- అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నగరం
- కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్టస్ సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు..డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని మంత్రి ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్టస్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగశ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ స్వాగతించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. వొచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఈని ప్రారంభించబోతున్నాం. అడ్వాన్స్ ఆటో పార్టస్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చెన్నై, బెంగుళూర్, ముంబై నగరాలంటే ఇష్టం…కానీ హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందలన్నదే తన ధ్యేయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా తర్వాత అతిపెద్ద గ్లోబల్ సెంటర్‌గా హైదరాబాద్‌ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్‌లో మొదటి ఆటో మొబైల్ సంస్థ అని, ఇప్పటికే గూగుల్, మైక్రోసాప్ట్, అమెజాన్ లాంటివి హైదరాబాద్‌లో తమ అతిపెద్ద సెంటర్లని స్థాపించాయని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి సరసన అడ్వాన్స్ ఆటో పార్టస్ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆటోమేటీవ్ రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్ ఉందన్న ఆయన.. ఈవీ పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ టెక్నాలజీ హబ్ గా మారిపోయిందని, అమెరికన్ సంస్థలు పోటీ పడి మరీ హైదరాబాద్ కి వస్తున్నాయని, ఫార్ములా-ఈ రేస్ ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని మంత్రి ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని, డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని చెప్పారు. పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ గణాంకాలు 2021, అక్టోబర్‌లో ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోనివే అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.