరుతో బీజేపీ ప్రభుత్వం తీసుకువొస్తున్నదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి చేతకాదని విమర్శించారు. విభజన చట్టంలో రేల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతానికి రూ.400 కోట్లు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామి చేశారని, దమ్ముంటే బీజేపీ నేతలు వీటిని తీసుకొచ్చి మాట్లాడాలని సవాల్‌ ‌విసిరారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చేనాటికి దేశ వృద్ధిరేటు 8 శాతంగా ఉందని, ప్రస్తుతం అది మైనస్‌ 8 ‌శాతానికి పడిపోయిందని విమర్శించారు. అదే తెలంగాణ 14 శాతం వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కిషన్‌ ‌రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంకు కృష్ణా నీటిని తీసుకొస్తామని హామి ఇచ్చారు. వారు ప్రశ్నించే గొంతులమని అంటున్నారు. మేం సమస్యలను పరిష్కరించేవారిమని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని పీవీ కుమార్తెగా కాకుండా విద్యావేత్తగా, సేవాభావం కలిగిన వ్యక్తిగా చూడాలని, ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటింగ్‌ ‌శాతం పెరిగితే తమదే విజయమన్నారు మంత్రి హరీశ్‌ ‌రావు. బీజేపీకి, కాంగ్రెస్‌ ‌పార్టీలకు లేని నెట్‌ ‌వర్క్ ‌తమకుందన్నారు. వోటరును నేరుగా కలిసి టీఆర్‌ఎస్‌కు ఎందుకు వోటు వేయాలో వివరించాలన్నారు. సురభి వాణిదేవి పీవీ కుమార్తె కాకుండా విద్యావేత్తని..సేవా భావం కలిగిన వ్యక్తన్నారు. ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply