Take a fresh look at your lifestyle.

తేమ, తాలు పేరుతో తరుగు తీస్తే తాటా తీస్తాం

  • పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ‌మారెడ్డి హెచ్చరిక ధాన్యాగారంగా తెలంగాణ
  • యాసంగిలో ఐదేళ్లలో 700శాతం పెరిగిన ధాన్యం కొనుగోళ్లు
  • హమాలీ, గన్నీ సంచుల కొరతను అధిగమిస్తున్నాం

తేమ, తాలు పేరుతో వ్యాపారులెవరైనా తరుగును తీస్తే తాటా తీస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ‌మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ..రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. తొందరపడొద్దన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతుబంధు కో అర్డినేటర్లు, వ్యవసాయ శాఖాధికారులు పంత తేమ శాం సరిగ్గా ఉన్నదీ లేనిది నిర్ధారించి టోకెన్లు అందజేస్తారన్నారు. ఆ తరువాతే రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఈ విషయంలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇదే సమయంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారంగా కోత విధిస్తే కఠిన చర్యలుంటాయనీ రైస్‌ ‌మిల్లర్లను హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. దీనిపై ప్రధానంగా దృష్టి సారించామనీ, కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కమిషనర్‌ ‌పరపతి సత్యనారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేశామన్నారు.

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుండటం, ఇ దే సమయంలో లాక్‌డౌన్‌ ‌వల్ల గన్నీ సంచులు, హమాలీల కొరత ఏర్పడిందన్నారు. దీని వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు చేపడుతామన్నారు. ఈ ఏడాది రబీలో 90లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 22కోట్ల గన్నీ సంచులు అవసరం ఉంటాయన్నారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ‌నుంచి అనుకున్న సమయానికి కొత్త గన్నీ సంచులు రాకపోవడం, అలాగే పాత గన్నీ సంచుల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుండటం గన్నీ సంచుల కొరత ఏర్పడిందన్నారు. దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ‌సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. బీహార్‌ ‌నుంచి హమాలీలు వచ్చి ఇక్కడ పని చేస్తారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొరోనా లాక్‌డౌన్‌ ‌వల్ల హమాలీలందరూ బీహారీలో ఉన్నారన్నారు. ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారనీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ‌బీహార్‌ ‌ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

కొత్త రాష్ట్రమైనా సిఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ ధాన్యాగారంగా మారబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15రబీలో 1690 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 54వేల మంది రైతుల నుంచి 13.24 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కోనుగోలు చేయడం జరిగిందన్నారు.గత ఏడాదిలో 3509కొనుగోలు కేంద్రాల ద్వారా 6లక్షల 78వేల మంది రైతుల నుంచి 37లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ రబీలక్ష 90లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం వస్తుందన్న అంచనాతో 6500కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, కేవలం ఐదేళ్లలోనే ఈ యాసంగిలోనే 700శాతం పైగా ధాన్య కొనుగోళ్లు పెరగబోతున్నాయనీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది యాసంగిలో ఇదే సమయానికి 4లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5000కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 11లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన 2014-15లో ఖరీఫ్‌, ‌రబీలో కలిపి 35లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగైందనీ, సిఎం కేసీఆర్‌ ‌రైతు సంక్షేమ చర్యలతో పంటలు బాగా పండాయన్నారు. ప్రాజెక్టులు, చెరువులు నిండి నీరు పుష్కరలంగా అందడంతో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ రబీలోనే 40లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందనీ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ‌మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!