Take a fresh look at your lifestyle.

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

  • సీఎం, డీజీపీ నీతిమంతులైతే…న్యాయ విచారణ జరపాలి
  • నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు
  • మాజీ మంత్రి, బిజేపీ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌
  • ‌తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌రావు

మెదక్‌, ఏ‌ప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట తరహా దౌర్జన్య ఘటనలు పునరావృతం చేస్తే చీల్చి చెండాడుతామని మాజీ మంత్రి, బిజేపీ ఎంఎల్‌ఏ ఈటల రాజెందర్‌ ‌హెచ్చరించారు. సీఎం, డీజీపీ నీతిమంతులైతే…నిజాయితీగా పాలన కొనసాగించగలిగితే రామాయంపేట ఘటనపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. తల్లీ కొడుకుల ఆత్మబలిదానాలపై కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా అఖిలపక్షం మంగళవారం రామాయంపేట బంద్‌కు పిలుపునిచ్చింంది. బంద్‌ ‌సందర్భంగా ఈటల రాజెందర్‌, ‌మాజీ ఎంపీ వివేక్‌, ‌దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బిజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌లతో కలిసి ఆయన నిరసనలో పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..పోలీసు బలంతో ప్రభుత్వం విర్రవీగుతుందన్నారు. అవినీతి, అరాచకాలు రాష్ట్రంలో పెట్రగి పోతున్నాయన్నారు.

హుజూరాబాద్‌ ‌తరహాలో రాష్ట్రమంతటా ప్రజలు కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రామాయంపేట ఘటనపై సమగ్ర విచారణ జరపకపోతే ఉన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించి పోలీసులను సైతం దోషులుగా నిలబెట్టాల్సి వొస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే….పోలీసు శాఖపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు. చనిపోయిన తల్లికొడుకులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీ 24 గంటల్లో నిందితులను అరెస్ట్ ‌చేస్తామని హామినిచ్చి…3 రోజులు గడుస్తున్నా…పట్టుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి తీరు మార్చుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఈటల డిమాండ్‌ ‌చేశారు. ఆందోళనలో ఇంకా బిజేపీ నేత రవిందర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌రావు
తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ కుట్రలో టీఆర్‌ఎస్‌ ‌పెద్దలున్నారు కాబట్టే అరెస్ట్ ‌చేయడం లేదన్నారు. నిందితులు వీడియోలు, ఆడియోలు విడుదల చేస్తున్నా..పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తామని రఘునందన్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply