Take a fresh look at your lifestyle.

నేనూ ప్రెసిడెంటునయ్యానోచ్‌!

“లక్షింపతి గాడు ప్రమాణ పత్రాన్ని మడిచి జేబులో పెట్టుకుని వెళ్లిపోబోతుండగా ఆపి,’’ఇంతకీ మీ అసోసియేషన్‌ ‌పేరేమిట్రా, రాయడం మర్చిపోయాను’’ అడిగాను. ‘‘పర్వాలేదు, నేను రాసుకుంటా గాని మా అసోసియేషన్‌ ‌పేరు ‘‘మా’’..ఇంగ్లీషులో MAA అంటాం’’‘‘వార్ని..మీ అసోసియేషన్‌ ‌పేరు కూడా ‘‘మా’’ యేనా? మీ MAA అంటే ఏమిటి?’’ అడిగాను ఉండబట్టలేక.‘‘ముదనష్టం అపార్ట్ ‌మెంట్స్ అసోసియేషన్‌… ‌మా బిల్డరు మా బిల్డింగు వల్ల బోలెడు నష్టాలు వచ్చాయని కసి కొద్దీ ఆ పేరు పెట్టిపోయాడు. మేం దానికి అసోసియేషన్‌ అని తగిలించి MAA అని పిలుచుకుంటున్నాం..”

కాండూరి లక్షింపతి అని నాకో ఫ్రెండున్నాడు. ఇవాళ పొద్దున్నే నాకు ఫోన్‌ ‌చేసి ‘‘గురూ.. నీతో అర్జెంటు పని పడింది. ఇంట్లోనే ఉంటావు కదా.. అరగంటలో వస్తాను’’ హడావిడిగా చెప్పి ఫోన్‌ ‌పెట్టేశాడు.
చెప్పినట్టుగానే అరగంటలో గాభరాగా వచ్చేశాడు. మంచినీళ్లు తాగి స్థిమిత పడ్డాక అడిగాను ‘ఏమిటి సంగత’ని.
వాడు చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక కుర్చీ దగ్గరికి లాక్కుని గుసగుసగా చెప్పాడు.
‘‘రేపు నేను మా అసోసియేషన్‌ ‌కి ప్రెసిడెంట్‌ ‌గా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాను.’’
నాకు అర్ధం కాలేదు. ‘‘అదేంటీ.. మా అసోసియేషన్‌ ‌కి ప్రెసిడెంటుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసేశాడుగా.. మళ్లీ నువ్వు చేయ్యడమేంటీ.. అయినా నువ్వు మా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచావా? నాకు తెలీనే తెలీదు సుమా!’’ అన్నాను.
మా వాడు చిరాకు పడ్డాడు. ‘‘ మా అసోసియేషన్‌ అం‌టే ఆ సినిమా వాళ్ల అసోసియేషన్‌ ‌కాదేహే.. మా అపార్ట్ ‌మెంట్‌ అసోసియేషను..’’ అన్నాడు.
‘‘అద్గదీ.. అలా చెప్పు.. ఎన్ని ఫ్లాట్సు ఉన్నాయేమిటి మీ బిల్డింగులో? ఓ వంద ఉంటాయా?’’ కుతూహలంగా అడిగాను.

‘‘వందా? నా బొంద.. సరిగ్గా పదంటే పదే ఫ్లాట్సు ఉన్నాయి మా బిల్డింగులో. ఆ అసోసియేషనుకే నిన్న ఎన్నికలు జరిగి నన్ను ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు’’ గొప్పగా చెప్పాడు.
‘‘అయ్యబాబోయ్‌.. ‌ప్ప్హది అపార్టుమెంట్ల అసోసియేషనుకి నువ్వు అధ్యక్షుడిగా ఎన్నికయ్యావా? చాలా పెద్ద పదవే.. కంగ్రాట్స్ ‌రా లక్షింపతీ’’ అని మనస్ఫూర్తిగా అభినందించి ‘‘ అవునూ.. ఈ ప్రమాణ స్వీకారం గోలేమిటీ? అపార్ట్ ‌మెంట్‌ అసోసియేషన్‌ ‌కి కూడా ప్రమాణ స్వీకారాలు ఉంటాయా’’ అని అడిగాను.
లక్షింపతి సిగ్గు పడ్డాడు. ‘‘ నిన్న టీవీలో మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చూశాక నాకు ఈ ఐడియా వచ్చిందిరా.. మా అసోసియేషన్‌ ‌మెంబర్స్ ‌కూడా సపోర్ట్ ‌చేశారు. అపార్ట్ ‌మెంట్స్ ‌లో ఆడా, మగా అందరికీ మధ్యాహ్నం లంచ్‌ ఇవ్వాలన్నారు. ‘‘సరే’’ అన్నాను. జెంట్స్ ‌కి మాత్రం రాత్రి మందు పార్టీ కావాలని మారాం చేశారు. ‘‘అయితే వాకే, వాకే’’ అనేసరికి మావాళ్లు ఎగిరెగిరి గంతులేశారనుకో ’’ మురిపెంగా చెప్పాడు.
‘‘మొత్తానికి బాగా ఖర్చు పెడుతున్నావురా!’’
‘‘అప్పుడే ఏం చూశావు? మా ఏరియా లోకల్‌ ‌కేబుల్‌ ‌చానెల్‌ ‌వాడు లైవ్‌ ‌పెడతానని తెగ సరదా పడుతున్నాడు. నాన్‌ ‌కమర్షియల్‌ ‌ప్రోగ్రాం కాబట్టి స్పెషల్‌ ‌డిస్కౌంట్‌ ‌కూడా ఇస్తానని ఆఫరిచ్చాడు. పేపర్లో యాడ్‌ ‌కూడా వేయిస్తానన్నాడు. సరే, వాడి సరదా మనమెందుకు కాదనాలని అది కూడా ఒకే చేశా!’’
‘‘వార్నీ దుంపతెగా.. ఏదో అమెరికా ప్రెసిడెంటు అయినట్టు ఆ బిల్డప్‌ ఏం‌ట్రా పిచ్చి మొహమా!’’ అని తిట్టాను.
వాడు మొహం మాడ్చుకుని ‘‘నా బతుక్కి మా అపార్ట్ ‌మెంట్‌ ‌బిల్డింగే అమెరికా అనుకుంటే నీకేంటి బాధ?’’ అన్నాడు.
‘‘అవున్లే.. నువ్వెలాగూ రిటైరయిపోయి పనీ పాటూ లేకుండా పడి ఉన్నావు. ఈ రకంగా అయినా నీకు కాస్త కాలక్షేపం దొరుకుతుంది’’ అని ఓదార్చాను. సడెన్‌ ‌గా డౌటొచ్చి, ‘‘ ఇంతకీ నాతో ఏం పనీ? అప్పు కావాలంటే మాత్రం ఇవ్వలేనొరే.. ముందే చెప్పేస్తున్నా..’’ అన్నాను.
‘‘నాకేం అప్పు అక్కర్లేదు గాని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదో చదువుతారు చూడు. ఆ నాలుగు ముక్కలు రాసివ్వు చాలు’’ అన్నాడు.
నాకు అరికాలి మంట నెత్తికెక్కింది.
‘‘ఒరే లక్షింపతీ.. ఏదో చీఫ్‌ ‌మినిస్టర్‌ ‌ప్రమాణ స్వీకారంలా ఫీలయిపోకురా బాబూ, చిరాకేసేస్తోంది.. అయినా అలాంటి పదవుల ప్రమాణ స్వీకారానికి స్టాండర్డ్ ‌ఫార్మేట్‌ ఉం‌టుంది గాని నీ బోడి అసోసియేషన్‌ ‌ప్రెసిడెంటు ప్రమాణానికి ఏం చూసి రాయాల్రా నా తలకాయ్‌!’’
‘‘‌బాబ్బాబు.. ఏదో ఒకటి రాసి ఇవ్వరా..నీ చిన్ననాటి స్నేహితుడి ముచ్చట తీర్చరా..’’ అంటూ బతిమాలడం మొదలుపెట్టాడు. ఇంకాసేపుంటే ‘‘స్నేహమే నా జీవితం’’ పాట పాడేస్తాడేమో భయం వేసింది.
‘‘సరే, రాస్తానుండు’’ అని కాసేపు ఆలోచించి, ఓ నాలుగు ముక్కలు రాసి, వాడికి చదివి వినిపించాను.
‘‘కాండూరి లక్షింపతి అనే నేను సిమ్మెంటు, ఇటుకల ద్వారా నిర్మితమైన ఈ భవనంలోని అపార్ట్ ‌మెంట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పదవి చేపడుతున్నాను. మెంబర్స్ ‌దగ్గర నుంచి మెయింటెనెన్స్ ‌చార్జీలు సకాలానికి వసూలు కాకపోయినా, ఒకటో తారీఖుకల్లా నా సొంత డబ్బులతో వాచ్‌ ‌మన్‌ ‌జీతం ఇచ్చేస్తానని, కరెంటు బిల్లు కట్టేస్తానని ప్రమాణం చేస్తున్నాను..’’
మావాడు అంతెత్తున ఎగిరిపడ్డాడు.
‘‘ఇదెక్కడి ఫిటింగురా బాబూ.. నా జేబుకి బొక్క పెట్టే ఇలాంటి తొక్కలో ప్రమాణాలు నేను చెయ్యనంతే!’’ అని చిందులు తొక్కాడు.
‘‘ పర్వాలేదురా..ప్రమాణ స్వీకారం అప్పుడు చదివే ఆ ప్రమాణాలకి ఎవరు కట్టుబడి ఉంటారు చెప్పు.. అపార్ట్ ‌మెంటు అసోసియేషన్‌ ‌కదా..వెరైటీగా ఉంటుందని అలా రాశాను. పైగా ఇందులో ఇంకో లాభం కూడా ఉందొరేయ్‌..‌మీ వాచ్‌ ‌మన్‌ ‌తెగ సంతోషించి, నీ సొంత పనులు కూడా కిక్కురుమనకుండా చేస్తాడు’’ మావాడు చల్లబడి, ‘‘ అంతేనంటావా..అలాగే కానీ’’ అన్నాడు.
‘‘ ఒరే, లక్షింపతీ.. రిజిస్టరులో సంతకం చేస్తే పొయ్యేదానికి ఇంత ఆర్భాటం ఎందుకురా?’’ లాలనగా అడిగాను.
మావాడు కిసుక్కున నవ్వాడు. ‘‘ మా మెంబర్సులో ఓ కుళ్లుగాడు ఉన్నాడ్రా! వాడు నా ఎన్నిక చెల్లదని కోర్టుకి వెళ్తాడేమోనని అనుమానం వచ్చి, నిన్న అప్పటికప్పుడు చార్జి తీసేసుకున్నాను. చార్జి తీసుకోవడం అంటే మరేం కాదు. మా వాచ్‌ ‌మన్‌ ‌కి జీతం ఇచ్చే వోచర్‌ ‌మీద సంతకం పెట్టేశాను. అలా చేస్తే నా ఎలక్షన్‌ ‌కి ఇక తిరుగు ఉండదని మా ఎలక్షన్‌ ఆఫీసరే సలహా ఇచ్చాడ్లే!’’
నాకు సుత్తి వీరభద్రరావులా పళ్లు పటపటకొరుకుతూ, చొక్కా చించేసుకుందామన్నంత ఆవేశం వచ్చినా, కొత్త చొక్కా కావడం వల్ల తమాయించుకున్నాను.
లక్షింపతి గాడు ప్రమాణ పత్రాన్ని మడిచి జేబులో పెట్టుకుని వెళ్లిపోబోతుండగా ఆపి,’’ఇంతకీ మీ అసోసియేషన్‌ ‌పేరేమిట్రా, రాయడం మర్చిపోయాను’’ అడిగాను.
‘‘పర్వాలేదు, నేను రాసుకుంటా గాని మా అసోసియేషన్‌ ‌పేరు ‘‘మా’’..ఇంగ్లీషులో MAA అంటాం’’
‘‘వార్ని..మీ అసోసియేషన్‌ ‌పేరు కూడా ‘‘మా’’ యేనా? మీ MAA అంటే ఏమిటి?’’ అడిగాను ఉండబట్టలేక.
‘‘ముదనష్టం అపార్ట్ ‌మెంట్స్ అసోసియేషన్‌… ‌మా బిల్డరు మా బిల్డింగు వల్ల బోలెడు నష్టాలు వచ్చాయని కసి కొద్దీ ఆ పేరు పెట్టిపోయాడు. మేం దానికి అసోసియేషన్‌ అని తగిలించి MAA అని పిలుచుకుంటున్నాం, అంతే..వస్తానొరే, ఇంకా బోలెడు పనులున్నాయి..చాలా థాంక్సు’’ అనేసి గబగబా వెళ్లిపోయాడు.

– మంగు రాజగోపాల్‌,‌ఫేస్‌బుక్‌ ‌నుంచి

Leave a Reply