- రాష్ట్రంలో విజయవంతంగా కొసాగుతున్న ఫీవర్ సర్వే
- కేసిఆర్ కిట్‌తో ప్రభుత్వ హాస్పిటళ్లలో 54 శాతం కాన్పులు
- రాష్ట్రంలో ఒకేసారి ఎనిమిది మెడికల్ కళాశాలల మంజూరు చారిత్రాత్మకం
- మీడియా సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
వనపర్తి, ,ప్రజాత్రజనవరి 25 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన కేసిఆర్ కిట్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని దీంతో ప్రభుత్వ ధవఖానాల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావుతెలిపారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో 17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపి రాములుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసవాలకోసం మహిళలు ప్రభుత్వ దవఖానాలకే రావాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఉచితంగా కేసిఆర్ కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో తెలంగాణ ఉత్తమ సేవలందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందని, రాష్ట్రంలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి దవాఖానాలు, 30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం, పుట్టిన పిల్లల కోసం ఉన్న 18 ఎస్ఎన్సియు కేంద్రాలను ఏడేండ్లలో 65కు పెంచామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూపు ప్రణాళికతో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామని, గత కాంగ్రెస్, టిడిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి అన్నారు. కేసిఆర్ పాలనలో పాలమూరు అభివృద్ధికి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 15వందల కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని, వనపర్తి నాగర్‌కర్నూల్‌లో వొచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాలలో ఒక్కొక్కటి 50 కోట్లతో నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో ఐదు టీ డయాగ్నస్టిక్ కేంద్రాలు నెలకొల్పడం జరిగిందన్నారు.
దేశంలో పేదలకు సేవలందించడంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందని, బిజెపి న్యాయకత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉందని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద పేదలు ఏడాదికి 5లక్షల విలువైన వైద్య సేవలు అందుకునేలా కేసిఆర్ ఆదేశించారని, ఆ మొత్తాన్ని తామే 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జ్వర సర్వేకు ప్రజలందరు సహకరించాలని, కోటి 27లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు రాష్ట్రంలో పంపిణి చేశామన్నారు. రెండు కోట్ల కొరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచామని, కొరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని తెలిపారు. పరీక్ష కన్న ముందు లక్షణాలు కనిపిస్తే మందులువాడడం ప్రారంభించాలని, ప్రతి ఒక్కరు కొరోనా టీకా తీసుకోవాలని అన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రజలు పోటిపడాలని, ప్రజల ప్రాణాలకు వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలందించడం ఎంతో శుభసూసూచకమని అన్నారు. ప్రజలు ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాల సేవలు ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాదు ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ల సేవలు వనపర్తిలో అందుబాటులో తెచ్చామని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. ఒకేసారి 8 మెడికల్ కళాశాలలు కేసిఆర్ మంజూరు చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. దేశంలో 153 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడ కేటాయించలేదన్నారు.
బిజెపివి మాటలు ఎక్కువ..పని తక్కువ అని, 15-17 ఏండ్ల పిల్లలకు 90 శాతం మందికి టీకా వేసి వనపర్తి జిల్లా అగ్రభాగంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు. వనపర్తి అభివృద్దిని చూసి ఆనందపడుతున్నానని, రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నదని, సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్డు విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో తనకు తెలుసని దానికి ఏడాదిన్నర సమయం పట్టిందని అన్నారు. వనపర్తిలో ఆరు రహదారులు, నాలుగు లైన్లుగా విస్తరణ అంటే ఎంత కష్టపడాలో తనకు తెలుసన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి అభినందనీయమని కేసిఆర్ ఆశీస్సులు, తన సహకారం సంపూర్ణంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అనంతరం 500 కోట్లతో నిర్మించే మెడికల్ కళాశాల స్థలాన్ని 50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. కొరోనా వైరస్ కారణంగా నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకా వేసుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సామాజిక దూరం పాటిస్తూ బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ 330 పడకలతో వనపర్తి జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వొచ్చాయని కేసిఆర్ ఆశీస్సులు, హరీష్‌రావు సహకారంతో వనపర్తి పచ్చబడిందని వందేండ్లయిన సాగునీటికి డోకా లేదని బతుకుదెరువుకు భరోసానిచ్చారు. ఆరోగ్యం ఆర్థికం హారీష్‌రావు చేతిలో ఉన్నాయని వనపర్తి అభివృద్దికి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మెన్ ఎర్రోల్ల శ్రీనివాస్, కమీషనర్ వాకాటి కర్ణ, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయి చందు, డిఎంఈ రమేష్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాష డిఎంఅండ్హెచ్ఓ చందునాయక్, మున్సిపల్ చైర్మెన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మెన్ వాకిటి శ్రీధర్, ప్రజాప్రతినిధులు ఆరోగ్య అధికారులు, తదితరులు ఉన్నారు.