ప్రస్తుత గంభీరమైన పరిస్థితుల్లో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు కొరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పరీక్షకు వచ్చిన ప్రతీ ఒక్కరి ఫలితాలు వచ్చేవరకు ఐసోలేషన్లో ఉండేలా అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. మంగళవారం కొరోనా పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్స్ కేంద్రాల ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ పరీక్షలకు, కోవిడ్ పరీక్షలకు చాలా తేడా ఉందనీ, ఇక్కడ సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు.
అందువల్ల పరీక్షలలో పాజిటివ్ వచ్చిన ప్రతీ వ్యక్తి వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలనీ, వెంటనే వైద్య, ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. పరీక్షలు ఇంటికి వచ్చి చేస్తామనీ, ఇంకా ఏ ఇతర పద్దతులలో కూడా మార్కెటింగ్ చేయొద్దని సూచించారు. విమాన ప్రయాణికులకు లక్షణాలు లేకపోయినప్పటికీ కొరోనా పరీక్షలు చేసి నివేదిక ఇవ్వొచ్చని తెలిపారు. పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్లను ఉపయోగించేలా చూడాలనీ, దీనిపై వారికి ప్రత్యేకంగా అవగాహన కలిగించాలనీ, లేదంటే వారికి, వారి ద్వారా ఇతరులకు కొరోనా సోకే అవకాశం ఉందని సూచించారు. కొరోనా పరీక్షలు నిర్వహించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ల్యాబ్ నిర్వాహకులకు మంత్రి ఈటల సూచించారు.