ప్రాణాలకంటే ముఖ్యమేది కాదు
- లాక్డౌన్ పొడిగిస్తే సహకరిద్దాం
- ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది
- ప్రభుత్వ సూచనలు పాటించాలి
- ఇటలీ, అమెరికా పరిస్థితి మనకొద్దంటే..
స్వీయ నియంత్రణ పాటించాల్సిందే ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు మనిషికి ప్రాణాలకంటే.. ముఖ్యమేది కాదు. సామాజిక దూరంతోనే కొరోనాను అడ్డుకోవడం సాధ్యం. లాక్డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ సూచనలు పాటించాలి. పరిస్థితులు అనుకూలిస్తే సరే. లేదంటే లాక్ డౌన్ పొడగిస్తే సహకరిద్దామని సిద్ధిపేట ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో పట్టణంలోని లైట్ మోటారు వెహికిల్, మెకానిక్, మ్యాజిక్ ఆటో అసోసియేషన్లకు చెందిన 325 సంఘ సభ్యులకు బియ్యం, 8 రకాల నిత్యావసర సరుకుల వస్తువులు కలిగిన కిట్స్‌ను మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం మీ అందరి క్రమశిక్షణ, దేవుడి దయ వల్ల సిద్దిపేటలో ఒక కొరోనా కేసు నమోదు కాలేదన్నారు. ఇటలీ, అమెరికా లాంటి దేశాలు కరోనా మహమ్మారికి వణికి పోతున్నాయనీ, అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు, సలహాలను పాటించని ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి లాక్ డౌన్ వల్ల ఆదాయం నష్టం జరుగుతుందని తెలిసినా…సిఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యం ముఖ్యమని తలిచారని, అందుకే లాక్ డౌన్ అమలుకు ప్రాధాన్యత ఉందన్నారు. ఈ సమయంలో పేదలు, వలస కార్మికులు, రోజూ రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి కార్మికులైనా మీ గురించి తన ఉడుతా భక్తిగా ఆలోచన చేసి ఈ సాయాన్ని చేస్తున్నట్లు చెప్పారు.
ఇంకా మీకు ఏ అవసరమొచ్చినా తన దృష్టికి తేవాలని, మీకు కావాల్సిన సాయాన్ని శాయశక్తులా చేస్తానని, మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ నుంచి తాను కోరేదొక్కటేననీ కొరోనాను ఎదుర్కోవాలంటే.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని బాధ్యతగా పాటించాలని అలా సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. ఎవరి ఇంట్లో వారే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని చెప్పారు. అంతకు ముందు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మీకు ఏ ఆపదోచ్చినా ఆదుకునేందుకు ముందుండే వ్యక్తి హరీష్‌రావు గారని, ఈ విపత్కర పరిస్థితుల్లో మీ కోసం ఆలోచన చేసి ఉడుతా భక్తిగా సాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. కరోనా వ్యాధి ప్రభావంతో ప్రపంచమే వణుకుతున్నదని, సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమని, లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.