- బడ్జెట్లో వారికి ఎప్పుడూ పన్నులు వేయలేదు
- మెట్రోలు, స్మార్ట్ సిటీలు వారికోసమే
- బడ్జెట్‌కు ముందు నిర్మలా సీతరామన్ వ్యాఖ్యలు
న్యూ దిల్లీ, జనవరి 16 : తాను మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచే వచ్చానని, వారి కష్టాలు తనకు బాగా తెలుసునని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంతవరకూ ఏ బడ్జెట్లోనూ మధ్యతరగతి వారిపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదని గుర్తుచేశారు. 5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రజలపై ఎలాంటి పన్నులు విధించలేదన్నారు. రాబోయే బడ్జెట్లోనూ మధ్యతరగతి కోసం మోదీ ప్రభుత్వం మరింత చేయబోతోందని చెప్పారు. మరో మూడు వారాల లోపే కేంద్ర బడ్జెట్ ప్రకటించనున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.’మధ్యతరగతి వారు ప్రజారవాణా సంస్థలపై ఎక్కువగా ఆధారపడు తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 27 ప్రాంతాల్లో మెట్రో తీసుకువచ్చాం.
అలాగే ఎక్కువ మంది మధ్యతరగతి వారు ఉద్యోగాలు వెతుక్కు నేందుకు ఒక సిటీ నుంచి మరో సీటీకి షిప్ట్ అవుతుంటారు. ఆ కారణంగా స్మార్ట్ సిటీల లక్ష్యంపై దృష్టి సారించాం. మధ్యతరగతి వారి కోసం మేము చేస్తున్న కృషి కొనసాగుతుందని నిర్మలా చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే ఎన్డీయే సర్కార్ చివరి బడ్జెట్ కావడంతో పన్నుల ఉపశమనం, హెల్త్ కేర్, ఉద్యోగాలపై ఈ బడ్జెట్లో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ధరల మంట, పన్ను పోట్ల నుంచి ఉపశమనం కోసం మధ్యతరగతి ప్రజలు కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తుండగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యతరగతిపై కేంద్ర బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై పలు సంకేతాలు పంపారు.
తాను మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తినని, వారి బాధలు, ఒత్తిళ్లు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఓవైపు అధిక ధరలతో పేదవర్గాలతో పాటు మధ్యతరగతి కుదేలవుతుంటే తాము ఇప్పటివరకూ ఏ బ్జడెట్లోనూ మధ్యతరగతిపై పన్ను వేయలేదని చెప్పు కొచ్చారు. ఉపాధి కోసం పెద్దసంఖ్యలో మధ్యతరగతి వర్గాల ప్రజలు నగరాలకు వలస బాట పడుతున్నదున తాము స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. మధ్యతరగతి మేలు కోసం తాము పనిచేయడం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్ధాయి బడ్జెట్ కావడంతో పన్ను మినహాయింపులు, ఆరోగ్య, ఉపాధి రంగాల్లో ఊరట కల్పించే చర్యలను కేంద్రం ప్రకటించాలని వారు కోరుతున్నారు.గత బడ్జెట్లో మధ్యతరగతిని విస్మరించిన నిర్మలా సీతారామన్ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్ధాయి బడ్జెట్లో ఏమాత్రం ఆసరాగా నిలుస్తారనేది వేచిచూడాలి.