Take a fresh look at your lifestyle.

కొరోనా కొనసాగితే ఆకలి చావులు తప్పవా?

కొరోనా వైరస్‌ ఇలానే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరువు బారినపడి చివరకు ఆకలిచావులు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నదంటోంది ఐక్యరాజ్యసమితి. కొరోనా పరిణామాలతో రాబోయేరోజుల్లో ప్రపంచం భారీ మూల్యాన్నే చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయంటోంది సమితి. ఇప్పటికే తిండిలేక, పనులులేక, పైసలులేక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అక్షరాస్యులైన నిరుద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెద్దదిగా ఉంది. వారికే ప్రపంచ దేశాలు సంపూర్ణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్న పరిస్థితిలో కొరోనా తీవ్ర సంక్షోభానికి కారణమైంది. వైరస్‌ ‌నుండి తప్పించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్న లాక్‌డౌన్‌ ‌కారణంగా గృహ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య, భారీ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అనేక సంస్థల కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులతో నడుస్తున్న ఆటోరంగం మూతపడింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న గృహనిర్మాణ రంగం నిర్వీర్యమైంది. యావత్‌ ‌ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీని పరిణామం కోట్లాది మంది జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. లక్షలాదిమంది ఒకపూట తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న భయాందోళనను ఐక్యరాజ్య సమితి వెలిబుచ్చుతోంది. ఇతర దేశాల్లో ఎలా ఉన్నా భారతదేశం మొదటి నుండీ దాతృత్వానికి పెట్టింది పేరు. కొరోనా కారణంగా ప్రజలంతా ఇండ్లకే పరిమితమవగా, రోజువారి కూలీలు, వలసకూలీలు మాత్రం ఏమేరకు అవస్తలు పడుతున్నది నిత్యం మీడియా ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నదే. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛందస్థలు ముందుకు రాగా, ఎవరికి తోచిన రీతిలో వారు తమ శక్తికొద్ది ఇప్పటికైతే సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా ఎంతకాలం సహాయం చేస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. తిరిగి అన్ని రంగాలు పుంజుకోవడానికి చాలా సమయం పట్టేట్టుగా ఉంది. ఉత్పత్తులు మొదలై మార్కెట్‌లోకి వచ్చినా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగేందుకు కూడా చాలా సమయమే పట్టేట్లుగా ఉందంటున్నారు. ఇదంతా కొరోనా అంతరించిపోయిన తర్వాత లేదా ఆ మహమ్మారిని నిరోధించేందుకు అనేక సంస్థలు అహోరాత్రులు కష్టపడి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన తర్వాత హమ్మయ్య అనుకున్నప్పుడు జరిగే పక్రియ. అప్పటివరకు ఇలానే లాక్‌డౌన్‌ ‌కొనసాగుతూపోతే ప్రపంచం పెను సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఐక్యరాజ్య సమితి ఆందోళన. దీని ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 50 కోట్ల ప్రజలు కరువుబారిన పడే అవకాశాలున్నాయన్న విషయంపై సమితి ఓ అధ్యయనంలో ఆందోళన వెలిబుచ్చింది. గడచిన మూడు దశాబ్దాల్లో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి కరువు పరిస్థితులు ఏర్పడడం ఇదే మొదటిసారంటోంది సమితి. అలాగే వరల్డ్ ‌ఫుడ్‌ ‌పోగ్రామ్‌ ‌చీఫ్‌ ‌డేవిడ్‌ ‌బిస్లే చెబుతున్నదాని ప్రకారం కొరోనా వ్యాధి ఇలానే మరికొంతకాలం వ్యాపించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం మొదలవుతుంది. నిజంగానే ఆహార సంక్షోభమే మొదలవుతే ఎంతలేదన్నా రోజుకు కనీసం మూడు లక్షల మంది చొప్పున చనిపోయే ప్రమాదమేర్పడుతుదంటారయాన.

కొరోనాతో ప్రపంచదేశాలు ఇప్పటికీ అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌, ‌సామాజిక దూరం, స్వీయ గృహనిర్భంధాలేవీ వైరస్‌ ‌విస్తృతిని నిరోధించలేకపోతున్నాయి. నిబంధనలను వ్యతిరేకించిన వారిపైన జైలు శిక్షలు మొదలు అనేక కఠినచర్యలను తీసుకుంటామని ఆయా దేశాలు ప్రకటించినా వైరస్‌ ‌విస్తరిస్తూనే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్పెయిన్‌, ‌ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్‌, ‌టర్కీ దేశాల్లో జననష్టం తీవ్రంగానే జరిగింది. మిగతాదేశాల్లో కూడా దీని ప్రభావం బాగానే కనిపిస్తున్నది. అయితే ఆయాదేశాలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలతో పాటు ఈ వ్యాధి నిరోధించేందుకు కావాల్సిన వ్యాక్సిన్‌ ‌తయారిలో కూడా చురుగ్గానే పనిచేస్తున్నాయి. అయితే క్లినికల్‌ ‌ట్రయల్‌ ‌మొదలు మనుష్యులపై ప్రయోగించి నిర్దారణ చేసుకోవడానికి ఎంతలేదన్నా కనీసం ఆరునెలల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. అప్పటివరకు జనం ఇండ్లకే పరిమితమైతే అన్ని రంగాలు కుంటుపడుతాయి. ఈ ఏడాది చివరివరకు కొరోనా ప్రభావం ఉండే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. ఆ దశలో పరిస్థితులు ఎంత ప్రమాదంగా మారుతాయోనన్న భయం ఆవరిస్తున్నది. దీంతో ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కునేందుకు పరిశ్రమలను పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నాయి. భారతదేశం లాంటి కొన్ని దేశాలు కొన్ని నిబంధనలతో సడలింపు కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ పూర్వస్థితి చేరుకోవడానికి ఎంతకాలం పడుతుందోనన్న ఆయోమయంలో ప్రజలున్నారు.

Leave a Reply