Take a fresh look at your lifestyle.

కొరోనా తగ్గినా వరద ముప్పుతో హైదరాబాద్‌ ‌విలవిల

కొరోనా రికవరీ కేసుల సంఖ్యలో భారత్‌ అ‌గ్రస్థానంలో ఉందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ఇది దేశ ప్రజలందరికీ సంతోషం కలిగించే వార్త. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కొరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.ఇలాంటి సమయంలో అశ్రద్ధ, ఏమరు పాటు లేకుండా మరింత జాగ్రత్త వహిస్తే పూర్తిగా ఈ మహమ్మారి బారి నుంచి బయటపడతామని హితవు ఇచ్చారు. కొరోనా తగ్గుముఖం పట్టినట్టు వార్తలు వొస్తున్నా రెండోసారి కొరోనా విజృంభిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. కొరోనా పోయిందన్న అలసత్వాన్ని ప్రదర్శించరాదన్న ప్రధాని సలహా ముమ్మాటికీ వాస్తవమే . ఎందుకంటే పండుగల సీజన్‌ ‌లో కొరోనా సంగతి మరిచి పోయి,ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొనే హడావుడిలో వైరస్‌ ‌సంగతి మరిచి పోయే ప్రమాదం ఉంది. జంటనగరాలు, ఆంధ్రప్రదేశ్‌ ‌లో వర్షాల కారణంగా ప్రజలువైరస్‌ ‌గురించి పట్టించుకోవడం లేదు. ముందు ఈ గండం నుంచి బయటపడితే చాలు అన్న ధోరణిలో పరస్పరం సహకరించుకుంటున్నారు.

ఇదీ అవసరమే.కానీ, ఇలాంటి సందర్భాల్లో కొరోనా నియంత్రణ జాగ్రత్తలను పాటించాలని చెప్పడమే ప్రధానమంత్రి ఉద్దేశ్యం. దేశాధినేతగా ప్రజలకు సలహా ఇవ్వడం, జాగ్రత్తలు సూచించడం ఆయన బాధ్యత. మన దేశంలో కొరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 67 లక్షలు దాటింది. మరణాల రేటు ఇతరదేశాలతో పోలిస్తే తక్కువే. సంపన్న దేశాలలో కోవిడ్‌ ‌కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా ఎక్కువే. ఆరు రాష్ట్రాల్లో 64 శాతం కేసులున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ‌కూడా ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ‌లో రికార్డు స్థాయిలో పరీక్షలు జరుగుతున్నందువల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ఓ వాదన ఉంది.ఇప్పుడు అక్కడ కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌ ‌లో అకాల వర్షాలు, భారీ వరదలు కొరోనా తీవ్రతను ప్రజలు మరిచిపోయేట్టు చేశాయి. కొరోనా ఉధృతి సమయంలో కూడా లేని భయాన్ని వరదల వల్ల ప్రజలు పొందుతున్నారు. వరదలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో బురద వల్ల జనం వీధుల్లోకి రాలేకపోతున్నారు. మురుగునీటి నిల్వవల్ల అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. కొరోనా కన్నా ఈ ప్రమాదం మరింత తీవ్రమైనది.

కొరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అగ్రదేశాలు తగిన మూల్యాన్ని చెల్లించాయి. ముఖ్యంగా, అమెరికా ఈ విషయంలో తన బాధ్యతను విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో అదే ప్రధానాంశం అయింది. కొరోనా వ్యాక్సిన్‌ ‌కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనీ, ఆ వ్యాక్సిన్‌ ‌వొచ్చే వరకూ ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి దేశ ప్రజలను హెచ్చరించారు. ఇది సబబైనదే. కొరోనా వ్యాప్తి పై సామాన్య ప్రజల్లో అవగాహన ఉంది.వారు మాస్క్ ‌లు ధరించడం, దూరాన్ని పాటించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.ఈ విషయంలో జాగ్రత్తలను పాటించనిది రాజకీయ నాయకులే. ముఖ్యంగా,. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు మద్దతుదారులను వెంటబెట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు నిరంతర వార్తా స్రవంతుల్లో చూస్తున్న వారికి కొరోనా పట్ల ఇంత నిర్లక్ష్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఆధ్యాత్మిక , మతపర ఉత్సవాలను తరతరాల గా చేసుకోవడం మనకు ఆనవాయితీయే కానీ, అదే సందర్భంలో ప్రస్తుతం మనం ఇప్పటికీ కొరోనా ప్రభావంలో ఉన్నామనే ఇంగితాన్ని మరిచిపోతే ప్రమాదం. ఇదే విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దుర్గా పూజ ఉత్సవాలు, దీపావళి సంబరాల సందర్భంగా జనం గుమికూడటం, కలిసిమెలిసి తిరగడం, నృత్యాలు చేయడం వంటి కార్యక్రమాల సందర్భంగా కొరోనా భయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్న ప్రధాని సూచన సమంజసమైనదే.

కొరోనా పరీక్షల్లో ప్రతి పది లక్షల మందిలో ఐదువేల మందికే కొరోనా సోకిందనీ, అమెరికా , బ్రెజిల్‌ ‌వంటి దేశాల్లో ప్రతి పది ల క్షల మందిలో 25 వేల మందికి పాజిటివ్‌ ‌వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. మన దేశంలో వైద్యులు, హాస్పిటల్‌ ‌సిబ్బంది , పోలీసులు, భద్రతాదళాలు ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్లుగాఅందించిన సేవలను భారత జాతి ఎన్నటికీ మరిచి పోదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, హైదరాబాద్‌ ‌లో కొరోనా సమయంలోనే సేవలు అందించిన పోలీసు యంత్రాంగమే ఇప్పుడు వరదల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే కొరోనా కాలంలో అష్టకష్టాలు పడినవారే ఇప్పుడు వరదల్లోనూ పెను సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి బాధలను మాటల్లో వర్ణించలేం. కొరోనా పూర్తిగా తగ్గలేదనే బెంగ ఒక వైపు, మురుగునీటి ప్రభావం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయేమోనన్న భయం మరో వైపుతో హైదరాబాద్‌ ‌కాలనీల్లోని ప్రజలు భయంతో వణుకుతున్నారు.ఇంకా వంద కాలనీలు నీటి మడుగులోనే ఉన్నాయని ప్రభుత్వం అంగీకరిస్తోంది. పులిమీద పుట్ర లా హైదరాబాద్‌ ‌వాసులకు కొరోనా బెంగతో పాటు వరద ముప్పు తయారైంది. ఈ సమయంలో హైదరాబాద్‌ ‌ని ఆదుకోవడానికి కొందరు ప్రముఖులు ఇప్పటికే ముందుకు వొచ్చారు.పలు రాష్ట్రాలు కూడా సహాయాన్ని ప్రకటించాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రస్తుత సమయంలో ఎన్నికల పుణ్యమా అని పరస్పరం నాయకుల ఆరోపణలు వెగటుపుట్టిస్తున్నాయి.

Leave a Reply