Take a fresh look at your lifestyle.

మట్టి మర్యాదను మంటగలుపవద్దు..!

‘‘‌విచ్ఛలవిడి పెస్టిసైడ్స్, ‌రసాయనాలు, ఎరువులు వాడడంతో వ్యవసాయ భూములు ఎడారులుగా మారతాయని వివరిస్తున్నారు. మట్టి ఆరోగ్యం క్షిణిస్తే రాబోయే రోజుల్లో 8 బిలియన్ల ప్రపంచ ప్రజలకు పోషకాహారం అందడం అసాధ్యమని తెలుస్తున్నది. నేలలో కార్బన పదార్థాల పరిమాణం 12 – 15 శాతానికి పెంచగలిగితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే మంచి వ్యవసాయ దిగుబడులు పొందవచ్చని తెలుసుకోవాలి.’’

ప్రపంచ మానవాళికి 95 శాతం ఆహారాన్ని మట్టి అందిస్తున్నది. విశ్వ జనులు ఐక్యతతో చేయి చేయి కలిపితే మట్టి ఆరోగ్యం పరిరక్షించబడుతుందని, అద్భుత మహిమగల ధరిత్రి మట్టి మర్యాదను మంటగలిపితే మానవ మనుగడతో పాటు సకల ప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతుందని ‘ఇషా ఫౌండేషన్‌’ ‌వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆవేదన వ్యక్తం చేయడం సముచితంగా, ఆలోచనాత్మకంగా, ఆహ్వానించ దగినదిగా ఉంది. జగ్గా వాసుదేవ్‌ ‌స్థాపించిన ‘ఇషా ఫౌండేషన్‌’ ‌నేతృత్వంలో మట్టి సహజత్వాన్ని కోల్పోతున్న వేళ ‘సేవ్‌ ‌సాయిల్‌ ‌మూవ్‌మెంట్‌ (‌మట్టి ఆరోగ్య పరిరక్షణ ఉద్యమం)’ మార్చి 2022లో ప్రారంభించి తానే స్వయంగా నాయకత్వం వహిస్తూన్న 64-ఏళ్ళ సద్గురువు 100-రోజుల మోటార్లు బైక్స్ ‌యాత్ర 27 దేశాలగుండా సాగుతూ జూన్‌ ‌నెలాఖరున ముగియనుంది. నిర్జీవ పదార్థమైన మట్టి మాత్రమే మరో ప్రాణికి జీవం పోయగల మహత్తర శక్తిని కలిగి ఉందని ప్రచారం చేస్తూ, మన్ను మర్యాదను కాపాడేందుకు అందరూ ఉద్యమించాలని అవగాహన కల్పించాల్సిన అగత్యం ఏర్పడింది. మట్టి సహజత్వాన్ని కాపాడుకుంటేనే మానవాళి ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుసుకోవాలి. జీవుల ఉనికితో మట్టికి విడదీయరాని సంబంధం ఉందని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 52 శాతం సారవంతమైన భూములు నిస్సారం అయ్యాయని, ఇలాగే మన్ను మర్యాదను మంటగలిపితే జీవకోటి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని గమనించాలి.

విచ్ఛలవిడి పెస్టిసైడ్స్, ‌రసాయనాలు, ఎరువులు వాడడంతో వ్యవసాయ భూములు ఎడారులుగా మారతాయని వివరిస్తున్నారు. మట్టి ఆరోగ్యం క్షిణిస్తే రాబోయే రోజుల్లో 8 బిలియన్ల ప్రపంచ ప్రజలకు పోషకాహారం అందడం అసాధ్యమని తెలుస్తున్నది. నేలలో కార్బన పదార్థాల పరిమాణం 12 – 15 శాతానికి పెంచగలిగితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే మంచి వ్యవసాయ దిగుబడులు పొందవచ్చని తెలుసుకోవాలి. నేల మన్ను సారం అంతరించే ప్రమాదపు అంచున మానవాళి ఉందని గమనించాలి. మట్టిలో కర్బన పదార్థాల శాతం కనీసం 3-6 వరకు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కార్బన్‌ ‌శాతం పెంచేలా ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించాలి. ఆధునిక వ్యవసాయ పద్దతులు, అడవుల నరికివేత, జీవం పోయగల నేల 6-ఇంచుల పై పొర కొట్టుకు పోవడం లాంటి భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ ప్రతికూల మార్పులు, కార్బన్‌ ఉద్గారాలు, గాలి కాలుష్యం, నీటి ఎద్దడి లాంటి సమస్యకు ఇస్తున్న ప్రాధాన్యతతో పోల్చితే మట్టి పరిరక్షణకు ఇవ్వకపోవడం విచారకరం. పంట మార్పిడి, పంట సహజీవన (క్రాఫ్‌ ‌సింబయాసిస్‌) అలవాట్లు మాయం కావడం, విచక్షణారహిత సాగు పద్దతులతో నేల మన్ను నాణ్యత తగ్గుతోంది. మట్టి సత్తువను పీల్చితే ఆకలి కేకలు, కరువుకాటకాలు రాజ్యమేలుతాయి. మ్యాంగ్రూ ఫారెస్టస్ (‌మడ అడవులు) తగ్గితే సముద్ర చేపలు, మ్నెక్కలు అంతరించడం తప్పదని తెలుసు కోవాలి.

భారతదేశ మట్టిలో కర్బన పదార్థ పరిమాణం (సాయిల్‌ ఆర్గానిక్‌ ‌కార్బన్‌, ‌యస్‌ఓసి) ప్రమాదకర స్థాయికి పడిపోయిందని శాస్త్రజ్ఞులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70 ఏళ్లలో భారత దేశ మట్టిలో కర్బన పదార్థ పరిమాణం 1 శాతం నుంచి 0.3 శాతానికి పడిపోవడంతో నేల నీటి నిల్వ సామర్థ్యం, మట్టి నిర్మాణం, సారం ప్రభావితం కావడం జరుగుతోంది. మట్టిలో కర్బన పరిమాణం క్షీణిస్తే పంట దిగుబడి తగ్గడం, మట్టి ఆరోగ్యానికి కారణమైన సూక్ష్మజీవులు చనిపోవడంతో నేలలు ఎడారులను తలపిస్తాయి. యస్‌ఓసి పరిమాణాన్ని పెంచే కంపోస్ట్, ‌పచ్చి రొట్ట, బయోఫెర్టిలైజర్స్ ‌లాంటి సహజ ఎరువులను వాడకుండా విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్ ‌వాడడంతో మన్ను సత్తువ తగ్గుతోంది. కార్బన పరిమాణం మట్టిలో పెరిగితే పంటలకు నీటి అవసరం 30-40 శాతం తగ్గుతుందనే శుభ వాస్తవాన్ని మరువరాదు. ‘చేతన గ్రహం – మట్టి పరిరక్షణ ఉద్యమం’లో మనందరం పాల్గొని మన భరతమాత పాదాల కింది వ్యవసాయ మట్టిలో కనీస కర్బన పరిమాణం 3-4 శాతానికి పెంచడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాలి.

మట్టి విధ్వంసం ఇలాగే కొనసాగితే వాతావరణ మార్పులు, కరువుకాటకాలు, జీవవైవిధ్య విధ్వంసం, సాగు దిగుబడులు పడిపోవడం లాంటి తీవ్ర పరిణామాల్ని మానవాళి ఎదుర్కోవలసి ఉంటుంది. పారిశ్రామిక విప్లవం సాగు పద్దతులు, మాంసం వాడకం పెరగడం, పశుగ్రాస అతి వాడకం పెరగడం లాంటి కారణాలు కూడా మట్టి నాణ్యత పడిపోవడానికి కారణం అవుతున్నాయి. మట్టి మర్యాదను మంటగలిపితే ప్రజారోగ్యం, విపత్తులు, కరువులు, ఆహార కొరత, ఆకలి చావులు లాంటి దుష్ప్రభావాలు కలుగుతాయని తెలుసు కోవాలి. ఇలాంటి అతి గంభీరమైన సమస్యను గుర్తించి సద్గురువు జగ్గీ వాసుదేవ్‌ ‌బృందం చేపట్టిన మట్టి ఆరోగ్య పరిరక్షణ ఉద్యమానికి మానవాళి చేయూతను ఇవ్వాలి. భవిష్యత్తు తరాలతో పాటు సకల జీవజాతుల ఆరోగ్యం కాపాడటానికి మానవ హారం పడదాం, మట్టి మర్యాదను కాపాడుకుందాం.

Leave a Reply