Take a fresh look at your lifestyle.

నేను రైతును మాట్లాడుతున్నాను

నేను రైతును మాట్లాడుతున్నాను
పొద్దు పొడిసినప్పటి నుండి పొద్దుమూకులు
కడుపుతిప్పలకోసం ఎద్దుకష్టం చేసే
రైతును మాట్లాడుతున్నాను.

భూమిలేకున్న కౌలు పొలం తీసుకొని
ఎద్దులేకున్న మెడపై కాడెత్తుకొని
పైసలేకున్న అప్పుసప్పుచేసి
ముద్దకూటికోసం
మూన్నుటరవై దినాలు యాతనపడే
రైతను మాట్లాడుతున్నాను.

ఇత్తునం ఇత్తింది మొదలు
కంకికోసి
పంట కల్లమై
గింజ గింజను మునివేళ్ళతో బస్తాలకెత్తి
కంచంలో ఉడుకుడుకు బువ్వగా మారేదాకా
కునుకుపోకుండా రెక్కలిరగా పనిజేసే
రైతును మాట్లాడుతున్నాను.

పిడికెడు గింజలు చిట్లిపోకుండా
సందెడు కంకులు పశువులు మేయకుండా
మంచెనెక్కి కాపుగాసి
నోట్లో నువ్వుగింజేసుకొని
కన్నమ్మ కష్టాలతో పంట పండిస్తే
అంగట్లో దొంగలంత ఏకమై నన్నే ముంచితిరి కదారా..

ఎండనకా భగ్గనకా
ఉరుమనకా మెరుపనకా
వాననకా గాలనకా
పగలనకా రాత్రనకా తండ్లాడినా
బుక్కబువ్వకు నోచుకోని రైతను నేను.

భూమి ఉన్నవాడినే కానీ
బువ్వదొరకనోడినే ఏ నాటికైనా…

ఓ పాలకులారా
మాపై ఎన్ని చట్టాలతో సిక్కమేసినా
నా పేరు అన్నదాత అనీ చెరిపేయలేవులే..!

నాకు భూమే బువ్వ
పనే నా ఊపిరి
సేనే నా చెలిమి
ప్రకృతే నా సంస్కృతి
ఎవుసమే నా పాణం.

నేను భూమితో మాట్లాడతాను
బురదతో మాట్లాడుతాను
గింజతో మాట్లాడుతాను
పక్షితో మాట్లాడుతాను
కంచెతో మాట్లాడుతాను
మంచెతో మాట్లాడుతాను
చెట్లు గుట్ట పుట్ట తట్ట అన్నింటితో మాట్లాడుతాను
ఒక్క నీతో తప్పించి.

ఓ పాలకుడా
నువ్వు ఎన్ని కడుపులు కొట్టినా
నీ కడుపు నింపే
రైతను మాట్లాడుతున్నాను.

– అవనిశ్రీ
9985419424.

Leave a Reply