- అలా కలవడం చట్ట విరుద్ధమా..?
- బీజేపీ, కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాలు అవి కలిసే ఆస్కారం లేదు
- మంత్రి కెటిఆర్‌కు ఈటల కౌంటర్
హుజూరాబాద్‌లో బిజెపికి విశేష స్పందన..ఈటల గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తాను భేటీ అయ్యానని చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌కు బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల కౌంటర్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత వందలాది మందిని కలిసి మాట్లాడానని, సీపీఎం, సీపీఐతోనూ కలిసి మాట్లాడానని తెలిపారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. తనకు సంస్కారం ఉందని ఈటల తెలిపారు. అందరితో మాట్లాడే వాతావరణం ఉండాలి కానీ..కుసంస్కారం ఉండొద్దన్నారు. కిరణ్ కుమార్, వైఎస్, రోశయ్యతోనూ మాట్లాడానన్నారు.
కేసీఆర్ వొచ్చాక ఇతర పార్టీలతో బంధాలు తెగిపోయాయన్నారు. రేవంత్ రెడ్డిని కలవడం..సంస్కార హీనమైతే కాదు కదా అన్నారు. అవేవి• నిషేధించబడ్డ పార్టీలు కాదు కదా అన్నారు. తాను ఇప్పుడు కూడా కలుస్తానని..తనకు ఆ దమ్ము ఉందన్నారు. కలవడం చట్ట విరుద్దామా..? అని ప్రశ్నించారు. పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండాలని..బీజేపీ, కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాలని అవి కలిసే ఆస్కారం లేదని ఈటల పేర్కొన్నారు.
హుజూరాబాద్‌లో బిజెపికి విశేష స్పందన..ఈటల గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి
మాజీమంత్రి ఈటల రాజేందర్ వల్లే హుజూరాబాద్ ప్రజలకు దళిత బంధు వొచ్చిందని, దళిత బంధుకు ఈటల పేరు పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన కమలాపూర్ మండలం గూడూరులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీజేపీకి విశేష స్పందన వొస్తుందని తెలిపారు.
కెసీఆర్ సీఎం అయితే బంగారు తెలంగాణ చేస్తా అన్నారని, తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులు ఉండ కూడదనేదే కేసీఆర్ సిద్దాంతమని తప్పుబట్టారు. హుజూరాబాద్ ఎన్నికలు ఆత్మగౌరవ ఎన్నికలన్నారు. కేసీఆర్ కుటుంబానికి హుజూరాబాద్ ఎన్నికలో బుద్ధి చెప్పాలని కిషన్‌రెడ్డి వోటర్లకు పిలుపునిచ్చారు.