Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీ పేరుతో విష నగరి

  • కాలుష్య బాధితుల గోడు పట్టని ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్లక్ష్యంపై పౌర సమితి, విశ్రాంత శాస్త్రవేత్తల ఆందోళన

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీ పేరుతో సమీక్ష చేసి కోవిడ్‌ ‌మహమ్మారి వ్యాధి నేపథ్యంలో దీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం పట్ల కాలుష్య వ్యతిరేక పౌర సమితి ప్రతినిధులు, విశ్రాంత శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా సిటీ పేరుతో నిర్వహించిన సమీక్షలో అసలు కోవిడ్‌ ‌వైరస్‌ ‌నేపథ్యం గురించి చర్చించకపోవడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు. ఈమేరకు హైదరాబాద్‌ ‌కాలుష్య వ్యతిరేక పౌర సమితి నేత డా.నరసింహారెడ్డి, విశ్రాంత శాస్త్రవేత్త డా.కె.బాబూరావు, సోషలిస్ట్ ‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.లుబ్నా సర్వత్‌ ‌శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రికి కాలుష్య బాధితుల ఆక్రోశం పట్టదనీ, ఫార్మా ఎగుమతులతో రాసుల కొద్దీ కాసులు కొందరికే చెందే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధమైన అభివృద్ధి నిర్వచనాన్ని రాజకీయ పార్టీలు సైతం ప్రశ్నించకపోవడం శోచనీయమనీ, రాష్ట్రంలో పాలకులు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్‌ ‌మహమ్మారికి సమాధానంగా హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీని చూపెట్టే ముందు ప్రస్తుతం ఉన్న ఫార్మా పరిశ్రమ రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచిందని నిరూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ ‌నగరం ఇప్పటికే అనేక విషయాలతో పాటు నగరంలో పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం వల్ల అంతర్జాతీయ పటంలో స్థానం పొందిందని వ్యాఖ్యానించారు. ఫార్మా వ్యర్థ జలాల కారణంగా సూక్ష్మ జీవులు మందులకు నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నాయనీ, మందులకు లొంగని విధంగా అవి పరివర్తనం చెందాయని పరిశోధకులు చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఫార్మా పరిశ్రమలు అధికంగా ఉన్న పటాన్‌చెరు, జీడిమెట్ల, చౌటుప్పల్‌, ‌కొత్తూరు వంటి ప్రాంతాలలో కాలుష్యం వెదజల్లుతున్న విషయం అందరికీ తెలిసిందేననీ, ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతాలలోని గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి, అత్యంత ప్రమాదకర ఘన వ్యర్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారని గుర్తు చేశారు. దాదాపు 30 ఏళ్ల నుంచి పటాన్‌చెరు ప్రాంత ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన ప్రాజెకును విరమించుకోవాలనీ, అన్ని రాజకీయ పార్టీలు ఫార్మా పరిశ్రమల ఏర్పాటుతో పెరిగే కాలుష్యం వంటి అంశాల నియంత్రణకు నడుం బిగించాలనీ, ప్రభుత్వం పార్మా పరిశ్రమ బాధితులను ఆదుకునేందుకు ప్రాథమికంగా రూ. 1500 కోట్ల నిధిని ఏర్పాటు చేసి ఆయా కుటుంబాల ఆరోగ్యం, జీవనోపాధుల పెంపుదలకు, స్థానిక సహజ వనరుల పరిరక్షణకు వినియోగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

error: Content is protected !!