కొరోనాపై మాట్లాడితే టిఆర్ఎస్కు మింగుడుపడడం లేదు
సిఎం కెసిఆర్‌కు బిజెపి లక్ష్మణ్ బహిరంగ లేఖ
కరోనా కేసుల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మణ్ విమర్శించారు. ఏప్రిల్‌లో 3.8శాతం ఉన్న కేసులు ఇప్పుడు 28శాతం పెరిగాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌ను కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని అన్నారు. నియంత పాలనకు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే నిదర్శనం లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.తెలంగాణలో రాచరిక పాలనకు కేసీఆర్ తెర లేపారని విమర్శించిన ఆయన ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే వాటిని టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో చూస్తుందన్నారు. కరోనా కట్టడిలో సర్కార్ నిర్లక్ష్యం వల్ల వైద్యులు, పోలీసులు, జర్నలిస్ట్ లు చెందడం బాధాకరమన్నారు.
హైదరాబాద్ లో కరోనాతో జనాలు పిట్టల్లా రాలుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. లాక్ డౌన్ సమయంలో నే టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం జూమ్ యాప్ ద్వారా ఆయన డియా సమావేశం నిర్వహించారు. మంచి సిద్దాంతం కోసం మోడీ, అమిత్ షా కలసి కట్టుగా పనిచేసి కశ్మీర్‌ను దేశంలో విలీనం చేశారని.. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని భావించిన మోడీకి కరోనా మహమ్మారి అడ్డుతగులుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం సలహాలు, సూచనలు చేస్తున్నామ న్నారు. ఎయిమ్స్ మాదిరిగా టిమ్స్ ను ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం నిర్వహణను మాత్రం గాలికి వదిలేసిందని.. శవాల ఆచూకి గల్లంతై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. కరోనాను కేంద్రం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తెస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీలో చేర్చడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయకుండా పేద ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ దగా చేస్తోందని విమర్శించారు.