Take a fresh look at your lifestyle.

కెటీఆర్‌ ‌సిఎం అయితే… టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటుగా హరీష్‌రావు..?

  • మరో రెండు కీలకమైన శాఖలు కేటాయింపు…
  • హరీష్‌రావుతో ముందే చర్చించిన కేసీఆర్‌? .. అం‌దుకే మౌనంగా హరీష్‌రావు?

(ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌): ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. నలుగురు గుమికూడితే చాలూ అందరూ మాట్లాడుకునేది ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావును చేస్తే…రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌ ‌తన్నీరు హరీష్‌రావు స్థానం ఏమిటి? సిఎంగా కేటిఆర్‌ను కేసీఆర్‌ ‌చేస్తే…మంత్రి హరీష్‌రావు పరిస్థితి ఏమిటి? రాజకీయంగా పార్టీలో, ప్రభుత్వంలో ఆయన హోదా ఏమిటి అని. ఎక్కడ చూసినా, ఎవరి నోటా విన్నా ఇప్పుడు ఇదే చర్చ, ఇవే ప్రశ్నలు. దీనికి కారణం లేకపోలేదు. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ప్రస్తుత సిఎం, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెన్నంటి హరీష్‌రావు ఉండటం. ఇంకింత కాస్త లోతుగా మరో మాటలో చెప్పాలంటే హరీష్‌రావు తన యవ్వనం మొత్తాన్ని టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, ఉద్యమానికి, కేసీఆర్‌కు ధారపోయడంతోనే…పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు, ప్రక్షాళన… అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా కేటిఆర్‌ను చేస్తారంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ప్రతి ఒక్కరూ హరీష్‌రావు పరిస్థితి ఏంటనే చర్చకు కారణవుతున్నది. అటు ఇంటా, ఇటు బయటా హరీష్‌రావుకు దక్కబోయే పదవీ ఏమిటని.

ఓపికకు, నమ్మకానికి కేరాఫ్‌ అయిన మంత్రి హరీష్‌రావుకు టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ అం‌టే తనకు వల్లమాలిన ప్రేమ, అభిమానం. కేసీఆర్‌ ‌ద్వారా సిద్ధిపేటలో రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్‌రావు ఇప్పటి వరకు ఏనాడు కేసీఆర్‌ ‌గీచిన గీతను దాటలేదు. కేసీఆర్‌ ‌కనుసైగల్లోనే నడిచారు. ఏనాడూ ఆయనకు ఎదురు మాట చెప్పిన దాఖలాలు లేవు. ఎదురించింది, ధిక్కరించింది అసలే లేదు. పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు హరీష్‌ అన్నీ తానై అటు నాయకులు, ఇటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. ఒడిదుడుకులను అధిగమించేలా తనదైనశైలిలో పని చేశారు. పార్టీని మరలా పట్టాపైకి ఎక్కించారు. దీంతోనే పార్టీలో ఆయన ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో లక్షలాది మంది కార్యకర్తల మనస్సును గెలుచుకోవడమే కాదూ, వారి హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ కోసం కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన హరీష్‌రావుకు…ఒకానొక సందర్భంలో మంత్రి పదవీ ఇవ్వకుండా పక్కకు పెట్టినా…అనేక అవమానాలు ఎదురైనా తనలోనే తాను దిగమింగుకున్నారు. ఎన్ని అవమానాలు పడ్డాకూడా హరీష్‌రావు మేనమామ అయిన కేసీఆర్‌కు దూరం కాలేదు.

ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానంతో వాటన్నింటిని ఎదుర్కొని నిలబడ్డాడు. మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. ఇక ఇప్పటి రాజకీయాల్లోకి వస్తే..కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయితే హరీష్‌ ‌రావు పరిస్థితి ఏంటనే చర్చ తెలంగాణ భవన్‌లోనూ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుగుదల, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ ‌కంటే ముందు నుంచి కేసీఆర్‌కు అండగా ఉన్న హరీష్‌ ‌రావుకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ది, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) ‌త్వరలో ముఖ్యమంత్రి అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం విధితమే. ఎమ్మెల్యేలు మొదలుకుని మంత్రుల వరకు, ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ ‌మరో అడుగు ముందుకేసి కేటిఆర్‌ ‌ముందరనే ‘కాబోయే సిఎం కంగ్రాట్స్’ అని కూడా చెప్పారు. కేటీఆర్‌ ‌పట్టాభిషేకానికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు చేశారని చెబుతున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 18న రథసప్తమి నాడు కేటీఆర్‌కు అధికారికంగా పట్టాభిషేకం జరగబోతోందనీ, 18న కాకుంటే 27న అయినా సిఎం కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి పగ్గాలను కుమారుడు కేటీఆర్‌కు అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది. ఈ రెండు తేదీలు సంఖ్యాపరంగా కేటీఆర్‌కు కలిసి వస్తాయన్న ప్రచారమూ జోరుగా జరుగుతున్నది. అయితే, ఈ క్రమంలో మరోమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పరిస్థితి ఏంటనే చర్చ అంతటా మొదలైంది.

పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి ‘ప్రజాతంత్ర’కు అందుతున్న సమాచారం మేరకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే హరీష్‌ ‌రావుకు పార్టీకి సంబంధించిన పగ్గాలు అప్పగించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేటీఆర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయితే, ఆ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పదవీ హరీష్‌ ‌రావుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటుతో పాటు కీలకమైన రెవెన్యూ, పురపాలక వంటి మంత్రిత్వ శాఖలను కూడా హరీష్‌రావుకు అప్పగించే అవకాశం ఉందనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలోని నలుమూలల ఉన్న పార్టీ కార్యకర్తలతో పరిచయాలు ఉండటం, పార్టీపై హరీష్‌రావుకు పూర్తి పట్టు ఉండటం వల్ల పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందన్న ఆలోచనతోనే కేసీఆర్‌ ‌హరీష్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన చేసినట్లు సమాచారం. ఎప్పుడు కష్టపడే మనస్తత్వం ఉన్న హరీష్‌రావు కూడా పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఓకే చెప్పారనీ తెలుస్తుంది. ఇక, అధికారం మార్పునకు సంబంధించి ఇప్పటికే సిఎం కేసీఆర్‌ ‌మంత్రి హరీష్‌రావుతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. సిఎం కేసీఆర్‌ ‌హరీష్‌రావు ముందర పెట్టిన ప్రతిపాదనకు హరీష్‌రావు తన అంగీకారం తెలిపిన తర్వాతే…కేటీఆర్‌ను సిఎంగా చేయడానికి సంబంధించి మెల్లమెల్లగా లీకులు షురూ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే, ఊహించని నిర్ణయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన కేసీఆర్‌ ఎప్పుడు ఏం చేస్తారనేది చెప్పడం మాత్రం చాలా కష్టం. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ల గెలిచిన వెంటనే కేటీఆర్‌ను వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు స్వయంగా కేటీఆర్‌.. ‌హరీష్‌ ‌రావు ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. అప్పుడే టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి. ఇప్పుడు మళ్లీ కేటీఆర్‌కు పట్టాభిషేకం అనే వార్తల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో హరీష్‌ ‌రావుకు ఏం పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. అయితే, కేటీఆర్‌ను సిఎం చేయడానికి సంబంధించిన అంశంపై ముందుగానే కేసీఆర్‌ ‌హరీష్‌రావుతో చర్చించడం…పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు పదవీతో పాటు కీలకమైన మరో రెండు శాఖలను కట్టబెట్టడం, పార్టీ, ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత ఉంటుందన్న హామీ లభించడంతోనే మంత్రి హరీష్‌రావు తనపనేమో తాను అన్నట్లుగా చేసుకుంటూపోతూ… సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి!

Leave a Reply