Take a fresh look at your lifestyle.

రాజ్యాంగ పదవిలో ఉన్నాను..రాజకీయాలు మాట్లాడను

  • అయితే ముందు తెలంగాణ సర్కార్‌ ‌ప్రోటోకాల్‌ ఎం‌దుకు పాటించడం లేదో చెపాలి
  • ఖమ్మం బీఆర్‌ఎస్‌ ‌సభలో సిఎంల వ్యాఖ్యలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : బిఆర్‌ఎస్‌ ‌ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో గవర్నర్‌ ‌వ్యవస్థపై సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. తాను రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడబోననని అయితే గవర్నర్‌కు సంబంధించి సీఎం ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదని ఆమె అన్నారు.  మిగతా రాష్ట్రాల గురించి తాను మాట్లాడబోనని కానీ తెలంగాణ సర్కార్‌ ఎం‌దుకు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదో చెప్పాలన్నారు. గవర్నర్‌ అం‌టే కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని తమిళి సై ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇది అహంకారం కాక మరేంటని అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రోటోకాల్‌ ఎం‌దుకు పాటించట్లేదో సమాధానమిచ్చిన తర్వాత మాత్రమే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలన్నారు. తాను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రొటోకాల్‌ ‌తనకు తెలుసన్నారు.

గవర్నర్‌ ‌వ్యవస్థను ఎలా హేళన చేస్తారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌గవర్నర్‌ను అవమానించారని ఆమె ఆరోపించారు. కాగా బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభలో సీఎంలు ప్రసంగిస్తూ రాష్ట్రాల గవర్నర్లు అమాయకులని, ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నది ప్రధాని మోదీయేనని ఆరోపించారు. గవర్నర్లకు మంచి జీతం, విలాసవంతమైన భవనాలు, ఐదేళ్లు సుఖంగా ఉండేలా పోస్టు ఇస్తారని, ఆపై సీఎంలను ఇబ్బంది పెట్టాలని దిల్లీ నుంచి ఫోన్లు చేస్తుంటారని ఆరోపించారు. ఇలా ఇబ్బంది పెడుతూ పోతే దేశం ఎలా బాగుపడుతుందని వారు ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్‌ ‌సీఎం స్టాలిన్‌ను, తెలంగాణ గవర్నర్‌.. ‌కేసీఆర్‌ను, దిల్లీ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌తననూ, పంజాబ్‌ ‌గవర్నర్‌ అక్కడి సిఎం మాన్‌ను ఇబ్బందిపెడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ‌నేరుగా ఆరోపించిన విషయం తెలిసిందే.

Leave a Reply